ETV Bharat / bharat

రాజ్యసభ పోలింగ్​: 8 స్థానాల్లో ఫలితాలు.. భాజపా, కాంగ్రెస్​కు చేరో నాలుగు

author img

By

Published : Jun 10, 2022, 10:02 AM IST

Updated : Jun 10, 2022, 10:50 PM IST

MP Elections
రాజ్యసభ ఎన్నికలు

21:54 June 10

నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అయితే, కర్ణాటక, రాజస్థాన్​లో మాత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడగా.. భాజపా ఫిర్యాదుతో హరియాణా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలో.. కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్​ జరగగా.. మూడు స్థానాలను అధికార భాజపా కైవసం చేసుకుంది. భాజపా తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, ప్రముఖ నటుడు, రాజకీయ నేత జగ్గేశ్​, మాజీ ఎంఎల్​సీ లెహర్​ సింగ్​ సిరోయాలు గెలుపొందారు. కాంగ్రెస్​ తరఫున బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్​ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజస్థాన్​లో.. రాజస్థాన్​లో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్​ జరగగా.. మూటింట అధికార కాంగ్రెస్​ పార్టీ గెలుపొందింది. భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ అభ్యర్థులు రణ్​దీప్​ సుర్జేవాలా, ముకుల్​ వాస్నిక్​, ప్రమోద్​ తివారీలు ఎన్నికైనట్లు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ట్వీట్ చేశారు. భాజపా తరఫున బరిలో దిగిన మాజీ మంత్రి ఘనశ్యామ్​ తివారీ విజయం సాధించారు.

09:41 June 10

రసవత్తరంగా రాజ్యసభ 'పోరు'.. 4 రాష్ట్రాల్లో 16 స్థానాలకు పోలింగ్ షురూ​

Rajyasabha Polls: 4 రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఓటింగ్​ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి.

జూన్‌- ఆగస్టు మధ్య వివిధ తేదీల్లో 57 మంది ఎంపీల పదవీకాలాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి. రెండు అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న భాజపా బలం సైతం నూరులోపే పరిమితం కానుంది.

రాజ్యసభ ఎన్నికల్లో ఈ సారి రెండు స్థానాలకు గట్టి పోటీ ఎదురుకానుంది. రాజస్థాన్‌ నుంచి స్థానికేతరులను బరిలోకి దించడంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి రాజుకుంది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకునేందుకు భాజపా ప్రయత్నాలు చేపట్టింది. జీ మీడియా గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్రను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి మద్దతు ప్రకటించింది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి గెలవాలంటే 41 స్థానాల అవసరం ఉంది. కాంగ్రెస్‌ రెండు స్థానాలు, భాజపా ఒక స్థానం సులువుగా గెలుచుకునే వీలుండగా.. సుభాష్‌ చంద్ర రూపంలో మరో అభ్యర్థి బరిలోకి దిగడం గట్టి పోటీ నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హోటళ్లకు తరలించింది.

రెండు స్థానాలున్న హరియాణాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఓ అభ్యర్థి గెలవాలంటే 31 ఓట్లు కావాలి. సరిగ్గా అంతే బలం ఉన్న కాంగ్రెస్‌ నుంచి అజయ్‌ మాకెన్‌ బరిలోకి దిగుతున్నారు. ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు దక్కనీయకుండా చేసేందుకు ఇక్కడా మరో మీడియా అధిపతి కార్తికేయ శర్మ స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇక్కడ భాజపా ఆయనకు మద్దతిస్తోంది. దీంతో రాజస్థాన్‌, హరియాణాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి పరోక్షంగా భాజపా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

  • ఏపీ నుంచి భాజపా నుంచి సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్‌ల పదవీకాలం ముగియనుంది.
  • పంజాబ్‌లో ఆప్‌ అధికారంలో ఉండడంతో ఈసారి రెండు స్థానాలనూ ఆ పార్టీనే గెలుచుకోనుంది. ఫలితంగా అక్కడి నుంచి కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పార్టీలు ప్రాతినిధ్యం కోల్పోనున్నాయి.
  • బహుజన్‌ సమాజ్‌ పార్టీ పెద్దల సభలో ఒక్క స్థానానికే పరిమితం కానుంది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఎనిమిదింటిని భాజపా, దాని మిత్రపక్షాలు, మూడింటిని ఎస్పీ గెలుచుకోనున్నాయి.
  • ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందే వారంతా జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా.. ఈ విషయాలు తెలుసా?

రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో పలువురు గవర్నర్లు.. తమిళిసై కూడా!

Last Updated :Jun 10, 2022, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.