ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా.. ఈ విషయాలు తెలుసా?

author img

By

Published : Jun 10, 2022, 5:00 AM IST

Updated : Jun 10, 2022, 6:33 AM IST

Presidential poll: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని అత్యున్నత పదవికి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ప్రథమ పౌరుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ ఎన్నికకు సంబంధించి పలు కీలక విషయాలు మీ కోసం..

presidential polls
రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా

President Election: భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని అత్యున్నత పదవికి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ గురువారం దిల్లీలో షెడ్యూల్‌ను ప్రకటించారు. సహచర కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండేతో కలిసి ఆయన విలేకర్లకు వివరాలను వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ప్రథమ పౌరుడి ఎన్నికకు షెడ్యూలు నిర్ణయించినట్లు చెప్పారు.ఈమేరకు రాష్ట్రపతి ఎన్నికకు జూన్‌ 15న (బుధవారం) నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. జులై 18న (సోమవారం) ఓటింగ్‌ (అవసరమైతే) నిర్వహిస్తారు. 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల అధికారులు కూడా ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ముఖ్యాంశాలివే..

  • ఇంతవరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. ఈసారి కూడా అదే తరహాలో పూర్తి స్వేచ్ఛగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే ముందు 60వ రోజున గానీ, ఆ తర్వాత గానీ షెడ్యూల్‌ జారీ చేయొచ్చు. ఆ నిబంధన ప్రకారమే తాజాగా ఎన్నికల ప్రణాళికను వెల్లడించింది.
  • లోక్‌సభ, రాజ్యసభ సెక్రెటరీ జనరళ్లు ఒక్కో ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈసారి రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ వంతు వచ్చినందున వారు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్ర రాజధానుల్లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు (ఏఆర్‌వో) ఉంటారు.

తెలుగు రాష్ట్రాల్లో..

  • ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ డిప్యూటీ సెక్రెటరీలు కె.రాజకుమార్‌, ఆర్‌.వనితారాణి, తెలంగాణకు అసెంబ్లీ జాయింట్‌ సెక్రెటరీ సీహెచ్‌ ఉపేందర్‌రెడ్డి, డిప్యూటీ సెక్రెటరీ వీఎన్‌ ప్రసన్నకుమారి ఏఆర్‌వోలుగా నియమితులయ్యారు.
  • ఏపీలో వెలగపూడిలోని అసెంబ్లీ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాల్‌ నెంబర్‌ 201లోను.. తెలంగాణలో హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్స్‌లోని అసెంబ్లీ భవనం కమిటీ హాల్‌ నెంబర్‌ 1లోనూ పోలింగ్‌ జరుగుతుంది.

నామినేషన్‌ విధానం..

  • నామినేషన్‌ పత్రాలు దిల్లీలో మాత్రమే ఇస్తారు. అభ్యర్థుల నామినేషన్‌ను తప్పనిసరిగా ఎలక్టోరల్‌ కాలేజీలోని 50 మంది ప్రతిపాదించాలి. మరో 50 మంది బలపరచాలి.
  • నామినేషన్‌ను అభ్యర్థి నేరుగా గానీ, ప్రతిపాదకులు, బలపరిచేవారి ద్వారా గానీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో దాఖలు చేయొచ్చు. ఇందుకు గాను రూ. 15,000 డిపాజిట్‌ చెల్లించాలి.

ఓటింగ్‌ ప్రక్రియ..

రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రస్తుతం ఇందులో మొత్తం 4,809 మంది సభ్యులుండగా.. వారి ఓటు విలువ 10,86,431. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఆ హక్కు ఉండదు.

  • ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దవుతుంది. ఓటింగ్‌ మార్క్‌ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ను ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నందున వాటిఫలితాలు వచ్చిన తర్వాత ఓటర్ల జాబితాను నవీకరించి వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
  • ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమతమ శాసనసభల్లో ఓటు వేయొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మరెక్కడైనా ఓటింగ్‌ చేయాల్సిన పరిస్థితి వస్తే కనీసం 10 రోజుల ముందుగా ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య విధానాన్ని అనుసరించాలి. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు.
  • ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ రాజకీయ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌లు జారీ చేయడానికి వీల్లేదు.
  • ఈ ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం నిషేధం. అభ్యర్థి గానీ, వారికి సంబంధించిన వారు గానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికను రద్దు చేయొచ్చు.
  • బ్యాలెట్‌ బాక్సులు దిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. అక్కడ పోలింగ్‌ అనంతరం వాటిని దిల్లీకి తిరిగి తీసుకొచ్చి రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహిస్తారు. తర్వాతవారే గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు.
  • ముందస్తు నిర్బంధంలో (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) ఉన్న ఓటరుకు తన ఓటు వేయడానికి హక్కు ఉంది. జైళ్లలో ఉన్న మిగతా వారు ఓటు వేయొచ్చా? లేదా? అన్నది వారి పెరోల్‌పై ఆధారపడి ఉంటుంది. అలాంటి వారు తొలుత పెరోల్‌ కోసం జైలు సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం సూపరింటెండెంట్‌ పెరోల్‌ ఇస్తే వారు వచ్చి ఓటేయొచ్చు.
  • ఓటు విలువ లెక్కింపు ఇలా..
  • ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లెక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకొని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యిచే గుణించగా వచ్చిన సంఖ్యచే భాగిస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యచే గుణించి ఆ రాష్ట్ర మొత్తం ఓటు విలువగా నిర్ధరిస్తారు. ఈమేరకు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌ విలువ 83,824 ఉండగా, సిక్కిం విలువ అతి తక్కువగా 224కి పరిమితమైంది.
  • ఎంపీలకు సంబంధించి.. దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ (5,43,321)ను మొత్తం ఎంపీల సంఖ్య (776)చే భాగిస్తారు. ఈమేరకు ఈసారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.
    presidential polls
    రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా

తెలంగాణ ఓట్ల విలువ 32,508
రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీల బలాబలాలపై చర్చ మొదలైంది. తెలంగాణలో మొత్తం 119 మంది శాసనసభ్యులు, 17 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132 కాగా... ఎంపీ ఓటు విలువ 700. మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15,708 కాగా ఎంపీలవి 16,800. మొత్తం రాష్ట్రం నుంచి పోలయ్యే ఓట్ల విలువ 32,508. ఇందులో తెరాసవి 76 శాతం.

అభ్యర్థి తేలాక...
రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశం ఇంకా తేలకపోవడంతో ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై స్పష్టత రాలేదు.గత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీయేకు తెరాస మద్దతునిచ్చింది. ఈసారి మాత్రం దానికి వ్యతిరేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయశక్తి రూపకల్పనలో భాగంగా వివిధపార్టీల నేతలతో భేటీ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించారని సమాచారం. తెరాస పార్టీ వర్గాల్లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది.

presidential polls
రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా
presidential polls
రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా

ఇదీ చదవండి:'నాకు మరో మూడు వారాలు గడువు కావాలి'.. ఈడీకి సోనియా విజ్ఞప్తి

Last Updated : Jun 10, 2022, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.