ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. రాష్ట్రపతి పాలనకు కుట్ర'.. జైలు నుంచి రాగానే సిద్ధూ ఫైర్

author img

By

Published : Apr 1, 2023, 6:10 PM IST

Updated : Apr 1, 2023, 6:39 PM IST

navjot sidhu release
navjot sidhu release

కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయ్యారు. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కారణంగా ఆయనకు జైలు శిక్ష పడింది. ఏడాది పాటు శిక్ష పడినప్పటికీ.. నెలన్నర ముందుగానే సిద్ధూ జైలు నుంచి విడుదలయ్యారు. బయటకు రాగానే కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శలు గుప్పించిన ఆయన.. నియంతృత్వాన్ని ఎదిరించడానికి పుట్టిన విప్లవమే రాహుల్ గాంధీ అని అన్నారు.

పంజాబ్​ కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ జైలు నుంచి విడుదల అయ్యారు. మూడున్నర దశాబ్దాల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. గతేడాది మే నుంచి పంజాబ్​లోని పటియాలా సెంట్రల్ జైల్లోనే ఉన్న ఆయనకు.. సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలం కాస్త తగ్గింది. ఫలితంగా శనివారం సాయంత్రం జైలు నుంచి సిద్ధూ బయటకు వచ్చారు.

'రాహుల్ ఓ విప్లవం..'
జైలు నుంచి విడుదల కాగానే కేంద్రంపై విమర్శలు గుప్పించారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. పటియాలా జైలు నుంచి బయటకు రాగానే మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని ఆరోపించారు. స్వతంత్ర సంస్థలను బందీలుగా చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియంతృత్వాన్ని ఎదిరించే విప్లవం అని చెప్పుకొచ్చారు. పంజాబ్​లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు సిద్ధూ.

'దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నియంతృత్వం వచ్చిన ప్రతిసారి ఓ విప్లవం పుడుతుంది. ఇప్పుడు వచ్చిన విప్లవం పేరు రాహుల్ గాంధీ' అంటూ తనదైన శైలిలో బీజేపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. 'పంజాబ్​లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నుతున్నారు. పంజాబ్​ను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తే.. మీరు కూడా బలహీనం అవుతారు' అని హెచ్చరించారు.

కార్యకర్తల సంబరాలు
సిద్ధూ విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు శనివారం ఉదయమే జైలు వద్దకు చేరుకున్నారు. 'నవజ్యోత్ సిద్ధూ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. సిద్ధూ మధ్యాహ్నమే జైలు నుంచి బయటకు వస్తారని తొలుత భావించినా.. సాయంత్రం వరకు ఆయన విడుదల ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు చెప్పారు. ఫలితంగా ఆయన అభిమానులు అనేక గంటలపాటు జైలు బయటే ఎదురుచూశారు. సాయంత్రం కారాగారం నుంచి బయటకు వచ్చిన సిద్ధూకు స్వాగతం పలికారు.
మరోవైపు, సిద్ధూ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఇదివరకు ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండగా.. దాన్ని వై కేటగిరీకి కుదించింది.

సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ క్యాన్సర్‌ బారిన పడినట్లు ఇటీవల వెల్లడైంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌లో వేదికగా స్వయంగా చెప్పారు. అయితే, ఇటువంటి ఆపద సమయంలో భర్త విడుదల తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు ఆమె తెలిపారు. జైల్లో ఉన్న సిద్ధూ కంటే బయట ఉన్న తానే ఎక్కువ బాధను అనుభవిస్తున్నానంటూ నవజ్యోత్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధూ కుమారుడు కరణ్​ సిద్ధూ కూడా తన తండ్రి జైలు నుంచి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అయితే జైలు ఫ్యాక్టరీలో పనిచేసినందుకు, సత్ప్రవర్తన కారణంగానే ఆయన్ను నెలన్నర ముందుగా విడుదల చేసినట్లు తెలుస్తోంది.

అంతకుముందు.. నవజ్యోత్​ సింగ్ సిద్ధూ సోదరి సుమన్​ టూర్​ తన సోదరుడ్ని.. జైలు నుంచి విడుదల చేయాలని పంజాబ్ సీఎం, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞుప్తి చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్​ కౌర్​కు క్యాన్సర్ కారణంగా సోదరుడ్ని ముందస్తుగా విడుదల చేయాలని కోరారు. నవజ్యోత్ సిద్ధూను కరుణ ప్రాతిపదికన విడుదల చేయాలని ఆమె వీడియో ద్వారా కోరారు.

వాయిదా పడ్డ విడుదల!
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ 2023 జనవరి 26న పటియాలా సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తారని భావించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా 50 మంది ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. వారిలో నవజ్యోత్ సిద్ధూ పేరు కూడా ఉందని ఆయన సన్నిహితులు వెల్లడించారు. సత్ప్రవర్తన కారణంగానే నవజ్యోత్ సిద్ధూని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపినట్లు అతని అనుచరులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంతోషంలో మునిగి తేలారు. అయితే కొన్ని కారణాల వల్ల నవజ్యోత్ సిద్ధూ విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు 10 నెలల శిక్ష తర్వాత ఆయన శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు.

శిక్ష ఎందుకు?
34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవజ్యోత్‌ సింగ్​ సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పటియాలో పార్కింగ్‌ విషయంలో జరిగిన ఘర్షణలో 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూతోపాటు రూపిందర్‌.. గుర్నామ్​పై దాడి చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ ముగిసిన అనంతరం.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు 2022 మే నెలలో తీర్పు వెలువరించింది. దీంతో మే 20న కోర్టు ముందు లొంగిపోయిన ఆయన్ను పటియాలా సెంట్రల్​ జైలుకు తరలించారు.

Last Updated :Apr 1, 2023, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.