ETV Bharat / bharat

'3Dతో అన్ని కలలు సాకారం.. 2047లో జెండా ఎగిరే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్​'

author img

By

Published : Aug 15, 2023, 1:55 PM IST

PM Modi Independence Day Speech : సంపూర్ణ భారత వికాసమే తన విధానమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పంద్రాగస్టు వేళ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగరేసిన మోదీ.. అభివృద్ధి నినాదం చేశారు. వెయ్యేళ్ల స్వర్ణయుగానికి తమ నిర్ణయాలు.. బాటలు పరుస్తాయని వెల్లడించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలికాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తన గెలుపు ఖాయమని పరోక్షంగా ధీమా వ్యక్తం చేశారు. 2024 ఆగస్టు 15న మరోసారి ఎర్రకోట నుంచి దేశం సాధించిన ప్రగతిని వివరిస్తానని తెలిపారు.

pm-modi-independence-day-speech-at-red-fort-delhi-2023-independence-day-celebrations
స్వాతంత్య్ర దినోత్సవం ప్రధాని మోదీ ప్రసంగం

PM Modi Independence Day Speech : వలసపాలన నుంచి దేశం స్వేచ్ఛావాయువులు పొంది 77ఏళ్లైన సందర్భంగా.. యావత్ భారతావని స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకొంది. దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ.. వరసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్‌ఘాట్‌కు వెళ్లిన ప్రధాని.. మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత ఎర్రకోటకు చేరుకుని జాతీయజెండాను ఆవిష్కరించారు.

pm-modi-independence-day-speech-at-red-fort-delhi-2023-independence-day-celebrations
మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తున్న మోదీ

స్వతంత్ర పోరాట సమయంలో దేశం కోసం త్యాగం.. నాటి లక్షణమన్నారు ప్రధాని మోదీ. దేశం కోసం జీవించడం నేటి అవసరమని ఆయన స్పష్టంచేశారు. స్వతంత్ర సమరయోధులు, దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసేందుకు యత్నిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. తాను దేశ ప్రజల కుటుంబ సభ్యుడేననన్న మోదీ.. తన ప్రయత్నంలో అందరూ సహకరించాలని కోరారు.

pm-modi-independence-day-speech-at-red-fort-delhi-2023-independence-day-celebrations
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగం

"ఈ అమృతకాలం మనందరికీ కర్తవ్యకాలం. స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, 1947కు ముందు జన్మించిన వారికి దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం లభించింది. వారు ప్రాణ త్యాగానికి వెనుకాడేవారు కాదు. మన అదృష్టం కొద్దీ దేశంకోసం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు మాత్రం దేశం కోసం జీవించటానికి మించిందిలేదు. క్షణక్షణం మనం దేశం కోసం జీవించాలి. 2047లో తిరంగా జెండా ఎగిరేనాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం ప్రకటించాలి."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలను నిర్మూలించిననాడే.. జాతి మనుగడ, అభివృద్ధి సాధ్యమని మోదీ సూచించారు. సాంకేతికత, పారదర్శక విధానాలతో.. అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు. తాము నిజాయితీతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు వెల్లడించారు. వారసత్వ, బుజ్జగింపులు రాజకీయాలు దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యంలో వికృత పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడ్డారు. "ప్రజాస్వామ్యంలో వికృత పరిస్థితులెప్పుడూ కూడా భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేవు. ఆ రోగం ఏమంటే వారసత్వ పార్టీలు. వారి మంత్రం ఏమంటే, పార్టీ అంటే కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు.. ఇదే వారి జీవిత నినాదం. కుటుంబవాదం, సోదర, మేనల్లుడివాదం ప్రతిభకు శత్రువులు. యోగ్యతను తిరస్కరిస్తాయి. సామర్థ్యాన్ని అంగీకరించవు. అందువల్ల ఈ దేశ ప్రజాస్వామ్య బలోపేతం కోసం వారసత్వ రాజకీయాలకు విముక్తి పలకాలి." అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

pm-modi-independence-day-speech-at-red-fort-delhi-2023-independence-day-celebrations
స్వాతంత్య్ర దినోత్సవ వేడకల్లో ప్రధాని

3Dతో అన్ని కలలు సాకారం
జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం అనే మూడింటికి దేశానికి చెందిన అన్ని కలలను సాకారం చేసే సామర్థ్యం ఉందన్నారు ప్రధాని. ఈ అమృత కాలంలో మనం తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు.. రానున్న వెయ్యేళ్ల భవిష్యత్తును నిర్దేశిస్తాయని వివరించారు.

"మన దగ్గర ఇప్పుడు జనాభా ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, భిన్నత్వం ఉంది. జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం ఈ మూడింటికి భారత్‌కు చెందిన అన్ని కలలను సాకారం చేసే సామర్థ్యం ఉంది. నేను చెప్పే మాటలు గుర్తుంచుకోండి. ఈ అమృతకాలంలో మనం చేసే కార్యాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే త్యాగాలు, తపస్సు. సకల జనుల హితం కోసం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు రానున్న 1000 ఏళ్లపై ప్రభావం చూపుతాయి. దేశ స్వర్ణ చరిత్రకు అంకురార్పణ చేస్తాయి.
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

2024 ఎన్నికల్లో గెలుపుపై ధీమా
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం ఖాయమని మోదీ పరోక్షంగా చెప్పారు. వచ్చే ఏడాది పంద్రాగస్టు రోజున ఎర్రకోటపై భారత్ సాధించిన ప్రగతిని.. తాను వివరిస్తానని వెల్లడించారు.

77th Independence Day 2023 : ఏ శక్తికీ భారత్ భయపడదు.. తలవంచదు : ప్రధాని మోదీ

'సొంతింటి కోసం కొత్త పథకం.. రూ.లక్షల్లో ప్రయోజనం'.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.