ETV Bharat / bharat

'MLAలకు కొత్త కార్లు ఇవ్వం, పాతవి వాడుకోవాల్సిందే'- సీఎం కీలక నిర్ణయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 9:20 PM IST

No New Cars To MLAs In Mizoram : రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిని పెట్టుకుని ఎమ్మెల్యే, మంత్రులకు గానీ కొత్త కార్లు కొనుగోలు చేయకూడదని మిజోరం సీఎం లాల్​దుహోమా నిర్ణయించారు. కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

No New Cars To Mlas In Mizoram
No New Cars To Mlas In Mizoram

No New Cars To MLAs In Mizoram : మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM) పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలకుగానీ, మంత్రులకుగానీ కొత్త కార్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. కార్ల కొనుగోలుతో ప్రజాధనం వృథా అవుతుందని లాల్​దుహోమా తెలిపారు. గత మంత్రులు, ఎమ్మెల్యేలు వాడిన వాహనాలనే కొనసాగించాలని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు కల్పించిన సౌకర్యాలతో పోలిస్తే దాదాపు 50 శాతం మేర తగ్గించుకుంటామని సీఎం లాల్​దుహోమా తెలిపారు. మిజోరం ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చాలని, అందుకు కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పూర్తి స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు లాల్​దుహోమా.

పసుపు, చెరకు, మిరప, వెదురు తదితర స్థానిక ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని లాల్‌దుహోమా ప్రకటించారు. ప్రభుత్వానికే విక్రయించాలన్న షరతులేమీ లేవని, ప్రైవేటు వ్యక్తులెవరైనా ఎక్కువ ధర చెల్లిస్తే వారికైనా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం 12 ప్రాధాన్యాలను గుర్తించామని, వాటిని నెరవేర్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కమిటీలో ప్రభుత్వంతోపాటు గుర్తింపు పొందిన పార్టీ నాయకులు, ఎన్జీవోలు, మత సంఘాలకు, మిజోరం పీపుల్స్‌ ఫోరానికి చెందిన సభ్యులు కూడా భాగస్వాములుగా ఉంటారని అన్నారు. పొదుపు చర్యలు, పెట్టుబడుల ఉపసంహరణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.

జడ్‌పీఎం విధివిధానాలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించాలని అన్ని శాఖల అధికారులకు సీఎం లాల్‌దుహోమా ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖలకు చెందిన మంత్రులు దీనిని పర్యవేక్షించాలని సూచించారు. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్న లాల్‌దుహోమా రాష్ట్రంలో ఇప్పటికే నమోదైన అవినీతి కేసులపై సీబీఐతో విచారణ జరిపిస్తానన్నారు.

మరోవైపు గత ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన కాంట్రాక్టు పనులు ఇప్పటికే ప్రారంభమైతే కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యథావిథిగా పనులు కొనసాగించవచ్చని సీఎం తెలిపారు. అయితే, ప్రాజెక్టుల్లో నాణ్యత లోపిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, సిబ్బంది హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

ఇటీవల జరిగిన మిజోరం శాసనసభ ఎన్నికల్లో లాల్​దుహోమా నేతృత్వంలోని జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ మొత్తం 40 సీట్లకుగానూ 27 సీట్లు విజయం సాధించింది. MNF 10 సీట్లు, బీజేపీ 2, కాంగ్రెస్ 1 సీటు సాధించింది. ఈ నేపథ్యంలో మిజోరం ముఖ్యమంత్రిగా లాల్‌దుహోమా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మిజోరం పీఠం ZPMదే- కొత్త సీఎంగా ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఇన్​ఛార్జ్​- ఎవరీయన?

వండర్​ బైక్​ 250- రూ.8 ఖర్చుతో 30కి.మీ జర్నీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.