ETV Bharat / bharat

'ఆ రోడ్డు ప్రమాదాలకు ఇకపై అధికారులే బాధ్యులు'

author img

By

Published : Oct 18, 2022, 3:17 PM IST

Updated : Oct 18, 2022, 3:48 PM IST

రోడ్డు నిర్మాణ నాణ్యతలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎన్‌హెచ్‌ఏఐ సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ అలాంటి రోడ్లలో ప్రమాదాలు జరిగితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

NHAI to hold officials
భారత జాతీయ రహదారుల సంస్థ

రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తేలితే దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని 'భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI)' తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఒప్పందం లేదా పాలసీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీపడి సర్టిఫికెట్‌ జారీ చేస్తే విధుల ఉల్లంఘనగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలా చేసిన ఎన్‌హెచ్‌ఏఐ/ఐఈ/ఏఈ విభాగాలకు చెందిన అధికారులు/ప్రతినిధులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలసీ నిబంధనలు, కాంట్రాక్టు ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా వ్యవహరించొద్దని తెలిపింది.

రోడ్డుపై మార్కింగ్‌లు, సూచిక బోర్డులు, క్రాష్‌ బ్యారియర్ల ఏర్పాటు వంటి తుది మెరుగులు పూర్తి కాకుండానే అధికారులు రోడ్డు నిర్మాణం పూర్తయినట్లుగా సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఉత్తర్వుల్లో ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. ఇది పూర్తిగా ప్రయాణికుల భద్రతను గాలికొదిలేయడమే అవుతుందని స్పష్టం చేసింది. దీని వల్ల ఎన్‌హెచ్‌ఏఐకి చెడ్డ పేరు వస్తుందని తెలిపింది. అన్ని విధాలుగా రోడ్డు పూర్తి కాకుండా సర్టిఫికెట్‌ ఇస్తే.. ఒకవేళ దానిపై ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా లేదా తీవ్రంగా గాయపడ్డా దానికి రీజినల్‌ ఆఫీసర్‌/ప్రాజెక్టు డైరెక్టర్‌/ఇండిపెండెంట్‌ ఇంజినీర్‌ను బాధ్యుల్ని చేస్తామని స్పష్టం చేసింది.

రోడ్డు నిర్మాణంలో ప్రధాన పనులు పూర్తయ్యి.. చిన్న చిన్న తుది మెరుగులు ఇంకా చేయాల్సి ఉన్నప్పుడు వాటిని 'పంచ్‌ లిస్ట్‌'లో చేర్చి సర్టిఫికెట్‌ జారీ చేస్తుంటారు. అయితే, ఆ పనుల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనేది నిబంధన. వాటిని సర్టిఫికెట్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని చోట్ల ప్రధాన పనుల్లో భాగమైన కొన్ని కీలక అంశాలను సైతం పంచ్‌ లిస్ట్‌లో చేర్చి సర్టిఫికెట్‌ పొందుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ దృష్టికి వచ్చింది. దీని వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated :Oct 18, 2022, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.