ETV Bharat / bharat

శిందే సర్కార్ నిలబడేనా? ఉద్ధవ్ మళ్లీ సీఎం అవుతారా?.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ!

author img

By

Published : May 10, 2023, 7:11 PM IST

Updated : May 11, 2023, 12:44 PM IST

shiv sena supreme court
shiv sena supreme court

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శివసేన ఉద్ధవ్ వర్గం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై ఏక్​నాథ్ శిందే సర్కార్​ భవితవ్యం ఆధారపడి ఉంది.

మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే కొనసాగుతారా? మరోసారి ఉద్ధవ్​కు సీఎం పగ్గాలు వెళ్తాయా? శిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితేంటి? మళ్లీ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో సమాధానం రానుంది. శివసేన ఉద్ధవ్​ ఠాక్రే వర్గం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం కొద్ది రోజుల కిందటే తీర్పును రిజర్వ్ చేసింది.

2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది.. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా శిందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ శిందే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుకు ఆశ్రయించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిరక్షణకు ఇదొక్కటే మార్గమని పేర్కొంది. తిరుగుబాటు నేత, ఆయన వర్గ ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియ ఉపసభాపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే శిందేతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన అప్పటి గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయాన్ని కూడా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ప్రశ్నించింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ తన రాజ్యాంగ పరిధిని అతిక్రమించి వ్యవహరించారని ఆరోపించారు.

మరోవైపు.. ఫిరాయింపు ఆరోపణలతో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ ప్రకారం తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ శిందే వర్గం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పులను వెలువరించనుంది. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరఫున కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వర్గం తరఫున హరీశ్ సాల్వే, ఎన్‌కే కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.

మరోవైపు.. శివసేన ఉద్ధవ్ వర్గం పిటిషన్​పై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని పాటించడం వల్ల దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. అలాగే శిందే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ కూడా స్పందించారు. 'సుప్రీంకోర్టు కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నా. తీర్పు విషయంలో మాకు ఎటువంటి భయం లేదు.' సంజయ్ శిర్సత్ అన్నారు.

Last Updated :May 11, 2023, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.