Karnataka Elections 2023 : జనతా దళ్ సెక్యులర్- జేడీఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా.. 20-25 నియోజకవర్గాల్లో తమ పార్టీకి ఎదురు దెబ్బ తగలొచ్చని చెప్పారు ఆ పార్టీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి. ఆర్థిక వనరుల లోటే ఇందుకు కారణమని అన్నారు. బుధవారం కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే.. బిదాదిలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి.
"మా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మందికి నేను ఆర్థికంగా అండగా నిలవలేకపోవడం నాకు బాధ కలిగించింది. నిధుల విషయంలో ప్రజల నుంచి నాకు సాయం లభిస్తుందని ఆశించా. కానీ అలా జరగలేదు. జేడీఎస్‌కు గెలవగల నేతలు ఉన్న చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర వంటి అనేక నియోజకవర్గాల్లో.. అభ్యర్థులకు అండగా నిలవడంలో నేను విఫలమయ్యాను." అని కుమారస్వామి చెప్పారు.
వారిని అలా చూడొద్దు ప్లీజ్..
"పార్టీ నిధి నుంచి కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగానే డబ్బులు వెళ్లాయి. కానీ విజయావకాశాలు ఉన్న కొన్ని సీట్ల విషయంలో మాత్రం నేను సరిపడా నిధులు సమకూర్చలేకపోయాను. అంచనాలకు తగ్గట్టుగా పార్టీకి విరాళాలు రాకపోవడమే ఇందుకు కారణం." అని వివరించారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. అయితే.. అభ్యర్థులపై తప్పుడు భావన కలిగి ఉండొద్దని కోరారు. "అభ్యర్థుల నమ్మకాన్ని నేనే వమ్ము చేశా. ఇది నా తప్పే. మా అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్న 50-60 నియోజకవర్గాల్లో వారి అంచనాలకు తగ్గట్టుగా నేను నిధులు సమకూర్చలేకపోయా" అని అంగీకరించారు కుమారస్వామి.
కింగ్ మేకర్ కాదు.. కింగ్..
దాదాపు 25 నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు రావచ్చని చెబుతూనే.. కర్ణాటకలో తాము అధికారం చేపడతామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. "నా లెక్క ప్రకారం.. మాకు 120కిపైగా సీట్లు వస్తాయి. ఆర్థిక వనరుల కొరత ఉన్నా మేము కాంగ్రెస్, బీజేపీ కన్నా ముందే ఉంటాము." అని చెప్పారు. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా అనే ప్రశ్నకు.. "కింగ్ మేకర్ కాదు.. మా పార్టీ కింగ్ అవుతుంది. చూద్దాం." అని బదులిచ్చారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా హంగ్ ఏర్పడితే ఏం చేస్తారన్న ప్రశ్నకు కుమారస్వామి సూటిగా జవాబు ఇవ్వలేదు. "ఏం జరుగుతుందో చూద్దాం. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో అప్పుడు చర్చిస్తాం" అని సమాధానం చెప్పారు. కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరిగింది. 2018 శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుంది.