ETV Bharat / bharat

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవకు బెయిల్‌.. 'షరతులు వర్తిస్తాయి'

author img

By

Published : Jul 18, 2023, 12:40 PM IST

మద్యం కుంభకోణంలో మాగుంటకు బెయిల్
మద్యం కుంభకోణంలో మాగుంటకు బెయిల్

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో మాగుంట రాఘవకు బెయిల్‌ లభించింది. అనారోగ్య కారణాలతో మాగుంటకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలంటూనే.. దిల్లీ హైకోర్టు షరతులు విధించింది. ట్రయల్ కోర్టు ముందు పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Delhi Liquor Scam: ఎక్సైజ్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ మాగుంటకు వైద్య కారణాలతో దిల్లీ హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్ దినేష్ కుమార్ శర్మ బెయిల్ మంజూరు చేస్తూ.. మాగుంటను చెన్నై లేదా ఢిల్లీ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు. ఆయన చెన్నైకే పరిమితం కావాలని ఆదేశించింది. అదే విధంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ అధికారులకు రిపోర్టు చేయాలని హైకోర్టు పేర్కొంది. "ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా అతను భారతదేశం విడిచి వెళ్లకూడదు. అతను ట్రయల్ కోర్టు ముందు పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి" అని హైకోర్టు పేర్కొంది. వైద్య కారణాలతో మాగుంట బెయిల్‌ను ఇతర కేసులకు ఉదాహరణగా పరిగణించబోమని స్పష్టం చేసింది.

2021లో మద్యం పాలసీ... ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాగుంట తదితరులపై కేసులను విచారిస్తున్న సీబీఐ, ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అక్రమాలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్లకు అనుచితమైన ఆదరణ లభించిందని ఆరోపించారు. 2021 నవంబర్ 17న మద్యం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చిన ఢిల్లీ ప్రభుత్వం... అవినీతి ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 2022 చివరిలో దానిని రద్దు చేసింది. సీబీఐ, ఈడీ రెండు కేసులలో నిందితుడిగా ఉన్న సిసోడియా ప్రస్తుతం జైలులో ఉన్నారు.

మద్యం పాలసీని మార్చేందుకు ప్రయత్నం... దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డికి బెయిల్ దొరికింది. దిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవ్‌ కీలకపాత్ర పోషించారని ఈడీ ఆరోపణ. సిండికేట్‌ ఏర్పాటు సహా ముడుపులు ముట్టజెప్పడంలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట దిల్లీలో రెండు రిటైల్‌ జోన్లను కలిగి ఉన్న రాఘవ.. దిల్లీ మద్యం పాలసీని మార్చే ప్రయత్నం చేశారని ఈడీ ఆరోపించింది. మద్యాన్ని ఉత్పత్తి చేసేవారికి రిటైల్‌ జోన్లు ఉండకూడదనే నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఈడీ వాదిస్తోంది. కాగా, మాగుంట ఆగ్రోఫామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భాగస్వాములుగా ఉన్న పేర్లన్నీ డమ్మీలేనని కోర్టుకు వెల్లడించిన ఈడీ.. రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారానే మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం దక్కించుకున్నాడని తెలిపింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సమీర్‌ మహేంద్రు దీనిని ధ్రువీకరిస్తూ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు చెప్తూ.. కోర్టు ఆదేశాల మేరకు రాఘవ రెడ్డిని తిహాడ్‌ జైలుకు తరలించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.