ETV Bharat / bharat

కేరళలో కరోనా విజృంభణ- మూడో దశకు సంకేతమా?

author img

By

Published : Jul 29, 2021, 8:56 PM IST

Covid-19 Third wave
కరోనా మూడో దశ ముప్పు

కేరళలో వరుసగా మూడోరోజు 20వేలకుపైగా కరోనా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. కొత్త కేసులు భారీగా వెలుగు చూడటం మూడో దశకు సంకేతమా? కేరళ ఏం చెబుతోంది?

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. మళ్లీ 40వేలకుపైగా చేరుకున్నాయి. కరోనా తొలినాళ్లలో సమర్థవంతంగా కట్టడి చేయగలిగిన కేరళలోనే దాదాపు సగం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్​ నిబంధనలు గాలికి వదిలేసి, విచ్చలవిడిగా జనసంచారం చేయటం వల్ల మూడో దశ ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలో వరుసగా మూడు రోజులుగా 20వేలకుపైగా కొత్త కేసులు నమోదవటం మూడో దశకు సంకేతమా?

కేరళాకు కేంద్ర బృందం..

వరుసగా మూడోరోజు 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో కొవిడ్​ కట్టడి కోసం కేంద్ర బృందం కేరళ వెళ్లనుంది. వైరస్​ పునరుత్పత్తి ఆర్​-ఫ్యాక్టర్​ వృద్ధి కొద్ది వారాల పాటు గరిష్ఠ స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మ్యాథమెటికల్​ సైన్సెస్​ నిపుణులు. ఆర్​-ఫ్యాక్టర్​ 1 పైన ఉంటే వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంటుంది. కేరళలో పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్​-ఫ్యాక్టర్​ 1.11 శాతంగా ఉంది.

మూడో దశకు ఆరంభ సంకేతం: మహారాష్ట్ర

కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటం మూడో దశకు ఆరంభమని పేర్కొన్నారు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ టోపే. అయితే.. మూడో దశ ముప్పును ఎదుర్కొనేందుకు తాము సిద్ధమవుతున్నట్లు చెప్పారు. సరిపడా ఆక్సిజన్​, వైద్యులు, పడకలు, ఆరోగ్య సిబ్బంది, ఔషధాలను సిద్ధంగా ఉంచామన్నారు.

సొంత ఫార్ములే కొంప ముంచుతోందా?

దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా కేరళలోనే నమోదవటం ఆందోళన కలిగిస్తోందని, అక్కడి ప్రభుత్వం శాస్త్రీయ నియమాలను పాటించటం లేదన్నారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​. ఇది గ్లోబల్​ మహమ్మారి అని, వైరస్​ కట్టడికి డబ్ల్యూహెచ్​ఓ, ఐసీఎంఆర్​ మార్గదర్శకాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ, కేరళ ప్రభుత్వం సొతం నియమాలు, ఫార్ములాను పాటింస్తోందన్నారు. అయితే.. ఆ ఫార్ములా విఫలమైందనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. అక్కడి ప్రభుత్వం శాస్త్రీయ నియమాలను, ఫార్ములాను పాటించాలని సూచించారు. కేరళ ప్రభుత్వం ఈ మహమ్మారిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించారు.

" ఈద్​ సందర్భంగా ఇచ్చిన సడలింపు పూర్తిగా అశాస్త్రీయం. అది నియమాలకు పూర్తి విరుద్ధం. ప్రస్తుతం కేసుల పెరుగుదల, తగ్గుదల ఆధారంగా సడలింపులు ఇవ్వటం లేదు. రాజకీయ, ఓటు బ్యాంకును అనుసరించి ఇస్తున్నారు. "

- వీ మురళీధరన్​, విదేశాంగ శాఖ సహాయ మంత్రి

మూడో దశ కాదు: కేరళ ప్రభుత్వం

కరోనా కేసులను కట్టడి చేసేందు కోసం ప్రతిఒక్క పాజిటివ్​ కేసును గుర్తించాలనుకుంటున్నట్లు చెప్పారు కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్​. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు.. మూడో దశ ముప్పు కాదని స్పష్టం చేశారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందుకోసమే పరీక్షల సంఖ్యను పెంచామని, అందుకే పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. 'కొద్ది రోజులుగా పరీక్షలు భారీగా పెంచాం. బుధవారం 1.96 లక్షల పరీక్షలు చేశాం. ఈరోజు 1.63 లక్షల టెస్టులు చేశాం. ఎక్కువ టెస్టులు చేసేందుకే ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్క పాజిటివ్​ కేసును గుర్తించాలనుకుంటున్నాం.' అని తెలిపారు.

కేరళకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని, వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణలు తాము మంచి రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నామని చెబుతున్నట్లు తెలిపారు వీణా జార్జ్​. ఐసీఎంఆర్​ సెరో సర్వే ప్రకారం 40శాతం మందిలో యాటీబాడీలు ఉన్నాయని, అదే మా వ్యవస్థ సరైన స్థానంలోనే ఉందని చూపుతోందని స్పష్టం చేశారు. 50శాతానికిపైగా ప్రజలు ఇప్పటికీ వైరస్​ బారినపడలేదని గుర్తు చేశారు. డెల్టాతో కేసులు పెరుగుతున్నాయని, మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.

జికా పంజా..

కరోనాతో హడలిపోతున్న కేరళలో జికా వైరస్​ కూడా చాపకింద నీరులా పాకుతోంది. రాష్ట్రంలో మరో ఐదు జికా వైరస్​ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్రఆరోగ్య మంత్రి వీణా జార్జ్​ తెలిపారు. మొత్తం జికా కేసులు 61కి చేరుకున్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం 7 మాత్రమే యాక్టివ్​ కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: Covid in india: దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.