ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు షాక్​.. యూట్యూబ్​ ఛానెళ్లు బంద్ చేస్కోవాల్సిందే!

author img

By

Published : Feb 19, 2023, 5:33 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఓ రాష్ట్ర సర్కార్​ షాక్ ఇచ్చింది. ఇకనుంచి ప్రభుత్వ విధులు నిర్వర్తించే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్​ ఛానెల్​ను నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల అదనపు సంపాదనను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.​

Kerala Govt Ban Govt Employees Youtube Channels
కేరళ ప్రభుత్వ ఉద్యోగుల యూట్యూబర్లపై బ్యాన్​

స్టార్​డమ్​తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు కూడా వారి ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్​ ఛానెల్స్​ను నడుపుతున్నారు. కొందరు వారు రోజూ చేసే ప్రొఫెషనల్​ వర్క్​ కాకుండా వీటితో కూడా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొందరు వంటల ఛానెల్స్​తో సొమ్ము చేసుకుంటుంటే, మరికొందరు కామెడీ వీడియోస్​ అప్లోడ్​ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఈ అదనపు ఆదాయ మార్గంపై నిషేధం విధించింది కేరళ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్​ ఛానెల్స్​ను నిర్వహించవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఈ నెల 3న విడుదల చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించడం.. 'కేరళ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు-1960' చట్టాన్ని ఉల్లంఘించడమేనని జీఓలో పేర్కొన్నారు. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులకు యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి అనుమతి మంజూరు చేయడం ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధ్యం కాదని అడిషనల్​ చీఫ్ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా, తాజాగా సోషల్ మీడియాలో కళాత్మక పనులకు సంబంధించి వీడియోస్​ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ ఫైర్ రెస్క్యూ సర్వీస్ శాఖ సమర్పించిన దరఖాస్తును నిరాకరిస్తూ అదనపు ప్రధాన కార్యదర్మి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Kerala Govt Ban Govt Employees Youtube Channels
ప్రభుత్వ యూట్యూబర్లపై కేరళ ప్రభుత్వం జారీ చేసిన జీవో

యూట్యూబ్​తో సంపాదనిలా..
ఎవరైనా సరే యూట్యూబ్​ ఛానెల్​ ద్వారా డబ్బు సంపాదించాలంటే.. వారు ప్రారంభించిన ఛానెల్​కు గత సంవత్సర కాలంలో కనీసం వెయ్యి మంది సబ్​స్క్రైబర్లు కలిగి ఉండాలి. దీంతో పాటు నాలుగు వేల గంటల పాటు వీరు అప్లోడ్​ చేసిన కంటెంట్​ను యూజర్లు వీక్షించాలి. అప్పుడు సదరు ఛానెల్​ యజమాని మానెటైజేషన్​ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా ఆదాయన్ని పొందొచ్చు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.