ETV Bharat / bharat

విస్తృత ధర్మాసనానికి హిజాబ్​ కేసు- కళాశాలల బంద్​తో కాస్త ప్రశాంతత!

author img

By

Published : Feb 9, 2022, 5:02 PM IST

Karnataka Hijab Issue: కళాశాలల్లో హిజాబ్​ ధరించి రావడంపై ఆంక్షలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. మరోవైపు.. కర్ణాటకలో ఉన్నత విద్యా సంస్థల మూసివేతతో ఉద్రిక్తతలు కాస్త తగ్గాయి.

Karnataka hijab issue
Karnataka hijab issue

Karnataka Hijab Issue: కళాశాలల్లోకి హిజాబ్‌ ధరించి రావడంపై ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని.. జస్టిస్ కృష్ణ దీక్షిత్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హిజాబ్‌ లాంటి అంశాలు పర్సనల్ లాకు సంబంధించి రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని పేర్కొంది. కళాశాలల్లోకి హిజాబ్‌ ధరించి రావడంపై ఆంక్షలను సవాల్‌ చేస్తూ ఐదుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు.

Karnataka hijab issue
కర్ణాటక హైకోర్టు

కళాశాలల మూసివేతతో..

కర్ణాటకలో ఉన్నత విద్యా సంస్థల మూసివేతతో హిజాబ్‌ వివాదం కాస్త సద్దుమణిగింది. వారం రోజులుగా హిజాబ్‌కు అనుకూల, వ్యతిరేక నినాదాలతో మా‌ర్మోగిన కళాశాలల ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. హిజాబ్‌ వివాదంపై అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలపై మండిపడింది. సమస్యను వారికి అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించింది.

కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్‌ వివాదం క్రమంగా రాష్ట్రమంతటా వ్యాపించింది. హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక నినాదాలతో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారగా.. పలువురు విద్యార్థులు సైతం గాయపడ్డారు.

Karnataka hijab issue
హిజాబ్​ ధరించిన విద్యార్థినుల నిరసన

విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌, బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థలకు 3 రోజుల సెలవు ప్రకటిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది.

ప్రభుత్వం ఆంక్షలు..

హిజాబ్​ వివాదం నేపథ్యంలో.. కర్ణాటక సర్కార్​ అప్రమత్తమైంది. విద్యాసంస్థల పరిసరాల్లో(200 మీ. పరిధిలో) ఆందోళనలు, నిరసనలు, గుమికూడటాన్ని నిషేధించింది. రెండు వారాల పాటు(ఫిబ్రవరి 22 వరకు) ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

Karnataka hijab issue
విద్యాసంస్థల పరిసరాల్లో నిరసనలపై పోలీసుల అప్రమత్తం

కాంగ్రెస్​, భాజపా మాటల యుద్ధం..

హిజాబ్‌ వివాదం సద్దుమణుగుతున్న సమయంలో.. కాంగ్రెస్‌ మరోసారి సమస్యకు ఆజ్యం పోస్తోందని కర్ణాటక హోం మంత్రి అగర జ్ఞానేంద్ర మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను అరేబియా సముద్రంలోకి నెట్టేస్తారని ఎద్దేవా చేశారు. శివమొగ్గ జిల్లాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో జాతీయ జెండాను కిందకు దించి, దానిస్థానంలో కాషాయ జెండాను ఎగరవేశారని.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో అలాంటి ఘటన జరగలేదని కర్ణాటక ఆర్థికమంత్రి అశోక స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ అక్కడ జాతీయ జెండా ఉండదని తెలిపారు. శివకుమార్‌ బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ఏదో ఒక ప్రకటన ఇచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఈ విధానం కాంగ్రెస్‌కు మంచిది కాదని హితవు పలికారు. హిజాబ్‌ విషయంలో కాంగ్రెస్‌ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

కళాశాలల్లో యూనిఫామ్‌ మినహా మరే రకమైన దుస్తులకు అవకాశం లేదని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని మంత్రి జ్ఞానేంద్ర మరోసారి గుర్తుచేశారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్న మంత్రి హైకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. డ్రెస్‌కోడ్‌పై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదన్నారు.

విద్యార్థుల ఆవేదన..

మరోవైపు హిజాబ్‌ వివాదం వల్ల తాము చదువులను కోల్పోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాలు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యామని, ఇప్పుడు తరగతులు ప్రారంభమైన తరుణంలో హిజాబ్‌ వివాదంతో నష్టపోతున్నామని అన్నారు. ప్రధానంగా ప్రాక్టికల్‌ తరగతులు ఆన్‌లైన్‌ బోధన ద్వారా తెలుసుకోవడం సాధ్యంకాదని తెలిపారు. సమస్య త్వరితగతిన సద్దుమణిగి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని కోరారు.

ప్రముఖుల ఆందోళన..

Hijab Controversy: కర్ణాటకలో హిజాబ్​ వివాదంపై ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకకూడదని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అన్నారు. మహిళలు ఏ వస్త్రాలు ధరించాలని నిర్ణయించుకునే అధికారం వారికి ఉంటుందని, వేధించడం ఆపాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. 'బికినీ, ఘూంఘాట్​, హిజాబ్​, జీన్స్​ ఇలా ఏది ధరించాలో నిర్ణయించుకునే అధికారం మహిళలకు ఉంటుంది. రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది' అని ప్రియాంక పేర్కొన్నారు.

మరోవైపు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల.. హిజాబ్ ధరించిన విద్యార్థులను తరగతిగదిలోకి అనుమతించకపోవటం దారుణమన్నారు.

ఇవీ చూడండి: 'బికినీ, జీన్స్​, హిజాబ్​.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'

'హిజాబ్' వివాదం హింసాత్మకం- లాఠీ ఛార్జ్​లు, రాళ్ల దాడులు

కులమతాలే ప్రచారాస్త్రాలు- మౌలిక సమస్యల ప్రస్తావనే లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.