ETV Bharat / bharat

కులమతాలే ప్రచారాస్త్రాలు- మౌలిక సమస్యల ప్రస్తావనే లేదు!

author img

By

Published : Feb 9, 2022, 9:34 AM IST

UP Election 2022
UP Election 2022

UP Election 2022: ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా మౌలిక సదుపాయాలు, పథకాలు, అభివృద్ధి వంటివి మాటలు రాజకీయ నేత నోట వినిపిస్తాయి. సామాన్యుడికి లబ్ది చేకూర్చే పథకాలతో ప్రజల ముందుకు వస్తారు. అయితే యూపీలో అందుకు భిన్నంగా.. కులమతాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. వాటిపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి.. వాటి ఆధారంగానే వ్యూహరచన చేస్తున్నాయి.

UP Election 2022: దేశంలోకెల్లా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పట్లాగే కులమతాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ సమీకరణాలకు అనుగుణంగానే పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పులు చేసుకుంటున్నాయి. సామాజికవర్గాల ప్రాతిపదికన ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికీ గిట్టనివాడిలా మిగిలిపోతున్నాడు- సామాన్యుడు! తాగునీటి కొరత, ఉపాధి లేమి వంటి సమస్యలు నేతల ప్రచారంలో ప్రస్తావనకైనా నోచుకోకపోతుండటం చూసి నోరెళ్లబెడుతున్నాడు. తనకు కూడు పెట్టలేని కులమతాలు ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేస్తుండటంతో బోరుమంటున్నాడు.

ముజఫర్‌నగర్‌ అల్లర్ల చుట్టూ..

పశ్చిమ యూపీలో తొలి దశ పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాల్లో జాట్‌లు, ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. వివాదాస్పద సాగుచట్టాలపై పోరు నేపథ్యంలో జాట్‌లు భాజపాకు దూరమైనట్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని తిరిగి తమవైపు తిప్పుకొనేందుకు ఆ పార్టీ తీవ్రంగా కృషిచేస్తోంది. తమది అన్నదాతలకు అనుకూలంగా వ్యవహరించే పార్టీ అని కమలనాథులు వల్లె వేస్తున్నారు. అదే సమయంలో.. 2013 నాటి ముజఫర్‌నగర్‌ అల్లర్లను వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముస్లింలు-జాట్‌లు ఉమ్మడిగా ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమివైపు నిలబడితే తమ విజయావకాశాలు దారుణంగా దెబ్బతింటాయన్న సంగతి కాషాయ పార్టీ నేతలకు తెలుసునని.. అందుకే- క్రమంగా మళ్లీ దగ్గరవుతున్న జాట్‌-ముస్లిం వర్గాల మధ్య చీలిక తీసుకొచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించిన జాట్‌ దిగ్గజ నేత రాజా మహేంద్ర ప్రతాప్‌ను భాజపా నేతలు ఎన్నికల ప్రచార పర్వంలో పదేపదే పొగుడుతున్నారు.

రాముడి స్థానంలో కృష్ణుడు!

UP Polls 2022: యూపీ ఎన్నికల్లో 'అయోధ్య' మూడు దశాబ్దాలకు పైగా అత్యంత కీలక అంశంగా నిలిచింది. ప్రస్తుతం అక్కడ రామాలయం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ దఫా రాష్ట్ర ఎన్నికల్లో శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేశాడు! మథురలో కృష్ణాలయాన్ని కట్టిస్తామని కొందరు భాజపా నేతలు పేర్కొన్నారు. ఈసారి తాను సీఎం కాబోతున్నట్లు శ్రీకృష్ణుడు ప్రతిరోజు కలలోకి వచ్చి చెబుతున్నట్లు అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపైనా బాగానే చర్చ జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు అఖిలేశ్‌ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. భారత్‌కు పాకిస్థాన్‌ రాజకీయపరమైన శత్రువు మాత్రమేనని ఎస్పీ అధినేత పేర్కొనడంపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహమ్మద్‌ అలీ జిన్నాకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలనూ తూర్పారబట్టారు.

ఓబీసీ లెక్కలతోనే పొత్తులు

ప్రధానంగా కులాల మద్దతుతో మనుగడ సాగిస్తున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి తాజా ఎన్నికల కోసం ఎస్పీ కూటమిని ఏర్పాటుచేసింది. దాని అసలు లక్ష్యం- ఓబీసీ ఓట్లను సంఘటితం చేయడమే! స్వామిప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌ వంటి నేతలను భాజపా నుంచి ఎస్పీ తమ గూటికి తెచ్చుకుంది. ఫలితంగా ఆ పార్టీకి ఓబీసీల మద్దతు లభించే అవకాశాలు పెరిగినట్లు విశ్లేషణలొస్తున్నాయి. కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌ నేతృత్వంలోని అప్నాదళ్‌ (ఎస్‌), రాజ్యసభ ఎంపీ సంజయ్‌ నిషాద్‌ నాయకత్వంలోని నిషద్‌ పార్టీలతో జట్టుగా ఏర్పడి భాజపా ఈ ఎన్నికల బరిలో దిగింది. అప్నాదళ్‌ (ఎస్‌), నిషాద్‌లకు ఓబీసీ పార్టీలుగా పేరుంది. మరోవైపు- 2007 ఎన్నికల్లో తమకు విజయాన్నందించిన దళిత్‌-బ్రాహ్మణ్‌ సమీకరణానికి ఈ దఫా పునరుజ్జీవం పోయాలని బీఎస్పీ ప్రయత్నిస్తోంది.

ఈ దఫా యూపీ ఎన్నికలను '80శాతం వర్సెస్‌ 20శాతం'గా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారపర్వం ఆరంభంలోనే వ్యాఖ్యానించారు. రాష్ట్ర జనాభాలో 80 శాతంగా ఉన్న హిందువులు, 20 శాతంగా ఉన్న ముస్లింలను దృష్టిలో పెట్టుకొనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు! భాజపా తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఈసారి యూపీలో ఎన్నికల బరిలో ఇంకా నిలపలేదు. ఎస్పీ సాఫ్ట్‌ హిందూత్వ వైఖరితో ముందుకెళ్తోంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.