ETV Bharat / bharat

Differences in YSRCP Lead to Murders: గ్రామాలకు చేరిన వైఎస్సార్​సీపీ హత్యా రాజకీయాలు.. సొంత పార్టీ నేతలనే..

author img

By

Published : Jul 17, 2023, 11:20 AM IST

attacks
దాడులు

Internal Differences in YSRCP Lead to Murders: వైఎస్సార్​సీపీ నేతల మధ్య విభేదాలు.. ప్రాణాలు తీసే స్థాయికి చేరుతున్నాయి. ఆధిపత్యం కోసం పోటీపడుతూ.. ఉన్నత పదవుల కోసం అడ్డుగా ఉన్న సొంత పార్టీ నేతలను చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఈ సంస్కృతి.. కేవలం పెద్ద నేతల మధ్య మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో కూడా చేరింది. తాజాగా విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్య.. రాష్ట్రంలో ఆధిపత్య హత్యలపై చర్చకు దారితీసింది.

Internal Differences in YSRCP Lead to Murders: అధికార వైఎస్సార్​సీపీలో ఆధిపత్య పోరు హత్యా రాజకీయాలకు దారితీస్తోంది. గ్రామాలపై పట్టు సాధించడం కోసం సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని మట్టుబెడుతున్నారు. పార్టీలో ఉన్నత పదవులు పొందటానికి అడ్డుగా ఉన్నారని, ఆర్థిక ప్రయోజనాలు రాకుండా చేస్తున్నారని ఏకంగా ప్రాణాలను తీస్తున్నారు. తొలుత చిన్న ఘర్షణలతో మొదలవుతున్న వర్గపోరు, వివాదాలు తారస్థాయికి చేరి హత్యల వరకూ వెళ్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు గ్రామ, మండల స్థాయి నేతలను స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత బెదిరించి వైఎస్సార్​సీపీ నాయకులు వారి పార్టీలో చేర్పించుకున్నారు.

దీంతో.. కొత్తగా వచ్చిన వారికి, తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారికి మధ్య ఆధిపత్య, రాజకీయ పోరు ఎక్కువై పలుచోట్ల హత్యలు జరిగాయి. తాజాగా విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను వైఎస్సార్​సీపీకి చెందిన అతని ప్రత్యర్థి వర్గం నేతలు వాహనంతో ఢీకొట్టి, రాడ్లతో కొట్టి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన కలకలం రేపింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్య హత్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.

పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రామాల్లో ప్రజాబలం బాగా ఉన్న టీడీపీ నేతలు పలువురు హత్యకు గురయ్యారు. ఇప్పటికీ అటువంటి హత్యలు జరుగుతున్నాయి. ఆ హత్యలకు పాతకక్షలు, వ్యక్తిగత అంశాలే కారణంగా చెప్తూ పోలీసులు తేలిగ్గా తీసుకుంటూ.. పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదు. పోలీసుల ఉదాసీనత, నిర్లక్ష్యం వల్ల తాము ఏం చేసినా పర్లేదులే అనే ధీమాతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పుడు ఏకంగా వారిలో వారే ఆధిపత్యం కోసం పలుచోట్ల ప్రాణాలు తీసుకుంటున్నారు.

ఆధిపత్యం కోసం హత్య చేశారు..: తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్​సీపీ అధ్యక్షుడిగా గంజి నాగప్రసాద్‌ పని చేసేవారు. గ్రామంపై మంచి పట్టున్న నాయకుడు.. దీంతో వైఎస్సార్​సీపీకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదు గడ్డ బజారయ్య వర్గం దాన్ని తట్టుకోలేకపోయింది. ఇళ్ల స్థలాల పంపిణీలో బజారయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నాగప్రసాద్‌ గ్రామ పార్టీ సమావేశంలో తీర్మానించారు. ఈ చర్యతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. గత సంవత్సరం ఏప్రిల్​లో నాగప్రసాద్‌ను ఆయన ప్రత్యర్థి వర్గం హత్య చేశారు.

డివిజన్‌లో పట్టు కోసం..: విజయవాడ 5వ డివిజన్‌ వైఎస్సార్​సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా దేశీ సురేష్‌ వ్యవహరిచేవారు. అదే డివిజన్‌కు చెందిన వైఎస్సార్​సీపీ నేత కంకణాల చౌడేష్‌కు, సురేష్​కు మధ్య ఆధిపత్య పోరు ఉండేది. తరచూ గొడవలకు దిగేవారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబరులో సురేష్‌ను.. చౌడేష్‌ వాహనంతో ఢీకొట్టి హతమార్చారు.

ఆర్థిక, భూ వివాదాలతో..: వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిపల్లెకి చెందిన వైఎస్సార్​సీపీ నేత శ్రీనివాసరెడ్డిని అదే పార్టీకి చెందిన ఆయన ప్రత్యర్థి వర్గం వారు అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. జూన్‌ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డికి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. శ్రీనివాసరెడ్డికి.. వైఎస్సార్​సీపీలోని మరో వర్గానికి చెందిన వారితో ఆర్థిక, భూ వివాదాలున్నాయి. దీంతో ఆయన్ను చంపేశారు. ఈ కేసులో వైఎస్సార్​సీపీ నేత ప్రతాప్‌రెడ్డితో పాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు.

నియోజకవర్గ స్థాయి నేతని వేట కొడవళ్లతో..: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్​సీపీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డిని అదే పార్టీకి చెందిన ఆయన ప్రత్యర్థి వర్గం వారు గతేడాది అక్టోబర్​లో వేట కొడవళ్లతో నరికి చంపారు. వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ వర్గీయులకు, రామకృష్ణారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పీఏ గోపాలకృష్ణపై.. రామకృష్ణారెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. అంతే కాకుండా వారి మధ్య ఓ భూ వివాదం కూడా నడిచింది. దీంతో రామకృష్ణారెడ్డిని హతమార్చారు. ఈ కేసులో గోపాలకృష్ణ నిందితుడిగా ఉన్నారు.

పట్టు సాధించేందుకు.. మట్టుపెట్టారు..: గ్రామాభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తిగా, అందరి మేలు కోరే మనిషిగా ఏగిరెడ్డి కృష్ణ మంచి పేరు పొందారు. ఆదివారం జరిగిన కృష్ణ అంత్యక్రియలకు భారీగా వచ్చిన జనాన్ని చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన కృష్ణ.. 1988 నుంచి 1995 వరకు ఉద్దవోలు సర్పంచ్​గా పని చేశారు. 1998వ సంవత్సరంలో ఆయనకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఆయన ఎవరికి మద్దతు ఇస్తే వారే సర్పంచిగా గెలుస్తున్నారు.

2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన బలపరిచిన అభ్యర్థే గెలిచారు. ఆ తర్వాత కూడా కృష్ణ, అతని వర్గమంతా టీడీపీలోనే ఉండేవారు. కానీ అప్పటికే వైఎస్సార్​సీపీలో కొనసాగుతున్న కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రామాభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తుండేవారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్దవోలు సర్పంచ్​తో పాటు కృష్ణ వర్గం.. వైఎస్సార్​సీపీలో చేరారు. అప్పటి నుంచి కృష్ణ వర్గానికి, అధికార పార్టీలోని మొదటి నుంచి ఉన్న మరడాన వెంకటనాయుడు వర్గానికి మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కృష్ణ బతికున్నంత కాలం గ్రామంపై పట్టు సాధించలేమని అనుకున్న మరాడన వెంకటనాయుడు, అతని వర్గం.. కృష్ణను అత్యంత దారుణంగా చంపేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.