ETV Bharat / state

Teacher murder ఆధిపత్యం కోసమే ఉపాధ్యాయుడి హత్య.. నలుగురు అరెస్ట్.. అధికారుల ఉదాసీనతతోనే హత్య: చంద్రబాబు

author img

By

Published : Jul 16, 2023, 3:45 PM IST

Updated : Jul 16, 2023, 5:11 PM IST

Teacher murder: విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుడు కృష్ణ హత్య వెనుక ఆధిపత్య పోరు కారణమని ఎస్పీ వెల్లడించారు. గ్రామంలో మరో వర్గంలో ఉన్న విభేదాలే ఘటనకు కారణమని, కేసులో నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు. హత్య నేపథ్యంలో ఉద్దవోలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.

విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుడు కృష్ణ హత్య
విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుడు కృష్ణ హత్య

Teacher murder: విజయనగరం జిల్లా రాజాం మండలం కొత్త పేట వద్ద ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ దీపిక మీడియా సమావేశంలో వెల్లడించారు. తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కృష్ణ.. రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం రావటంతో రాజాం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మొదట్లో రోడ్డు ప్రమాదమని భావించినప్పటికీ.. హతుడి బంధువులు, గ్రామస్థుల ఫిర్యాదుతో లోతుగా విచారణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తు ఆధారంగా ఘటన జరిగిన 24గంటల్లోనే ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు మోహన్, గణపతి, రామస్వామిని అరెస్టు చేశామన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుడు కృష్ణ హత్య

ఆధిపత్య పోరు నేపథ్యంలోనే.. గ్రామంలో వెంకటనాయుడు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే కృష్ణ హత్యకు దారి తీసింది. వెంకట నాయుడు కుటుంబీకులు ఉద్దవోలులో ప్రభుత్వ పథకాలకు చెందిన పలు నిర్మాణాలు చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల మంజూరులోని ఉపాధ్యాయుడు కృష్ణ అడ్డుకుంటున్నారని, తన రాజకీయ ఎదుగులకు ఆటంకంగా మారారని వెంకటనాయుడు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో కృష్ణను అడ్డు తొలగించుకోవాలన్న నిర్ణయంతో హత్యకు పథకం వేసినట్లు ఎస్పీ తెలిపారు. పథకంలో భాగంగా.. రాజాం మండలం కర్లంరాజుపేట పాఠశాలలో పని చేస్తున్న కృష్ణ విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా హతమార్చారు. తొలుత మోహన్, రెడ్డిరాము బొలోరో వాహనంతో కృష్ణను ఢీకొట్టారు. అనంతరం ఇనుప రాడుతో కొట్టి చంపినట్లు విచారణలో తేలినట్లు ఎస్పీ చెప్పారు. వ్యక్తిగత కక్షలు, ఆధిపత్యపోరే తప్ప ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఎస్పీ చెప్పారు. కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశామని, మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించిన ఎస్పీ.. హతుడి బంధువులు, ఆయన మద్దతుదారులు గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.

విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుడు కృష్ణ హత్య

గ్రామంలో ఉద్రిక్తత.. ఉపాధ్యాయుడు కృష్ణ మద్దతుదారులు ప్రత్యర్థి వర్గమైన వైఎస్సార్సీపీ నేత వెంకటనాయుడుకు చెందిన ఆస్తులపై దాడులు చేయడంతో ఉద్దవోలు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలంటూ కృష్ణ బంధువులు, మద్దతుదారులు, మహిళలు గ్రామంలో ఆందోళన చేపట్టారు. గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత శనివారం రాత్రి గంటల సమయంలో వెంకటనాయుడుకు చెందిన కారు అద్దాలు పగులగొట్టి, కొద్ది దూరంలో ఉన్న ఆటోను తిరగేశారు. వారి గడ్డివాముకు నిప్పు అంటించారు. కృష్ణ హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున మహిళలు వెంకట నాయుడు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెర్లాం, బాడంగి, రామభద్రపురం ఎస్ఐలు ఆర్.రమేష్, జయంతి, సురేంద్రనాయుడు సిబ్బంది పాల్గొన్నారు. ఉద్రిక్త వాతావరణం మధ్య గ్రామంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించగా ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయుడు హత్యకు గురవడంతో పాఠశాల విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

హత్యను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. కృష్ణ హత్యను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అధికారుల ఉదాసీనత, అసమర్థత కారణంగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఉపాధ్యాయుడి హత్యలో రాజకీయ కోణం లేదని స్థానిక ఎమ్మెల్యే వెంకట చిన అప్పలనాయుడు పేర్కొ న్నారు. ఇరువురి మధ్య మనస్పర్ధలు హత్యకు దారి తీసినట్లు అనిపిస్తుందన్నారు.

Last Updated : Jul 16, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.