ETV Bharat / bharat

'బీజేపీనే టార్గెట్.. క్రమశిక్షణతో పనిచేసి గెలుద్దాం.. ఆ పార్టీలతో పొత్తుకు రెడీ'

author img

By

Published : Feb 26, 2023, 5:13 PM IST

Updated : Feb 26, 2023, 5:36 PM IST

congress-raipur-plenary-declaration
congress-raipur-plenary-declaration

ఈ ఏడాది పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చింది. క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేయాలని దిశానిర్దేశం చేసింది. భాజపాపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

క్రమశిక్షణ, సంపూర్ణ ఐక్యతతో పనిచేసి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ దిశానిర్దేశం చేసింది. రాజస్థాన్, ఛత్తీస్​గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేయడం ద్వారా 2024 లోక్​సభ సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. రాయ్​పుర్​లో జరిగిన 85వ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా ఐదు పాయింట్ల తీర్మానానికి ఆమోదముద్ర వేసింది కాంగ్రెస్. భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం, నిర్మాణాత్మక అభివృద్ధి వంటి భావజాలాలు ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించింది.

"ఈ ఏడాది కర్ణాటక, ఛత్తీస్​గఢ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు క్రమశిక్షణతో పనిచేయాలి. ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలి. ఈ ఎన్నికల ఫలితాలే కీలకమైన 2024 లోక్​సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బీజేపీ/ ఆరెస్సెస్ భావజాలంతో, వారి నీచ రాజకీయాలతో ఎన్నడూ రాజీ పడని పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. నియంతృత్వ, మతతత్వ, ఆశ్రిత పక్షపాతంతో కూడిన బీజేపీ నుంచి రాజకీయ విలువలను కాపాడేందుకు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం. ఇందుకోసం కలిసొచ్చే భావసారూప్యత పార్టీలతో పనిచేస్తాం. దేశం ఎదుర్కొంటున్న మూడు కీలక సమస్యలైన ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న సామాజిక విభజన, రాజకీయ నియంతృత్వానికి పరిష్కారం కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నాం."
-కాంగ్రెస్ ప్లీనరీ తీర్మానం

ఇది నయా కాంగ్రెస్: ఖర్గే
కాంగ్రెస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిందల్లా ఐకమత్యం, క్రమశిక్షణ, అంకితభావమేనని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఈ సమావేశాలు కొత్త కాంగ్రెస్​కు ప్రారంభమని అన్నారు. 'మన బలం పార్టీ బలంలోనే ఉంది. జాతీయ స్థాయిలో మన ప్రవర్తన ప్రభావం కోట్లాది మంది కార్యకర్తలపై పడుతుంది. సమయంతో పాటు ప్రజల ఆలోచనలు మారతాయి. కొత్త సవాళ్లు పుట్టుకొస్తాయి. అదే విధంగా కొత్త దారులు తెరుచుకుంటాయి. అందుకే.. రాజకీయాలు, సామాజిక కార్యక్రమాలకు ముగింపు అనేది ఉండదంటారు. మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మన తరంలో ఎంతో మంది ఈ దారిలో నడుస్తున్నారు. భవిష్యత్​లోనూ నడుస్తూనే ఉంటారు. ఈ సమావేశాలు ముగుస్తుండొచ్చు. కానీ, ఇది కొత్త కాంగ్రెస్​కు ప్రారంభం' అని ఖర్గే పేర్కొన్నారు.

తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర
భారత్ జోడో యాత్రను విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమవుతోంది. దేశ తూర్పు తీరంలోని పోర్​బందర్ (గుజరాత్) నుంచి పశ్చిమాన అరుణాచల్​ప్రదేశ్​లోని పాసీఘాట్ వరకు యాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. అయితే ఈ యాత్ర భారత్ జోడోతో పోలిస్తే భిన్నంగా ఉంటుందన్నారు. 'భారత్ జోడో యాత్రతో ఉత్సాహం పెరిగింది. తూర్పు నుంచి పశ్చిమానికి ఓ యాత్ర ఉండాలని నేను కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నా. తక్కువ సంఖ్యలోనే యాత్రికులు ఇందులో పాల్గొంటారు. భారత్ జోడో స్థాయి మౌలిక సదుపాయాలతో కాకుండా ఇది పరిమితంగానే ఉంటుంది. తక్కువ సమయంలోనే ముగుస్తుంది. చాలా వరకు పాదయాత్రగానే సాగుతుంది. అడవులు, నదులు ఉన్న భిన్నమైన భౌగోళిక ప్రాంతాల్లో యాత్ర వేరే పద్ధతిలో నిర్వహిస్తాం. మొత్తంగా మల్టీ మోడల్ యాత్ర ఇది. జూన్ లేదా నవంబర్ ముందు ఈ యాత్ర ఉండొచ్చు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని జైరాం రమేశ్ తెలిపారు.

Last Updated :Feb 26, 2023, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.