ETV Bharat / opinion

బీజేపీ 'ప్రాజెక్ట్-K'.. కాంతార, కేజీఎఫ్ స్టార్లతో ఎలక్షన్ రాజకీయం!

author img

By

Published : Feb 26, 2023, 2:51 PM IST

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. ప్రముఖులను మచ్చిక చేసుకుంటోంది! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సెలబ్రిటీలతో భేటీ అవుతూ ఓటర్లకు పరోక్ష సందేశం పంపుతున్నారు.

Karnataka assembly polls
Karnataka assembly polls

కర్ణాటక ఎన్నికల కోసం కమలం పార్టీ తనదైన వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీల ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సినీతారలు, క్రికెటర్లు, యువ పారిశ్రామికవేత్తలు, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటకలో పర్యటించిన సమయంలో అనేక మంది సెలబ్రిటీలతో భేటీ అయ్యారు. కేజీఎఫ్ స్టార్ యశ్, కాంతార ఫేమ్ రిషభ్ శెట్టి వంటి సినీతారలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన 'అయ్యో శ్రద్ధ' శ్రద్ధా జైన్​నూ మోదీ కలిశారు. దక్షిణాది సినీ పరిశ్రమలు దేశ సంస్కృతిక వారసత్వాన్ని గొప్పగా చాటుతున్నాయని మోదీ కితాబిచ్చారు. దివంగత నటుడు పునీత్ రాజ్​కుమార్​ను ఆయన గుర్తు చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలకు అవసరమైన సాంకేతిక కోర్సులను ఐటీఐలలో ప్రవేశపెట్టడంపైనా వారితో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి.

Karnataka assembly polls
సినీ ప్రముఖులతో మోదీ

వీరితో పాటు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ వంటి మాజీ క్రికెటర్లను, మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే వంటి ప్రస్తుత క్రికెటర్లనూ కలిశారు మోదీ. తమ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారితో వివరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నూతన విద్యా విధానంలో క్రీడలకు పెద్ద పీట వేసిన విషయాన్నీ ప్రస్తావించినట్లు తెలిపాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్​ఫామ్ జెరోదా వ్యవస్థాపకులు కామత్ సోదరులతోనూ మోదీ భేటీ అయ్యారు. దేశంలో ఆవిష్కరణలకు, స్టార్టప్ ఎకోసిస్టమ్​లకు అందిస్తున్న సహకారంపై వారితో మాట్లాడారు.

మోదీతో భేటీ అయిన ఈ ప్రముఖులంతా కర్ణాటకకు చెందినవారే. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కన్నడనాట అధికారంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్​తో ఎన్నికల్లో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే మోదీ.. కన్నడ ప్రముఖులతో వరుసగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. నేరుగా సెలబ్రిటీలతో భేటీ అయి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ఓ స్ట్రాటజీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రముఖులంతా తమవైపే ఉన్నారని ఓటర్లకు పరోక్షంగా సందేశం పంపినట్లు అవుతుందని చెబుతున్నారు.

Karnataka assembly polls
వెంకటేశ్ ప్రసాద్​తో మోదీ

ఐదు 'బీ'ల ప్లాన్
మరోవైపు, ప్రాంతాలవారీగా ప్లాన్లు సిద్ధం చేసింది బీజేపీ. 2018 ఎన్నికల్లో బీజేపీకు అంతగా అనుకూలంగా ఫలితాలు రాని ఐదు జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. బాగల్​కోటె, బెళగావి, బళ్లారి, బీదర్, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో ఈసారి పార్టీ పెర్ఫార్మెన్స్ మెరుగు పడేలా ప్రణాళికలు రచించింది. బెంగళూరు రూరల్, అర్బన్​లో మొత్తం 32 స్థానాలు ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లలోనే బీజేపీ గెలవగలిగింది. బెంగళూరు అర్బన్​లో ఖాతానే తెరవలేదు. బళ్లారిలో తొమ్మిది స్థానాలకు మూడు, ఆరు స్థానాలున్న బీదర్​లో ఒకే సీటు గెలుచుకుంది బీజేపీ. బాగల్​కోటె, బెళగావిలో కాస్త మెరుగైన ప్రదర్శనే చేసింది. 18 స్థానాలున్న బెళగావిలో 13 సీట్లు, ఏడు నియోజకవర్గాలున్న బాగల్​కోటెలో ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఈ సారి ఐదు జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. తరచుగా రాష్ట్రానికి వస్తున్న పార్టీ అగ్రనాయకులు.. ఈ జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా రాష్ట్ర నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.