ETV Bharat / bharat

'న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం'

author img

By

Published : Apr 30, 2022, 6:57 AM IST

Updated : Apr 30, 2022, 10:19 AM IST

CJI NV Ramana: దేశంలోని పలు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి పేర్లను సూచించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ పిలుపునిచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ప్రారంభమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

CJI NV Ramana
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

CJI NV Ramana: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి వేగంగా సిఫార్సులు పంపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. కోర్టు సముదాయాల్లో ఐటీ మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ప్రారంభమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. కరోనా విజృంభణ కాలంలోనూ కోర్టులు నిరంతరాయంగా నడిచేందుకు చేయూతనిచ్చిన న్యాయమూర్తులందరికీ అభినందనలు తెలిపారు.

సదస్సులో సీజేఐ ప్రసంగిస్తూ.. "ఆరేళ్ల విరామం తర్వాత మనం ఇక్కడ కలుసుకున్నాం. గత ఏడాది జూన్‌లో నేను తొలిసారి మీతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాను. తర్వాత పలు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎప్పటికప్పుడు మీరు విభిన్న అంశాలను నా దృష్టికి తీసుకొస్తున్నారు. వాటిని నేను కేంద్రప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాను. న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపుతున్న సమస్యలను గుర్తించి చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.

ఆరేళ్ల క్రితంనాటి సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని చర్చించడంతోపాటు మరో ఆరు అంశాలను తాజా ఎజెండాలో చేర్చాం. దేశవ్యాప్తంగా కోర్టు సముదాయాల్లో ఐటీ మౌలిక వసతులు-అనుసంధానతను బలోపేతం చేయడం, జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులను సిద్ధం చేయడం, భవనాల సామర్థ్యాలను పెంచడం, న్యాయవ్యవస్థకు అత్యాధునిక మౌలిక వసతులు సమకూర్చే వ్యవస్థను నెలకొల్పడం, సంస్థాగత-న్యాయపరమైన సంస్కరణలు చేపట్టడం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలతోపాటు వారి భత్యాలు/పదవీవిరమణ తర్వాత ప్రయోజనాలను పెంపొందించడం వంటివి అందులో ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీల గురించే ఇప్పుడు నేను ప్రధానంగా ప్రస్తావించదలచుకున్నాను."

మనందరి సమష్టి ప్రయత్నాలతో ఏడాదిలోపే వివిధ హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ సాధ్యమైంది. మరో 50 నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉంది. ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులు, హైకోర్టులకు పది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు.

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

'నేను మీతో తొలిసారి సమావేశమైనప్పుడూ దానిపైనే మాట్లాడాను. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి అవసరమైన సిఫార్సులను వేగంగా పంపాలని కోరాను. అందులో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వాలని సూచించాను. దానికి కొన్ని హైకోర్టులు స్పందించిన తీరు చాలా సంతోషకరంగా ఉంది. మనందరి సమష్టి ప్రయత్నాలతో ఏడాదిలోపే హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ సాధ్యమైంది. వ్యవస్థపై మీకున్న సంపూర్ణ నిబద్ధతతోపాటు మనస్ఫూర్తిగా అందించిన సహకారం వల్లే ఈ గొప్ప లక్ష్య సాధన సాధ్యమైంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఖాళీలున్న హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు పంపాలని కోరుతున్నా. వాటిలో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వండి. గత సంవత్సర కాలంలో సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులు, హైకోర్టులకు పది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు.

ఇందుకు సహకరించిన కొలిజీయంలోని సహచర న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మీ అందరికీ న్యాయమూర్తులుగా పదేళ్లకుపైగానే అనుభవం ఉంది. కాబట్టి ఎజెండాలోని అంశాలపై నిష్పాక్షికంగా విశ్లేషణ జరిపి నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరుతున్నా. నిర్మొహమాటంగా మీరు వ్యక్తంచేసే అభిప్రాయాల ద్వారా మనం కచ్చితంగా ఒక అర్థవంతమైన నిర్ణయానికి రాగలం. ఈ రోజు మనం తీసుకొనే నిర్ణయాలు, చేసే తీర్మానాలు ముఖ్యమంత్రులతో శనివారం జరిగే సదస్సులో చర్చలకు ఆధారమవుతాయి. ఈ అంశాలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిద్దాం.'

శక్తిమేరకు పనిచేశాం: 'గత ఏడాది నేను సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పుడు కొవిడ్‌ రెండో ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. తర్వాత కొన్ని వారాలు ఉపశమనం లభించినా.. 2021 చివరికల్లా మళ్లీ మూడో ఉద్ధృతిలో చిక్కుకున్నాం. మనమంతా కాలపరీక్షను ఎదుర్కొన్నాం. అయితే మీ అందరి సంకల్పంతో సహచరులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారుల బాగోగులు చూసుకుంటూనే.. స్థిరమైన ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటుచేసుకొని నిరంతరం సేవలు కొనసాగేలా చూడగలిగాం. అందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా శక్తిమేరకు పనిచేశాం.

బెయిల్‌ ఉత్తర్వులను వేగంగా, సురక్షితంగా జైలు అధికారులకు అందించే ఫాస్టర్‌ వ్యవస్థకూ ఈ సంక్లిష్ట సమయంలోనే శ్రీకారం చుట్టాం. కరోనా కాలంలో మనుగడ కోసం పోరాడిన ప్రజలకు దేశవ్యాప్తంగా కోర్టులు గొప్ప ఉపశమనాన్ని కల్గించాయి. ఎవరికి తోచిన రీతిలో వారు చేసిన ఈ ప్రయత్నాలకు అభినందనలు. లక్షల మంది అట్టడుగువర్గాల ప్రజలకు ఈ కష్టకాలంలో జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ కూడా నిరంతరం సేవలు అందించగలిగింది. దురదృష్టవశాత్తు మహమ్మారి తీవ్రతకు మనం ఎంతోమంది సహచరులు, అధికారులు, సిబ్బంది, న్యాయవాదులను కోల్పోయాం. ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని పేర్కొన్నారు.

న్యాయ వ్యవస్థలో సమస్యలకు బాధ్యులెవరో చెప్తా: న్యాయ వ్యవస్థలో ఏయే సమస్యలున్నాయో.. వాటికి బాధ్యులెవరో శనివారం ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తాను వివరంగా చెబుతానని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. హైకోర్టు సీజేల 39వ సదస్సుకు హాజరైన వివిధ ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తుల గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బార్‌ అసోసియేషన్‌ డిమాండ్లలో తనకు సాధ్యమైనవాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసులు భారీగా పేరుకుపోవడంపై అటార్నీ జనరల్‌(ఏజీ) కె.కె.వేణుగోపాల్‌ తాజా సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. ఏజీ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని, ఆయన వాదనతో ఏకీభవిస్తున్నానని సీజేఐ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజయం కేవలం తమముందు హాజరయ్యే న్యాయవాదులనే కాకుండా, దేశంలో ఎక్కడా అర్హులున్నా గుర్తించేందుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.

నేడు ముఖ్యమంత్రులు-హైకోర్టుప్రధాన న్యాయమూర్తుల సదస్సు: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సమక్షంలో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు దిల్లీలో శనివారం జరగనుంది. ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై ఇందులో చర్చిస్తారు. కేసుల పెండింగ్‌ భారాన్ని తగ్గించుకోవడం, ఖాళీల భర్తీ, ఈ-కోర్టుల మూడోదశ విస్తరణ తదితర అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరుపుతారు. ఈ సదస్సులో తెలంగాణ తరఫున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: 'త్వరలో హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. అదే ప్రధాన లక్ష్యం'

Last Updated : Apr 30, 2022, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.