ETV Bharat / bharat

పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలెర్ట్‌.. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు..

author img

By

Published : Mar 16, 2023, 8:32 PM IST

central health ministry six states for emerging new covid cases and infections
central health ministry six states for emerging new covid cases and infections

కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. కేంద్రం ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను కోరింది.

గత కొన్నిరోజులుగా దేశంలో పలు చోట్ల కొవిడ్‌ కేసులు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్‌పైనా దృష్టి పెట్టాలని తెలిపింది.

కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 8 నాటికి దేశంలో మొత్తం 2082 క్రియాశీల కేసులు ఉండగా.. తదుపరి వారంలోనే అవి 3264కు చేరుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. కర్ణాటకలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.77గా ఉండగా, కేరళలో 2.64శాతం, తమిళనాడులో 1.99శాతం, మహారాష్ట్రలో 1.92శాతం, గుజరాత్‌లో 1.11శాతం, తెలంగాణలో 0.31శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో వైరస్‌ కట్డడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇన్‌ఫ్లుయెంజాతోపాటు కొవిడ్‌ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని పేర్కొన్నారు.

కాగా, కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న సమయంలోనే అటు హెచ్‌3ఎన్‌2 వ్యాప్తి కూడా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఇప్పటి వరకు 450 పైగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదు కాగా.. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో ఆస్ట్రేలియా​ పర్యటకులకు కొవిడ్​ నిర్ధరణ..
రాజస్థాన్​లో.. నలుగురు ఆస్ట్రేలియా​ పర్యాటకులకు కొవిడ్​ నిర్ధరణ అయింది. దీంతో ఆ నలుగురిని రాజస్థాన్​ ప్రభుత్వం పరిశీలనలో ఉంచింది. వీరందరిని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్​లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఈ విదేశీ పర్యటకులకు కొవిడ్​ నిర్ధరణ అయినట్లు వారు వెల్లడించారు.

"నలుగురు ఆస్ట్రేలియా పౌరులు.. సవాయి మాధోపుర్​లోని ఓ హోటల్​ బస చేశారు. వీరికి కొవిడ్​ నిర్ధరణ అయిన అనంతరం వారందరినీ జైపుర్​కు తరలించాం. నలుగురిలో ముగ్గురికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఒకరికి మాత్రం జలుబు ఉంది." అని ఆర్​యూఎచ్​ఎస్​ సూపరింటెండెంట్ డాక్టర్​ అజిత్​ సింగ్​ తెలిపారు. బుధవారం రాజస్థాన్​లో మొత్తం 11 మందికి కొవిడ్​ నిర్ధరణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.