ETV Bharat / bharat

'ఆ ఆర్డినెన్సులు వ్యవసాయ మృత్యు ఘంటికలు'

author img

By

Published : Sep 13, 2020, 5:40 AM IST

Govt's 3 farm ordinances 'death knell' for agriculture, alleges Cong
'ఆ ఆర్డినెన్సులు వ్యవసాయ మృత్యు ఘంటికలు'

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ ఆర్డినెన్సులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. దీనిపై ఏకాభిప్రాయం ఉన్న పార్టీలతో కలిసి ముందుకెళ్లనున్నట్లు పేర్కొంది. వ్యవసాయ కూలీలు, కౌలుదారుల హక్కులు కాపాడేందుకు ఆర్డినెన్సులో ఎలాంటి నిబంధనలు లేవని విమర్శించింది.

పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈ ఆర్డినెన్సులను వ్యవసాయానికి మృత్యు ఘంటికలుగా అభివర్ణించింది. ప్రభుత్వానికి సన్నిహితులైన కొంతమంది పెట్టుబడిదారులు రైతులను లొంగదీసుకునేందుకే అవి ఉపయోగపడతాయని వ్యాఖ్యానించింది. పార్లమెంట్ బయటా, లోపలా వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంపై ఏకాభిప్రాయం ఉన్న పార్టీలను చేర్చుకొని ముందుకెళ్లనున్నట్లు పేర్కొంది.

మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ సంఘీభావం ప్రకటించింది. ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా కేంద్రంపై పూర్తి స్థాయిలో పోరాడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలు, కౌలుదారుల హక్కులు కాపాడేందుకు ఆర్డినెన్సులో ఎలాంటి నిబంధనలు లేవని అన్నారు.

"మండీ వ్యవస్థ రద్దు అయితే రైతులు కాంట్రాక్టు వ్యవసాయంపైనే ఆధారపడతారు. రైతుల పంటలకు పెద్ద కంపెనీలు ధరను నిర్ణయిస్తాయి. ఇది కొత్త రకం జమిందారీ వ్యవస్థ కాకపోతే ఇంకేంటి?"

-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి

కేంద్రం తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులను సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు సుర్జేవాలా. వ్యవసాయం, మండీలు రాష్ట్ర పరిధిలో ఉంటాయని.. వారిని సంప్రదించకుండానే ఆర్డినెన్సులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు.

రైతు ఉత్పత్తుల వర్తకం 2020, ధరల భరోసా, వ్యవసాయ సేవల ఆర్డినెన్స్ 2020, అత్యవసర వస్తువుల ఆర్డినెన్స్​లను కేంద్రం తీసుకొచ్చింది. మండీల వెలుపల తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు అవరోధాలను తొలగించేలా ఈ ఆర్డినెన్సులు రూపొందించింది. ఈ ఆర్డినెన్సు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం ప్రైవేటు సంస్థలతో ముందుగానే ఒప్పందం చేసుకునే అధికారం రైతులకు లభిస్తుంది.

అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ షురూ!

మరోవైపు, కాంగ్రెస్ తర్వాతి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆ పార్టీ తెలిపింది. వర్కింగ్ కమిటీ అనుమతి పొందిన తర్వాత సోనియా గాంధీ సంస్థాగత మార్పులు చేశారని... పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీని పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించారని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.