ETV Bharat / bharat

దిల్లీలో కొంత నయం.. భారీగా తగ్గిన కొత్త కేసులు

author img

By

Published : Jul 1, 2020, 7:10 AM IST

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని ఉద్ధృతంగా అమలు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మరణాల సరళి యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోందని, మరో వారంలో స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Coronavirus cases of decline in Delhi compare with Across the country
దిల్లీలో కొంత నయం.. భారీగా తగ్గిన కొత్త కేసులు

దేశ రాజధాని దిల్లీలో కరోనా నియంత్రణలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణ మొదలుపెట్టిన నేపథ్యంలో వారం రోజుల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని ఉద్ధృతంగా అమలు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. జూన్‌ 24న ఒక్కరోజే దాదాపు 4,000 కొత్త కేసులు వస్తే మంగళవారం 2,084 వచ్చాయి. మరణాల సరళి యథాతథంగా కొనసాగుతున్నప్పటికీ కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం రాజధాని ప్రజలకు ఊరటనిస్తోంది. మంగళవారం 3,628 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోందని, మరో వారంలో స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

  • దిల్లీతోపాటు, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, జమ్మూ-కశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, లద్ధాఖ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌, సిక్కింలలో గత 24 గంటల్లో కొత్త కేసుల కంటే కోలుకున్నవారు ఎక్కువ ఉన్నారు.
  • అన్‌లాక్‌-1 మొదలైన జూన్‌ 1 నుంచి 30 వరకు దేశంలో 3,76,305 కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుల్లో ఇది 66%. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, గుజరాత్‌లలో మూడింట రెండొంతుల కేసులున్నాయి.

దేశవ్యాప్తంగా చూస్తే కొద్దిగా తగ్గుదల

దేశవ్యాప్తంగా గత రెండ్రోజులుగా దాదాపు 20,000 వరకు నమోదైన కొత్త కేసులు మంగళవారం మాత్రం 18,522కి పరిమితమయ్యాయి. సోమవారంతో పోలిస్తే మరణాలు, కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య పెరిగాయి. 24 గంటల్లో 418 మంది చనిపోగా వారిలో 181 మంది మహారాష్ట్రకు చెందినవారే. తాజా లెక్కల ప్రకారం దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య (రికవరీ రేటు) 59.07%, మరణాల రేటు 2.98% చొప్పున ఉన్నాయి. జూన్‌ 7 వరకు 3% లోపే మరణాల రేటు ఉండేది. ముంబయి, దిల్లీల్లో లెక్కల్ని సరిచూసి 2,003 మంది మరణాలను ఆ జాబితాలో చేర్చడంతో మొత్తం మరణాల రేటు 3.5% వరకు వెళ్లిపోయింది. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి దాదాపు మూడు వారాల అనంతరం మళ్లీ 3% లోపునకు రావడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది.

తమిళనాడులో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇంతవరకూ దేశంలో మూడో స్థానంలో కొనసాగిన ఆ రాష్ట్రం ఇప్పుడు రెండో స్థానానికి వచ్చింది. ఒక్కరోజులోనే అక్కడ 3,943 కేసులు, 60 మరణాలు సంభవించాయి. చెన్నైలోనే 2393 కేసులు కొత్తగా వచ్చాయి. ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Coronavirus cases of decline in Delhi compare with Across the country
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
Coronavirus cases of decline in Delhi compare with Across the country
భారత్​లో కరోనా కేసుల సంఖ్య

ఇదీ చూడండి: అసోం వరదలు: 25కు పెరిగిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.