ETV Bharat / bharat

హిమగిరుల్లో ఆంగ్లేయుల ఆటకట్టించిన రైతులు.. పట్టుబట్టి మరీ!

author img

By

Published : Mar 9, 2022, 8:46 AM IST

Azadi ka Amrit Mahotsav: గాంధీజీ ఆరంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం హింసతో ఆగిపోతే.. ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంత ప్రజలు మాత్రం పట్టుబట్టి మరీ ఆంగ్లేయుల తలలు వంచారు. బ్రిటిష్‌ వారికి తమ సహాయ నిరాకరణను విజయవంతం చేసుకున్నారు. గాడిద చాకిరి నుంచి బయటపడ్డారు. గాంధీజీ సైతం దీన్ని రక్తరహిత విప్లవంగా కొనియాడారు!

Azadi ka Amrit Mahotsav
Azadi ka Amrit Mahotsav

Azadi ka Amrit Mahotsav: సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా హిమాలయ పర్వత సానువుల్లోని కుమావ్‌ ప్రాంతంలో (ప్రస్తుత ఉత్తరాఖండ్‌) ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆరంభమైందో ఉద్యమం. అదే 'కూలీ బేగార్‌' వ్యతిరేక ఉద్యమం. అందమైన పర్వతాలు... చల్లని ప్రదేశాలు... దట్టమైన అడవులతో నిండిన ఈ ప్రాంతం సహజంగానే ఆంగ్లేయులను ఆకర్షించేది. అధికారులే కాకుండా అనేక మంది బ్రిటిష్‌ వ్యాపారులు, కుటుంబాలు ఈ ప్రాంతాల్లో విడిదికి, పర్యటకానికి, వేటకు వచ్చి నెలల తరబడి ఉండి వెళ్లేవారు. ఇలా తెల్లవారు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంత ప్రజలకు ప్రాణాల మీదికి వచ్చినంత పనయ్యేది. కారణం- వచ్చిన ఆంగ్లేయులకు స్థానికులు ముఖ్యంగా రైతులు చాకిరీ చేయాల్సి వచ్చేది. ఇదేదో స్థానికంగా పెట్టిన సంప్రదాయం కాదు. ఆంగ్లేయ సర్కారు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లేయుల సామాన్లు మోయటం దగ్గర్నుంచి- బట్టలు ఉతకటం దాకా అన్ని పనులూ దగ్గరుండి చూసుకోవటం స్థానికుల బాధ్యతే. చివరకు తెల్లవారి తాత్కాలిక మరుగుదొడ్లను సైతం ఎటు వెళితే అటు మోసుకొని వెళ్లాల్సి వచ్చేది. కూరగాయలు, పాలు, పెరుగు కూడా సరఫరా చేయాల్సిందే. ఇవన్నీ వట్టి పుణ్యానికి చేయాల్సిందే. నయాపైసా కూడా తెల్లవారు చెల్లించరు. సరికదా.. తమ వస్తువుల్లో ఏదైనా పోయినా, దొరకకున్నా, పాడైనా లేక చాకిరీ చేయకున్నా శిక్షలు పడేవి. అలా వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. దీన్నే కూలీ బేగార్‌ పద్ధతి అనేవారు.

గ్రామపెద్దలు, భూస్వాముల వద్ద కూలీల జాబితాలు సిద్ధంగా ఉండేవి. వాటి ఆధారంగా పనులకు పంపించేవారు. కుమావ్‌ ప్రాంతంలోని దాదాపు 90శాతం ప్రజలు చాకిరీకి వెళ్లాల్సి వచ్చేది. 1860 తర్వాత ఈ ప్రాంతం యూరోపియన్లకు సాహస క్రీడల, పర్యాటక కేంద్రంగా మారింది. దీనికి తోడు అటవీశాఖ కార్యాలయాల ఏర్పాటుతో ఆంగ్లేయుల రాకపోకలు పెరిగిపోయాయి. ఫలితంగా ప్రజలపైనా భారం పెరిగింది. చాకిరీ అధికమైంది. దీనిపై అడపాదడపా ఆందోళన మొదలైంది. అయితే అవన్నీ ఎవరికి వారే అన్నట్లుగా సాగాయి. 1903లో అల్మోరా పట్టణానికి సమీపంలోని ఖత్యారీ గ్రామ ప్రజలు బేగార్‌కు నిరాకరించారు. దీంతో ఆంగ్లేయ అధికారులు వారికి జరిమానా విధించటమేగాకుండా జైలుకు పంపించి అసమ్మతిని దారుణంగా అణచివేశారు.
అలా విడివిడిగా సాగిన వ్యతిరేకత 1916లో మెల్లగా సమష్టి రూపు దాల్చింది. రైతులందరితో కలసి కుమావ్‌ పరిషత్‌ ఏర్పాటైంది. అల్మోరాకు చెందిన పాత్రికేయుడు బద్రీదత్‌ పాండే, పండిత్‌ హర్‌ గోవింద్‌ పంత్‌ లాంటి వారి నేతృత్వంలో ఉద్యమంగా రూపుదాల్చింది. అయితే ఆంగ్లేయులు తమ మనుషులను ఈ ఉద్యమంలోకి చొప్పించి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ బద్రీదత్‌ పాండే తన రచనలు, ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపటంతో ఆ ఎత్తుగడలు పనిచేయలేదు. రైతులు ఏకతాటిపై నిలిచి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కావాలని నినదించారు. పాండే కాంగ్రెస్‌ సదస్సులకు హాజరై గాంధీజీ దృష్టికి సైతం ఈ సమస్యను తీసుకెళ్లారు. జాతీయ కాంగ్రెస్‌ అండదండలతో ఉద్యమం తీవ్రరూపు దాల్చింది. 1921 జనవరి 1న చమీ గ్రామంలోని గుడిలో సమావేశమైన రైతులంతా ఇక నుంచి ఆంగ్లేయులకు ఎలాంటి సాయం చేసేది లేదంటూ తీర్మానించారు. కూలీ బేగార్‌ను రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.

ఆంగ్లేయ సర్కారు ఉద్యమాన్ని ఆపాల్సిందిగా ఆదేశించింది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ, జనవరి 13 ముహూర్తంగా.. సరయూ, గోమతి నదుల సంగమ స్థలిలో భాగనాథ్‌ దేవాలయం వద్ద దాదాపు 40వేల మంది రైతులు అన్ని గ్రామాల నుంచి చేరుకున్నారు. ఆంగ్లేయులకు కూలీగా చేసేదే లేదంటూ సంగమ జలం చేతుల్లోకి తీసుకొని ప్రతిజ్ఞ చేశారు. 30 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆల్మోరా డిప్యూటీ కమిషనర్‌ ఏమీ చేయలేక చేతులెత్తేశాడు.

పరిస్థితి చేయి దాటిందని గమనించిన ఆంగ్లేయ సర్కారు కొద్దిరోజుల పాటు నయానో భయానో రైతుల మనసు మార్చటానికి ప్రయత్నించింది. కానీ వారి సాయం లేకుంటే పర్వత ప్రాంతాల్లో తాము అడుగు కూడా వేయలేమని గుర్తించి.. 1923లో కూలీ బేగార్‌ పద్ధతిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలా హిమాలయ ప్రాంత రైతుకూలీలు ఒక్కతాటిపై నిలబడి ఆంగ్లేయుల ఆటకట్టించారు. వెట్టి నుంచి విముక్తి పొందారు. అందుకే గాంధీజీ ఈ ఉద్యమాన్ని 'రక్తరహిత విప్లవం.. అద్భుత ఫలితం' అంటూ కొనియాడారు. అలుపెరగకుండా రైతుల పక్షాన నిల్చిన బద్రీదత్‌ పాండేకు ప్రజలంతా కుమావ్‌ కేసరి బిరుదివ్వటమేగాకుండా.. స్వాతంత్య్రానంతరం ఎన్నికల్లో గెలిపించి పార్లమెంటుకు కూడా పంపించారు.

ఇదీ చూడండి: కొంగులు బిగించి రంగంలోకి.. గాంధీజీనే నిలదీసిన నారీమణులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.