'మేం సమ్మె చేస్తే ప్రభుత్వానిదే బాధ్యత'- మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన
Municipal Workers Protest in Kadapa : మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెలాఖరులో సమ్మెలోకి వెళ్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగరాజు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కడప కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వంటావార్పు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత కొంత కాలం నుంచి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కానీ జగన్ సర్కార్కు చీమకుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు.
AP Municipal Workers Demonds : మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సమ్మెలోకి వెళ్లడం వల్ల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రమై అంటురోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మెలోకి వెళ్తే సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ విరమించే ప్రసక్తే ఉండదని స్పష్టం తెలిపారు.