ప్రభల ఉత్సవాలకు సిద్ధమైన కోనసీమ - పెద్ద సంఖ్యలో పాల్గొననున్న యువత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 10:08 PM IST

thumbnail

Konaseema Prabhala Utsavam 2024: సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున కోనసీమలో నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.  కోనసీమలో నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రాచీన చరిత్ర ఉంది. ఇటీవల కోనసీమ ప్రభలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభల తీర్థాలను జరపాలని కోనసీమ యువత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా 120 గ్రామాల్లో ప్రభలను అత్యంత రమణీయంగా తయారు చేయడంలో యువత, పెద్దలు నిమగ్నమయ్యారు. కనుమరోజు జగ్గన్నతోటలోని ఏకాదశి రుద్ర ప్రభలతోపాటు వివిధ గ్రామాల్లో నిర్వహించే తీర్థాలలో సుమారు 500 ప్రభలు కొలువు తీరనున్నాయి. పంట కాలువలు, చేలు తొక్కుకుంటూ ప్రభలను ఊరేగింపుగా తీర్థప్రదేశాలకు తరలిస్తారు.

కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం వాకలవరువు, తొండవరం, గున్నేపల్లిలో అత్యంత ఎత్తైన ప్రభలను రూపొందిస్తున్నారు. సుమారు 45 నుంచి 50 అడుగుల ఎత్తులో ప్రభలను తయారు చేస్తున్నారు. కనుమ రోజున ప్రభల తీర్థానికి వీటిని మోసుకుంటూ తీసుకెళ్తారు. అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం ప్రాంతాల నుంచి 11 ప్రభలు బయలుదేరి జగ్గన్నతోటకు చేరుకుంటాయి. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలను ఎగువ కౌస్కీ నదిని దాటించి యువకులు తమ భుజాలపై మోసుకొచ్చే తీరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

మరోవైపు కొత్తపేటలో సంక్రాంతి నేపథ్యంలో ప్రభల ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆలయాల వద్ద ఆయా కమిటీ సభ్యులు యువత ప్రత్యేకంగా స్వామి వార్లతో కూడిన ప్రభలను తయారు చేశారు. డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కొత్తపేటలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వద్దకు ప్రభలను తీసుకుని వచ్చారు. అన్ని ప్రభలను ప్రాంగణంలో ఉంచగా ప్రజలు వాటి వద్దకు వచ్చి పూజలు చేసి దర్శించుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.