ETV Bharat / state

World Blood Donor Day: ఈ రక్తదాతలు.. ప్రాణాపాయంలో పునర్జన్మ ప్రదాతలు!

author img

By

Published : Jun 14, 2021, 8:12 AM IST

40, 47, 50, 58.. ఈ నెంబర్లు చూస్తుంటే ఏవో ర్యాంకుల్లా కనిపిస్తున్నాయి కదా! కానీ.. ఇవి కొందరు వ్యక్తులు ఎన్నిసార్లు రక్తదానం చేశారో చెప్పే అంకెలు. దేవుడు మనిషికి జన్మిస్తే.. రక్తదానంతో ప్రాణాపాయంలో మరొకరికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు దాతలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. సేవలో ముందున్న కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంత రక్తదాతల గురించి తెలుసుకుందాం.

special story on krishna district diviseema blood donors
special story on krishna district diviseema blood donors

అన్ని దానాల్లోనూ రక్తదానానిది అపురూప స్థానం. అలాంటి దానంలో ముందుంటున్నారు కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంత ప్రజలు. రక్తదానంపై 2005లో ఓ కార్యక్రమం నిర్వహించిన యాసం చిట్టిబాబు.. దివిసీమ ప్రాంత ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(indian red cross society) జీవితకాల సభ్యులైన ఆయన.. ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఎంత ముఖ్యమో వివరించారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరినో రక్తదానం వైపు మళ్లించారు. ఆయన సేవలకు గుర్తింపుగా.. 2008లో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు, బంగారు పతకం అందుకున్నారు.

అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి, ఈ మధ్యనే రిటైరైన భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు.. విద్యార్థులు, వాలంటీర్లలో చైతన్యం నింపారు. రక్తం అవసరమైన వారి దగ్గరికి వెంటనే దాతను పంపేలా ఏర్పాటు చేశారు. ఆ విధంగా 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 12 వందల మందితో రక్తదానం చేయించారు. 'యూత్ రెడ్ క్రాస్' యూనిట్‌కి నోడల్ అధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు.. 2018న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు.

యాసం చిట్టిబాబు, భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యువకులు రక్తదానం చేస్తున్నారు. 'మన అవనిగడ్డ' వాట్సప్ గ్రూప్ ద్వారా.. ఇప్పటికే 3వేల 500 మందికి రక్తం అందించారు. రెడ్ క్రాస్ సొసైటీకి అవసరమైనప్పుడల్లా రక్తం ఇస్తున్నారు. ప్రతి వ్యక్తి సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయడం ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్ సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అందరూ ముందుకురావాలని కోరుతున్నారు.

దివిసీమ ప్రజలు.. రక్తదానంతో అవుతున్నారు పునర్జన్మ ప్రదాతలు!

ఇదీ చదవండి:

Nominated Posts: త్వరలో 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.