ETV Bharat / state

TDP Yanamala on BC Census: "వైసీపీ ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా తీరని ద్రోహం చేస్తోంది"

author img

By

Published : Aug 3, 2023, 1:25 PM IST

yanamala
yanamala

TDP Leader Yanamala Fires on CM Jagan over BC Census: జగన్ రెడ్డి ప్రభుత్వం.. బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పులివెందుల కూడా టీడీపీదేనన్న ఆయన.. జగన్ సభలకు జనం కరవయ్యారని, వచ్చిన వాళ్లు గేట్లు దూకి పారిపోతున్నారని విమర్శించారు.

TDP Leader Yanamala Fires on CM Jagan over BC Census: సామాజిక న్యాయానికి దోహదపడే బీసీ జనగణనను దేశ వ్యాప్తంగా.. రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక స్థితిగతులేంటి, దారిద్య్ర రేఖకు దిగువన ఉండడానికి గల కారణాలు, సంచార జాతులుగా ఎంత మంది ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి వంటి సమాచారం బీసీ జనగణన ద్వారానే వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమాచారం లేకుండా జగన్ రెడ్డి ఏ విధంగా పాలన సాగిస్తారని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేయవచ్చని పట్నా హైకోర్టు కూడా చెప్పిందని, బీహార్​ ప్రభుత్వం కూడా మొదలు పెట్టిందన్న యనమల.. జగన్ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీసీ జనగణనను జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదని నిలదీశారు. బీసీలంటే జగన్ రెడ్డికి ఎందుకు అంత కక్ష అంటూ మండిపడ్డారు. బీసీల విషయంలో లెక్కలేనితనం చూపుతున్న జగన్ రెడ్డికి త్వరలో బీసీలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెంటనే బీసీ జనగణనను మొదలు పెట్టాలని యనమల డిమాండ్‌ చేశారు.

టీడీపీ హయాంలో చట్ట సభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే వాటిని ఆమోదించుకునే విషయంపై జగన్ రెడ్డి దృష్టి పెట్టకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. అప్పులపై ఉన్న శ్రద్ధ.. బీసీల సంక్షేమంపై లేదని విమర్శిచారు. వైసీపీ నుంచి గెలిచిన 151 మందిలో 140 మంది అవినీతి తిమింగలాలే అనే విషయం ఏడీఆర్ నివేదిక ద్వారా బట్టబయలైందని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

దేశంలో అత్యధిక ధనిక ఎమ్మెల్యేల జాబితా చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలే మొదటి స్థానంలో ఉన్నారని అన్నారు. అయినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారంటూ మండిపడ్డారు. నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలతో వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్.. దొంగ ఓట్లపై దృష్టి పెట్టిన విధంగానే, వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకుండా కాపాడాలన్నారు. డబ్బు ప్రభావం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యంత అణగారిన వర్గం చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందని పేర్కొన్నారు.

జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత ఊరిలో కూడా ప్రజలు.. చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టడం జగన్​పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపడుతోందన్నారు. జగన్ రెడ్డి సభలకు బలవంతంగా ప్రజలను తరలించిన రావట్లేదని.. కానీ చంద్రబాబు నాయుడు సభలకు స్వచ్ఛందంగా ప్రజలు హాజరై మద్దతు తెలుపుతున్నారన్నారు. పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజా సంపదను పెత్తందారులకు దోచిపెట్టడం వల్లనే జగన్ సభలకు జనం కరవైనారన్నారు. బాదుడే బాదుడుతో తాడేపల్లి ప్యాలెస్ నింపుకునేందుకు ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం జ‌గ‌న్ ప్రసంగిస్తున్న స‌మయంలోనే స‌భ‌కు హాజ‌రైన వారు మ‌ధ్యలోనే లేచి వెళ్లిపోవటం దేనికి సంకేతమని యనమల రామకృష్ణుడు నిలదీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.