ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మనీ పవర్.. మజిల్ పవర్ పని చేయలేదు : యనమల

author img

By

Published : Mar 17, 2023, 9:38 PM IST

Yanamala on MLC Election Results: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో.. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు.ప్రజాగ్రహం ఉంటే మనీ, మజిలీ, పవర్‌ ఏమి చేయలేవనేదానికి ఈ ఎన్నికల ఫలితాలే సంకేతమన్నారు.

Yanamala Rama Krishnudu
యనమల రామకృష్ణుడు

Yanamala Rama Krishnudu on MLC Election Results: ప్రజాగ్రహం ఉంటే మనీ పవర్, మజిల్ పవర్ వంటివి ఏం చేయలేవని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో రాజధానిని కోరుకోవడం లేదన్నారు. వైఎ్ససార్సీపీని చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని.. అందుకే వైఎస్సార్సీపీ గ్యాంగ్​కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారని దుయ్యబట్టారు.

అప్పుల ద్వారా వచ్చిన నిధులను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన అప్పు ఎక్కడికి వెళ్లిందని నిలదీశారు. అప్పుల విషయాన్ని బడ్జెట్​లోనో.. బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. అన్ని రూపాలుగా చేసిన అప్పులెంత..? వాటికి కడుతోన్న వడ్డీలెంతో లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్ధిక పరిస్థితుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర అప్పులు.. 11 లక్షల కోట్ల మేరకు చేరతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తేనే ఈ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జరిగేది సివిల్ వార్ అని యనమల అన్నారు.

ఈ ప్రభుత్వాన్ని గెలవనివ్వకూడదనే రీతిలో ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పారు. నీరో చక్రవర్తి తరహాలో జగన్ ప్రభుత్వం కూడా నాశనం కావడం ఖాయమని హెచ్చరించారు. విశాఖ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉండగా విశాఖ రాజధాని గురించి మాట్లాడటం తప్పు అని అన్నారు. పార్లమెంటులో సవరణ జరిగితే తప్ప రాజధాని మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాధారణ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పతనం ప్రారంభమయ్యాక ఆగడమనేదే ఉండదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఇప్పుడున్న మంత్రులను మార్చి.. కొత్త మంత్రులను పెట్టినా ఆ పార్టీకి ఒరిగేదేం ఉండదని యనమల ఆక్షేపించారు. కొత్త మంత్రులు వచ్చినా ఏం చేయగలరని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై.. టీడీపీ నేత యనమల వ్యాఖ్యలు

"అభివృద్ధి ఏమో తగ్గిపోతోంది.. అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. 2024-25 అయ్యేటప్పటికి 11 లక్షల కోట్ల అప్పు ఉంటుంది. అసలు తెస్తున్న అప్పులు ఎక్కడకి వెళ్తున్నాయి. ఈ బడ్జెట్ చూసిన తరువాత ప్రజలకు కూడా నమ్మకం పోయింది. అందుకే ఈ రోజు ఫలితాలు కూడా వాళ్లకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి.. మనీ పాలిటిక్స్​పై ఆధారపడి ఉన్నారు. కండ బలంపై ఆధారపడి ఉన్నారు. ఈ రెండూ కూడా ఇక్కడ పనిచేయవు అని చెప్పేందుకు నిదర్శనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు. పెద్దపెద్ద రాజ్యాలు, రాజులపై కూడా ప్రజలు తిరగబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇతనికి స్వస్తి పలుకుతారు అని చెప్పడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం". - యనమల రామకృష్ణుడు, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.