ETV Bharat / state

18వ రోజూ తగ్గని హోరు - వినూత్న నిరసనలతో ఆంగన్వాడీల అందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 9:14 PM IST

ap_anganwadi_protest
ap_anganwadi_protest

AP Anganwadi Protest: రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన 18వ రోజుకు చేరుకుంది. వీరి ఆందోళనలు పలు ప్రజా సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు, పలు పార్టీల నేతలతో మరింత ఉద్ధృతంగా కొనసాగాయి. తమను అధికార వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

18వ రోజుకు చేరుకున్న ఆంగన్వాడీల అందోళన - వినూత్న నిరసనలతో

AP Anganwadi Protest: వేతనాల పెంపు సహా పలు డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 18వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. పలుచోట్ల అంగన్వాడీల దీక్షలకు జనసేన నేతలు, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. పలు జిల్లాల్లో అంగన్వాడీలు నిరాహార దీక్షలు చేపట్టగా వారికి వామపక్ష నాయకులు, కౌలు రైతు సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు కోరారు. అంగన్వాడీలను వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని కౌలు రైతు సంఘం నాయకులు మండిపడ్డారు.

విజయవాడ ధర్నా చౌక్​లో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో భారీ సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు జరిపినా తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం ఖాయమని అంగన్వాడీలు హెచ్చరించారు.

జగనన్న'ఏసీలో నువ్వు ఉన్నావు' 'రోడ్డు మీద మేము ఉన్నాం': అంగన్వాడీలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టి, ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. వారికి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. నందిగామలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి వామపక్ష నాయకులు, కౌలు రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షలో కూర్చున్న అంగన్వాడీలు, ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్నూలు - బళ్ళారి ప్రధాన రహదారిపై ఒంటి కాలుతో నిలబడి దండం పెడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. పెద్దకడబూరులో అంగన్వాడీలు జలదీక్ష చేపట్టగా వారికి టీడీపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం పాటలు పాడుతూ ఎల్​ఎల్సీ కాలువలో తమ నిరసన కొనసాగించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు

నంద్యాలలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన కొనసాగుతోంది. నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఎంపీ ఇంటికి వినతిపత్రం అంటించారు.

బాపట్ల జిల్లా పర్చూరు, చినగంజాంలో వినూత్నరీతిలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. మోకాళ్లపై నిలబడి తమకు జీతాలు పెంచాలని డిమాండ్​ చేశారు. చినగంజాం తాశీల్దార్​ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఒంటికాలుపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్సార్​ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని చిన్నమాచుపల్లె సూపర్​వైజర్​ బెదిరిస్తున్నారని అంగన్వాడీలు ఆరోపించారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో తాము శాంతియుతంగా తమ ఆందోళనను, కొనసాగిస్తున్న సమయంలో సూపర్​వైజర్​ ఈ చర్యకు పూనుకున్నారని వారు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను తెరవకపోతే మీ ఉద్యోగాలు పోతాయంటూ సూపర్​వైజర్​ బెదిరిస్తున్నారని అంగన్వాడీలు అన్నారు.

అంగన్వాడీల అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనం: లోకేశ్

ఈ క్రమంలో సూపర్​వైజర్​ ఇంటి ముందు అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కొనసాగుతున్న సమయంలో తమను సూపర్​వైజర్​ బెదిరించడం తగదన్నారు. వీరికి జిల్లా సీఐటీయు నాయకులు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి తిరిగివచ్చి ఎంపీడీవో కార్యలయం ఎదుట ఒంటికాలుతో నిలబడి తమ నిరసనను కొనసాగించారు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. వీరికి మద్దతుగా జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో జనసేన శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్​సీపీకి అంగన్వాడీలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

సీఎం జగన్​కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు

ఎన్నికల ముందు సీఎం జగన్​ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిర్వహించిన ఆందోళనలు ఉదృతంగా కొనసాగాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలిపారు. అంగన్వాడీల దీక్షా శిబిరాలను ఆయన సందర్శించి, ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

నెల్లూరులో అంగన్వాడీలు, కార్మిక, ప్రజా సంఘాలతో కలిసి మహార్యాలీ నిర్వహించారు. వేల సంఖ్యలో అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వైఎంసీఏ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. పారిశుద్ధ్య కార్మికులకు, అంగన్వాడీలకు, ఒప్పంద ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన జగన్ హామీలను గాలికొదిలేశారు: అంగన్వాడీలు

నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆకులు తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం జగన్​ ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తాము పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఎన్టీఆర్ కూడలిలో అంగన్వాడీలు గడ్డిమేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను గడ్డి మేయమనే రీతిలో రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. బొబ్బిలి, బాడంగి, తెర్లాం రాంబద్రపురం మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరికి సీఐటీయూ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు.

రాష్ట్రం ఉద్యమాల రాష్ట్రంగా తయారయిందని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారి ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. రాష్ట్రంలో జగన్​ పాలన బ్రిటిష్ పాలనలాగా సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి భీమవరం వస్తున్న క్రమంలో యూటీఎఫ్​ నాయకులను ముందస్తుంగా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.

వైసీపీ నేతలకు కేకులు, మాకు గడ్డి పోచలా?! - సీఎం జగన్​పై అంగన్వాడీల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.