ETV Bharat / state

MAHANADU: చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా మహానాడు ఏర్పాట్లు.. సర్వం సిద్ధం..

author img

By

Published : Apr 30, 2023, 1:56 PM IST

MAHANADU: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే మహానాడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

Mahanadu Will Remain Forever In History
చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా మహానాడు ఏర్పాట్లు

MAHANADU: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే మహానాడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మే 27, 28 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేమంద్రవరంలో ఈ 41వ మహానాడును చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఈ మహానాడు ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం వేమగిరిలో మహానాడు నిర్వహించబోయే స్థలాన్ని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, సత్యనారాయణమూర్తి, ఆలపాటి రాజా తదితరులు శనివారం పరిశీలించి.. దాన్ని ఖరారు చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని.. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేలా 15 లక్షల మందితో బహిరంగ నిర్వహిస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

"సుమారు 100 ఎకరాల విస్తీర్ణ స్థలంలో మే నెల 27, 28వ తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 27వ తేదీన పార్టీలోని రాష్ట్ర స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు ఉన్న అన్ని విభాగాలకు చెందిన సుమారు 15 వేల మంది సభ్యులతో జాతీయ రహదారికి కుడి వైపు సదస్సులు నిర్వహించి టీడీపీ బలోపేతం, మహానాడులో ప్రకటించాల్సిన తీర్మానాలపై చర్చిస్తాం. మరుసటి రోజు 28వ తేదీన జాతీయ రహదారికి ఎడమ వైపున దేశ విదేశాల నుంచి వచ్చే సుమారు 15 లక్షల మందితో సాయంత్రం 3 గంటలకు 100వ భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. గత మహానాడుకు ఒకే వేదిక ఏర్పాటు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ ఏడాది ఎలాంటి సమస్యలు లేకుండా కార్యక్రమం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఈ సంవత్సరం రెండు రోజులు రెండు వేదికలు ఏర్పాటు చేస్తాం. ఆ రెండూ సమీపంలోనే ఉంటాయి. గత ఏడాది మహానాడు కార్యక్రమ నిర్వహణకు సర్కారు అనేక ఇబ్బందులకు గురి చేసింది. ఈ సంవత్సరం మహానాడు వేదిక నిర్వహణ, పోలీసు బందోబస్తుకు సంబంధించి అనుమతులు కోరుతాం. ఈసారి ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాం. లేకుంటే పార్టీ వాలంటీర్లే అన్ని ఏర్పాట్లు చేస్తారు. మహానాడు కార్యక్రమ నిర్వహణకు సంబంధించి నిష్ణాతులు, అనుభవంతో కూడిన 15 కమిటీల ఎంపిక దాదాపు పూర్తయింది. రెండ్రోజుల్లో ఆ జాబితా విడుదల చేస్తాం. మహానాడు నిర్వహణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదారంగా విరాళాలు ఇవ్వాలి." - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

"రాష్ట్రంలో కక్షసాధింపు పాలన నడుస్తోంది. ఏ ఫిర్యాదు లేకపోయినా మార్గదర్శిపై, విశాఖలో గీతం యూనివర్సిటీపై దాడు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న తరుణంలో మహానాడుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అనేక అంశాలకు ఈ వేదికపై సమాధానాలు లభిస్తాయి." - యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.