ETV Bharat / state

STICKERS: 'ప్రశ్నిస్తే.. పథకాలు తీసేస్తాం.. ఇంకా మాట్లాడితే పళ్లు పీకేస్తాం..'

author img

By

Published : Apr 30, 2023, 7:31 AM IST

Updated : Apr 30, 2023, 12:02 PM IST

YCP STICKERS: 'జగనన్నే మా భవిష్యత్తు' అనే కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు జనాల ఇళ్లకు, సెల్​ఫోన్​లకూ స్టిక్కర్లను అతికించారు. ఆ సమయంలో ప్రశ్నించినవారి గొంతుక మూయించేందుకు ఇష్టారీతిగా బెదిరింపులకు పాల్పడ్డారు వైసీపీ నాయకులు. దీంతో ఇదేనా.. వైసీపీ సర్కార్ చెబుతున్న భవిష్యత్తు..? స్టిక్కర్లు వద్దంటే దాడులకు పాల్పడతారా..?అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

jagananna mana bhavishyath program
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

YCP STICKERS: ప్రశ్నిస్తే పథకాలు తీసేస్తామంటున్నారు.. ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా 'ఇంకా మాట్లాడితే పళ్లు పీకేస్తా'నంటూ హూంకరించారు. 'నీకు పథకాలన్నీ రద్దు చేయిస్తా, నీ కథ చూస్తా' అంటూ ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుడిపై మరో ఎమ్మెల్యే గాండ్రించారు. ఇంకోచోట ఇంటికి స్టిక్కర్‌ అతికించొద్దన్నందుకు సొంత పార్టీకి చెందిన వ్యక్తినే వైసీపీ కౌన్సిలర్‌ అనుచరులు చితకబాదారు. 'జగనన్నే మా భవిష్యత్తు' అంటూ అధికార వైసీపీ శనివారం వరకు సాగించిన ప్రచార యాత్రలో.. 'మా నమ్మకం నువ్వే జగన్‌' అనే స్టిక్కర్లు ఇళ్లకు, జనాల సెల్‌ఫోన్‌లకూ అతికించారు. అదే సమయంలో ప్రశ్నించిన వారిని ఇష్టారీతిగా బెదిరించారు. ఇదేనా వైకాపా ప్రభుత్వం చెబుతున్న భవిష్యత్తు..? స్టిక్కర్లు అతికించొద్దన్నందుకు దాడికి తెగబడతారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

'కులం చూడం.. పార్టీ చూడం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం' ఎన్నికల ప్రచారంలో, తర్వాత అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌ గొప్పగా చెప్పే మాటలివి. కానీ, 'రైతు భరోసా వద్దా? నీవు టీడీపీ కార్యకర్తవని తెలుసు.. ఈసారి ఊరుకున్నాం, మళ్లీ తెదేపా వెంట తిరిగితే మీకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయిస్తాం. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే, నీ కథ చూస్తా' అని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో ఒక లబ్ధిదారుడిని హెచ్చరించారు.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లిలో ఎమ్మెల్యే రమణమూర్తి రాజును ఓ విద్యార్థి విద్యాదీవెన పథకంపై నిలదీశాడు. ఇవ్వకుండానే విద్యాదీవెన మంజూరైందని ఎలా చెబుతారని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో 'మీ స్కూల్లో ఇచ్చాంలే, ఇక్కడి నుంచి వెళ్లు' అంటూ విద్యార్థిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. 'మళ్లీ ఓట్ల కోసం మా దగ్గరకు వస్తారు కదా? అప్పుడు మేం కూడా వెళ్లు వెళ్లు అంటాం..' అనేసరికి, 'ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా పళ్లు పీకేస్తా అట్టుకెళ్లి' అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు విద్యార్థి పైకి దూసుకువెళ్లారు.

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పర్యటించిన సమయంలో ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయలేదంటూ కార్వేటి నగరంలో సోమశేఖర్, డీఎస్సీ వేయలేదని గురవరాజగుంట గ్రామంలో రేఖ అనే యువతి ఆయన్ను ప్రశ్నించగా..ఆయన దాటవేత వైఖరి ప్రదర్శించారు.

తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఒక కౌన్సిలర్‌.. తన వార్డులో అనుచరులను స్టిక్కర్లను అతికించేందుకు పంపారు. వారొచ్చినపుడు 'వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి, నేను పార్టీ మనిషినే అయినా మా ఇంటికి స్టిక్కర్లు అతికించొద్దు' అని వైకాపాకు చెందిన ఒక వ్యక్తి అడ్డుచెప్పారు. అదేరోజు రాత్రి ఆ వ్యక్తిని మాట్లాడాలి రమ్మని భౌతికదాడి చేశారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఒకరోజు రాత్రిపూట వెళ్లి స్టిక్కర్లు అతికించే ప్రయత్నం చేయగా స్థానికులు వ్యతిరేకించారు. ఇలాగైతే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా చేస్తామని వైసీపీ నాయకులు బెదిరించడంతో.. 'మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా? పథకాలు ఎందుకు ఆపేస్తారు?' అని స్థానికులు నిలదీశారు. దీంతో మెల్లగా జారుకున్నారు.

ఏలూరు జిల్లా కలిదిండి మండలం పెదలంకలో స్థానిక వైకాపా నాయకులు స్టిక్కర్లతో వెళ్లగా మా ఇళ్లకు అతికించొద్దంటూ గ్రామస్థులు అడ్డు చెప్పారు. నూజివీడులోని ఒక వార్డులో, వేలేరుపాడు, యలమంచిలి, వీవీ లంకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెంలో రహదారులు, తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వైసీపీ నేతలను స్థానికులు ప్రశ్నించారు. నిధులు రాగానే పనులు చేయిస్తామని చెప్పి నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి 7వ వార్డు ఎన్టీఆర్‌ కాలనీలో తిరిగినపుడు మూడు నెలల నుంచి కుళాయిల్లో నీరురావడం లేదని జ్యోతి, ఉపాధ్యాయులకు జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ విశ్రాంత ఉపాధ్యాయిని రాజేశ్వరమ్మ నిలదీయంతో రామ్‌కుమార్‌ వేరే విషయాల గురించి ఏదో చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

వాల్మీకి బోయను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని పాడేరు, అరకు, రంపచోడవరం ప్రాంతాల్లో గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నిరసన కార్యక్రమాలనూ చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలు మా ఇళ్లకు రావద్దంటూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. 'ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు మా ఇళ్లకు రావద్దు, స్టిక్కర్లను అతికించొద్దు' అంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ అడ్డుకున్నారు.'

'నవరత్నాల్లో ఒక్క రత్నమూ మాకందలేదు.. రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు.. అమ్మఒడి పథకానికి అవకాశం లేకుండాపోయిందంటూ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో అలీంబాషా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేదు, స్థలం లేదు, జగనన్న మాకొద్దు' అంటూ స్టిక్కర్‌ను తొలగించారు.

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతన కొత్తూరు గ్రామానికి వెళ్లిన వైసీపీ గృహ సారథులు, గ్రామ వాలంటీర్లకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఇంతకాలం పార్టీ వల్ల ఎలాంటి మేలూ జరగలేదని, ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని వైసీపీ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నాలుగు నెలలుగా రేషన్‌ రావడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదు' అంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను మహిళలు కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజే ప్రశ్నించారు.

వైసీపీ నాయకులు వచ్చి స్టిక్కర్లను అతికిస్తున్నపుడు వారితో గొడవెందుకని ఊరుకొని.. ఆపై వారు వెళ్లిపోయాక చాలామంది స్టిక్కర్లను తొలగిస్తున్నారు. ఈ ప్రచార, ప్రజా సర్వేకు అత్యధిక శాతం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మొహం చాటేశారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు వంటి మంత్రులు, రాజధాని ప్రాంతమైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలాంటి ఎమ్మెల్యేలు దూరంగానే ఉన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిరోజు ప్రారంభించి వదిలేయగా, మార్కాపురం, దర్శి ఎమ్మెల్యేలు అదే బాటలో నడిచారు. సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, మధుసూధన యాదవ్‌లు రెండుచోట్ల, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మూడు రోజులు పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దగా ఈ కార్యక్రమం చేపట్టలేదు. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆ నియోజకవర్గ టికెట్‌ ఆశిస్తున్న మామిడి శ్రీకాంత్, తులసి వరప్రసాద్‌ వేర్వేరుగా స్టిక్కర్లను అతికించే కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఒకరిద్దరు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజులు పాల్గొన్నా ఆ సమయంలో వైసీపీ సానుభూతిపరుల ఇళ్లకే వెళ్లి మాట్లాడి వెళ్లిపోయారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ శిరీష వేర్వేరుగా 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందుగా వాలంటీర్లను పంపి.. వారు సూచించిన ఇళ్లకు వెళ్లి స్టిక్కర్లు అతికిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు అనేది పూర్తిగా వైసీపీ ప్రచారం కార్యక్రమం. కానీ రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల వాలంటీర్లే నడిపిస్తున్నారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న వీరు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 30, 2023, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.