ETV Bharat / sports

కోహ్లీ 'ఫేక్​ ఫీల్డింగ్'​పై బంగ్లా బోర్డు రియాక్షన్​.. ఆ సంగతేంటో తేలుస్తామంటూ

author img

By

Published : Nov 4, 2022, 10:05 AM IST

బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ ఫేక్​ ఫీల్డింగ్ అంటూ సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. దీనిపై మాజీలు కూడా స్పందిస్తున్నారు. అయితే ఇప్పుడా విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఏం చెప్పిందంటే..

Kohli fake fielding
కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్

టీమ్​ఇండియా-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఎంతో ఆసక్తిగా సాగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో 5 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. అలాగే ఈ మ్యాచ్​లో విరాట్ కోహ్లీ 'ఫేక్‌ ఫీల్డింగ్‌' చేశాడంటూ బంగ్లా క్రికెటర్​ నూరల్ హాసన్​ ఆరోపణలు చేశాడు. మాకు ఐదు పరుగులు అదనంగా ఇవ్వాల్సిందని బంగ్లా క్రికెటర్ నూరుల్‌ అహ్మద్ పేర్కొన్నాడు. ఈ విషయం సోషల్‌ మీడియా సహా క్రికెట్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు కూడా స్పందించినట్లు పలు వార్తా కథనాలు వచ్చాయి. అయితే వివాదాస్పదమైన అంపైరింగ్‌పై సరైన వేదిక వద్ద ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ షకిబ్‌ కూడా అంపైర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బీసీబీ క్రికెట్ ఆపరేషన్‌ ఛైర్మన్ జలాల్ యూనస్‌ పేర్కొన్నారు.

"ఈ అంశంపై తప్పకుండా మాట్లాడతాం. ప్రతి ఒక్కరూ టీవీలో వచ్చిన దానిని చూశారు. ఇక్కడ ఫేక్‌ త్రో జరిగినట్లు అనిపించింది. అప్పుడే అంపైర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 'నేను గుర్తించలేదు' అని అంపైర్‌ చెప్పాడు. దీంతో రివ్యూ కూడా తీసుకోలేదు. మ్యాచ్‌ అనంతరం షకిబ్‌ కూడా అంపైర్‌ ఎరాస్మస్‌తో చాలా సేపు చర్చించాడు. అలాగే వర్షం పడిన తర్వాత ఆటను త్వరగా ప్రారంభించడంపైనా షకిబ్‌ అంపైర్లతో మాట్లాడాడు. అవుట్‌ ఫీల్డ్‌ మరీ చిత్తడిగా ఉందని.. కాస్త సమయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా వినలేదు. చివరికి అంపైర్ల నిర్ణయంతో మ్యాచ్‌ ఆడక తప్పలేదు. అక్కడ ఎలాంటి వాదనకు ఆస్కారం ఉండదు. అందుకే తప్పకుండా సరైన వేదికపైకి అంపైరింగ్‌ సంబంధించిన అంశాలను తీసుకెళ్తాం" అని జలాల్‌ వెల్లడించారు.

ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. "ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన పనిని అంపైర్‌లు గుర్తించపోయినప్పటికీ.. గ్రౌండ్‌లో చాలా కెమెరాలు ఉన్నాయి. కానీ ఫీల్డ్‌లో ఏ ఆటగాడైనా అలా మొదటి సారి చేస్తే.. అంపైర్‌లు కేవలం వార్నింగ్‌ మాత్రమే ఇస్తారు. రెండో సారి అదే తప్పు పునారావృతం అయితే అప్పుడు అంపైర్లు పెనాల్టీ విధిస్తారు. బహుశా భారత కెప్టెన్‌, కోహ్లీకి కూడా అంపైర్లు ఈ మ్యాచ్‌లో వార్నింగ్‌ ఇచ్చి ఉండవచ్చు. అదే విధంగా విరాట్​ చేసిన యాక్షన్‌ వాళ్ల బ్యాటర్లకు కూడా ఇటువంటి ఇబ్బంది కలగలేదు. అందుకే బంగ్లా బ్యాటర్లు కూడా ఎటువంటి అప్పీలు చేయలేదు. ఈ విషయంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు" అని అతడు పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: ఆ క్రికెటర్​ అద్భత ప్రదర్శనకు కోహ్లీ ఫిదా.. సూపర్ గిఫ్ట్ ఇచ్చాడుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.