ETV Bharat / sports

'బుమ్రా విషయంలో పాక్ చేసిన తప్పు చెయ్యొద్దు'.. బీసీసీఐపై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు!

author img

By

Published : Jun 24, 2023, 9:53 PM IST

Ravi Shastri On Bumrah : ప్రపంచ కప్​ సమీపిస్తున్న వేళ.. పేసర్ బుమ్రాను జట్టులోకి తీసుకురావడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన తప్పును బీసీసీఐ చేయకూడదని హితవుపలికాడు.

Ravi Shastri On Bumrah
జట్టులో బుమ్రా రాకపై రవిశాస్త్రి కామెంట్లు

Ravi Shastri On Bumrah : టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్​ప్రీత్ బుమ్రాను ప్రపంచ కప్ సమయానికి రెడీగా ఉంచాలని బీసీసీఐ ఆలోచిస్తున్న తీరును రవిశాస్త్రి తప్పుబట్టాడు. ఆగస్టులో ఐర్లాండ్​తో జరిగే టీ20 మ్యాచ్​లకు బుమ్రాను ఆగమేఘాలపై జట్టులోకి తీసుకొస్తే.. అతడు గాయపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అలా జరిగితే భారత్​కు తీవ్రనష్టం కలుగుతుందని తన అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గతంలో పీసీబీ చేసిన తప్పును ప్రస్తావిస్తూ.. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదీ జట్టుకు దూరమైన విషయాన్ని గుర్తు చేశాడు.

"ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఆ టోర్నీ కోసం ప్రాక్టీస్​ అవుతుందన్న ఉద్దేశంతో బుమ్రాను జట్టులోకి తీసుకొస్తే.. మరోసారి గాయపడితే మళ్లీ నాలుగు నెలల పాటు అతడు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది జట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. గతంలో కూడా పాకిస్థాన్.. టీ-20 వరల్డ్ కప్​ను దృష్టిలో ఉంచుకొని బౌలర్ షహీన్ అఫ్రిదీ పూర్తిగా గాయం నుంచి కోలుకోకముందే జట్టులో ఆడించారు. బోర్డు తొందరపాటు నిర్ణయం వల్ల షహీన్ అఫ్రిదీ మళ్లీ నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. బుమ్రా ఓ అత్యుత్తమ పేస్ బౌలర్. అతడు టీమ్ఇండియాకు చాలా కీలకం. కానీ అతడిని ప్రపంచకప్ ప్రాక్టీస్ కోసమని ఇప్పుడు ఐర్లాండ్​తో టీ 20ల్లో బరిలో దింపితే.. జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే మేనేజ్​మెంట్ ఆలోచించి ముందుకెళ్లాలి."
-రవిశాస్త్రి టీమ్ఇండియా మాజీ కోచ్

Bumrah Comeback Into TeamIndia : కాగా గతేడాది సెప్టెంబర్​ నుంచి వెన్నెముక గాయం కారణంగా బుమ్రా ఆటకు దూరమయ్యాడు. 2022 టీ20 ప్రపంచ కప్​లో కూడా బుమ్రా లేకుండానే టీమ్ఇండియా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ బుమ్రాను ఐర్లాండ్​తో టీ20ల్లో ఆడించి.. రానున్న ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్​నకు అతడిని సిద్ధం చేయాలని మేనేజ్​మెంట్ ఆలోచిస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఈ కామెంట్లు చేశాడు.

India T20 Captain : హర్దిక్ పాండ్య టీ20ల్లో టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్​గా బాధ్యతలు తీసుకోవచ్చని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్​నకు రోహిత్ శర్మ టీమ్ఇండియాకు సారథ్యం వహించాలని... ఆ తర్వాత వన్డేల్లో కూడా టీమ్ఇండియాను హర్దిక్ నడిపించాలని కోరుకుంటున్నట్లు శాస్త్రి పేర్కొన్నారు.

India Tour Of Ireland 2023 : హర్దిక్ పాండ్య సారథ్యంలో ఆగస్టులో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అక్కడ భారత్ మూడు టీ20 మ్యాచ్​లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న జరగనుంది. ఈ పర్యటనకు సంబంధించి జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.