ETV Bharat / sports

వరల్డ్‌ కప్ ఆరంభం ఆ రోజే.. హైదరాబాద్‌లోనూ మ్యాచ్​లు.. భారత్​ టీమ్​ రెడీ!

author img

By

Published : Mar 22, 2023, 12:01 PM IST

మరికొద్ది నెలల్లో భారత్​లో జరిగే వన్డే వరల్డ్​ కప్​ తేదీలు ఫిక్స్ అయ్యాయి. అక్టోబరు 5వ తేదీన టోర్నీ ప్రారంభమవ్వనుందని సమాచారం. మరోవైపు, వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టు ఏదో ఆ జాబితా దాదాపుగా రెడీ అయిపోయిందని టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ ద్రవిడ్ చెప్పాడు.

icc world cup 2023
icc world cup 2023

ICC ODI World Cup 2023: 12 ఏళ్లు తర్వాత ఐసీసీ వన్డే ప్రపంచ కప్​ టోర్నీకి భారత్​ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నీకి సంబంధించి తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. కానీ ఇంకా బీసీసీఐ అధికారికంగా ప్రకటించకలేదు. గత వారం దుబాయ్​లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్​ మండలి ఐసీసీ సమావేశంలో ఈ వివరాలు అందించినట్లు సమాచారం.

అయితే వన్డే ప్రపంచకప్​ అక్టోబరు 5వ తేదీన ప్రారంభమవ్వనుందని తెలిసింది. నవంబరు 19న అహ్మదాబాద్​లో ఫైనల్​ జరగనున్నట్లు సమాచారం. 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయట. వేదికల విషయంలో అహ్మదాబాద్‌ కాకుండా మరో 11 నగరాలను బీసీసీఐ ప్రాథమికంగా షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ముంబయి, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్​నవూ, ఇందోర్, రాజ్‌కోట్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

అక్టోబర్‌- నవంబర్‌ నెలలో భారత్‌లో ఉండే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌లు, వాటి వేదికల వివరాలకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదట. అయితే త్వరలోనే దీనిని వెల్లడిస్తామని ఐసీసీకి బోర్డు సమాచారమిచ్చిందట. పాకిస్థాన్​ జట్టుకు వీసా మంజూరు, భారత ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ అందించడం వంటి అంశాలపై కూడా బీసీసీఐ మరింత స్పష్టతనివ్వాల్సి ఉంది.

2011లో చివరిసారిగా భారత్‌లో వన్డే వరల్డ్‌ కప్‌ జరగ్గా.. ఫైనల్లో శ్రీలంకను ఓడించి మన జట్టే విజేతగా నిలిచింది. అయితే ఈ ఏడాది కూడా వన్డే వరల్డ్ కప్‌ను ఎలాగైనా గెలవాలని టీమ్​ఇండియా ఆశిస్తోంది. సగటు అభిమాని కూడా అదే ఆశ పడుతున్నాడు. ఇటీవల కాలంలో వన్డే ఫార్మాట్​లో భారత జట్టు ఆటతీరు చూస్తే మాత్రం కొంత ఆందోళన కలుగుతోంది.

టీమ్​ఇండియా రెడీ!
తాజాగా, టీమ్​ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన విషయం వెల్లడించాడు. వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టు ఏదో ఆ జాబితా దాదాపుగా రెడీ అయిపోయిందని ద్రవిడ్ చెప్పాడు. "వరల్డ్ కప్ ఉన్న ఈ ఏడాదిలో భారత జట్టును గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. బుమ్రా, పంత్, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులంతా గాయాలతో జట్టుకు దూరమైన వారే. అయినా సరే ప్రస్తుతానికి జట్టు మానసికంగా మంచి స్థానంలో ఉందన్న ద్రవిడ్.. వరల్డ్ కప్‌లో ఆడించే 16-18 మంది ఆటగాళ్లపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాం" అంటూ చెప్పుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.