ETV Bharat / sports

IPL 2023 PBKS VS MI : పంజాబ్‌పై ముంబయి ప్రతీకార విజయం.. కసితీరా కొట్టారుగా

author img

By

Published : May 3, 2023, 11:00 PM IST

Updated : May 4, 2023, 6:40 AM IST

ఐపీఎల్​ సీజన్​16 లో భాగంగా ముంబయి ఇండియన్స్​, పంజాబ్ కింగ్స్​ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో ముంబయి విజయం సాధించింది.

Mumbai vs Punjab
Mumbai vs Punjab

పది రోజుల క్రితం.. ఇండియన్ ప్రీమియర్​ లీగ్ సీజన్ 16లో భాగంగా ముంబయి ఇండియన్స్​- పంజాబ్‌ కింగ్స్ మధ్య​ మ్యాచ్‌ జరిగింది. 214 పరుగుల ఛేదనలో గెలిచేలా కనిపించిన రోహిత్ సేన.. చివరి ఓవర్లో 16 పరుగులు చేయలేక ఓటమిని అందుకుంది. ఇప్పుడు తాజాగా మొహాలీ వేదికగా ముంబయికి అదే ప్రత్యర్థితో మ్యాచ్‌. మళ్లీ దాదాపు అంతే లక్ష్యం. కానీ ఈ సారి ముంబయి పట్టు వదల్లేదు. అలా అని చివరి ఓవర్‌ వరకు కూడా మ్యాచ్‌ను తీసుకెళ్లలేదు. రసవత్తరంగా సాగిన ఈ పోరులో 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి అదరగొట్టింది.

మొదట టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ కింగ్స్​ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. గత మ్యాచ్​ హీరో లివింగ్​స్టన్​ (42 బంతుల్లో 82 పరుగులు: 7x4, 4x6), జితేశ్​ శర్మ (49: 5x4, 2x6) ముంబయి బౌలర్లపై దాడి చేశారు. ధావన్​(30), మ్యాథ్యూ షార్ట్​ (27), పరుగులతో రాణించారు. ఫలితంగా ముంబయి ముందు భారీ లక్ష్యాని ఉంచారు. ముంబయి బౌలర్లలో చావ్లా (2/29) ఆకట్టుకున్నాడు. గ్రీన్​ ఒక వికెట్​ దక్కించుకున్నాడు. ఎక్స్​ట్రాల రూపంలో ముంబయి బౌలర్లు 17 పరుగులు ఇచ్చుకున్నారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టులో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఇషాన్‌ కిషన్‌ (75; 41 బంతుల్లో 7×4, 4×6), 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' సూర్యకుమార్‌ (66; 31 బంతుల్లో 8×4, 2×6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో కొండంత లక్ష్యం చిన్నదైపోయింది. చివర్లో తిలక్‌ వర్మ(26 నాటౌట్‌; 10 బంతుల్లో 1×4, 3×6) , టిమ్​ డేవిడ్‌ (19 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ముంబయి 4 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్‌ బౌలర్లలో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' నాథన్‌ ఎలిస్‌ (2/34) మెరిశాడు. అర్ష్‌దీప్‌ (1/66) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

మరోవైపు ఇదే బుధవారం జరిగిన లఖ్‌నవూ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం ఎక్కువై మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Last Updated :May 4, 2023, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.