ETV Bharat / city

నిజామాబాద్​లో కుటుంబం ఆత్మహత్య, వెలుగులోకి విస్తుపోయే విషయాలు

author img

By

Published : Aug 23, 2022, 12:05 PM IST

Nizamabad Family Suicide Case
నిజామాబాద్​లో కుటుంబం ఆత్మహత్య

Nizamabad Family Suicide Case రియల్టర్ సూర్యప్రకాశ్ కుటుంబం బలవన్మరణ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. నిజామాబాద్​లోని ఓ హోటల్​లో ఆదివారం సూర్యప్రకాశ్, భార్య, పిల్లలు సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆ విషయాలేంటో మీరే చూడండి.

Nizamabad Family Suicide Case : రియల్టర్‌ కుటుంబం బలవన్మరణ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఆదివారం నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో సూర్యప్రకాశ్‌.. భార్య, పిల్లలు సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న ఈయనకు భాగస్వాములతో కొన్నిరోజులుగా విభేదాలొచ్చాయి. 20 రోజుల కిందట కొందరు దాడి చేశారు. తనకు జరుగుతున్న అవమానాలు, ఒత్తిళ్లను తాళలేకనే కుటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

భాగస్వాములపై కేసు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో సూర్యప్రకాశ్‌ భాగస్వాములైన వెంకట్‌ సందీప్‌, కళ్యాణ చక్రవర్తి, కిరణ్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు, మరొకరు విశాఖపట్నానికి చెందినవారని గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల బృందం సోమవారం హైదరాబాద్‌ వెళ్లింది. నిందితుల్లో ఒకరికి పోలీసు అధికారితో సంబంధాలున్నాయని బంధువులు ఆరోపించారు. సూర్యప్రకాశ్‌పై దాడికి సంబంధించి పోలీసులు సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇల్లు, రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం వద్ద నెల రోజులకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ సేకరించే పనిలో ఉన్నారు. 15 రోజుల నుంచి ఈ కుటుంబం హైదరాబాద్‌లో లేకపోవటంతో ఎవరెవరు ఇంటికి, కార్యాలయానికి వచ్చి వెళ్లారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. సూర్యప్రకాశ్‌ ఫోన్‌ చనిపోయే వరకు ఆన్‌లోనే ఉంది. ఆయనకు వచ్చిన ఫోన్లు చాలా వరకు లిఫ్ట్‌ చేయలేదని గుర్తించారు. వాటిలో అధికంగా ఎవరు చేశారనేది చూస్తున్నారు. వాట్సాప్‌ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు.

విలాసవంతమైన జీవితం.. సూర్యప్రకాశ్‌ ఆదిలాబాద్‌లోని ఆస్తులు అమ్ముకొని రియల్‌ వ్యాపారంలో పెట్టారు. ఈయనకు ఓ విల్లా ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో అపార్టుమెంట్లో ప్లాటు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. పిల్లలను పెద్ద పాఠశాలలో చదివిస్తున్నట్లుగా తెలుస్తోంది. వ్యాపారం నేపథ్యంలో తెచ్చిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లుగా ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

శనివారం 11 గంటలే ఆఖరు.. సూర్యప్రకాశ్‌ కుటుంబం చనిపోయినట్లు ఆదివారం మధ్యాహ్నం గుర్తించారు. ఆ కుటుంబం హాటల్‌ గదిలోంచి శనివారం ఉదయం 11 గంటల తర్వాత తలుపు తీయలేదు. అదేరోజు సాయంత్రం ఓ బంధువు వీరి కోసం హోటల్‌కు రాగా.. తలుపు తీయకపోవటంతో నిద్రపోయి ఉంటారని వెళ్లిపోయారు. సీసీ ఫుటేజ్‌లో ఈ విషయాలను గుర్తించారు. దీని ప్రకారం శనివారం సాయంత్రంలోపే వీరు చనిపోయి ఉంటారా..? అని అనుమానిస్తున్నారు. శవపరీక్షలో ప్రాథమికంగా ముగ్గురు విషం కారణంగానే చనిపోయినట్లు గుర్తించారు. అది ఏ విషం అనేది తేలాల్సి ఉంది. చెత్త బుట్టలో కేక్‌, కత్తి పడేసి ఉండటంతో అందులో కలిపి వినియోగించినట్లుగా అంచనాకు వచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.