ETV Bharat / city

Solar Power From SECI: 2014 నుంచి ఏపీ చేసుకున్న ఒప్పందాల్లో సెకి ఆఫరే తక్కువ: ఇంధన శాఖ కార్యదర్శి

author img

By

Published : Nov 7, 2021, 2:48 PM IST

Updated : Nov 8, 2021, 4:20 AM IST

Andhra Pradesh Energy Secretary Srikanth
Andhra Pradesh Energy Secretary Srikanth

14:37 November 07

జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్‌ అవసరం లేదు: ఇంధనశాఖ కార్యదర్శి

‘ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈఎల్‌) ద్వారా సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిలిచిన టెండర్లలో కోట్‌ చేసిన ధర.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకి సౌర విద్యుత్‌ సరఫరాకు ప్రతిపాదించిన ధరనూ బేరీజు వేసుకున్నాం. సెకి ద్వారా యూనిట్‌ రూ.2.49కి విద్యుత్‌ తీసుకోవటమే లాభదాయకమని భావిస్తున్నాం’ అని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ‘సెకి నుంచి విద్యుత్‌ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనని, సర్కారు ఆదేశాలనే అమలు చేస్తున్నాం’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్టీపీసీ యూనిట్‌ రూ.1.99 వంతున సరఫరా చేసేలా గుజరాత్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గురించి తెలియదు. సెకి ప్రతిపాదించిన ధర ఆధారంగానే నిర్ణయం తీసుకున్నాం. సెకి ప్రతిపాదించిన యూనిట్‌ ధర రూ.2.49కి అదనంగా నెట్‌వర్క్‌ ఛార్జీలు సుమారు రూ.1.70 కలుస్తాయి. ఎక్కడి నుంచి విద్యుత్‌ కొన్నా నెట్‌వర్క్‌ ఛార్జీలు తప్పనిసరి. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో సెకి ఆఫర్‌ తక్కువ. గత సెప్టెంబరులో తమిళనాడు యూనిట్‌ రూ.2.61 వంతున తీసుకునేలా సెకితో ఒప్పందం చేసుకుంది. సెకి నుంచి తీసుకునే విద్యుత్‌ కేంద్ర విద్యుత్‌ చట్టానికి లోబడి ఉంటుంది. అందుకే న్యాయ సమీక్ష, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లే అవకాశం ఉండదు. సెకితో ఒప్పందం కుదుర్చుకోవటానికి అనుమతుల కోసం రెండు రోజుల కిందటే రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లో ప్రతిపాదన దాఖలు చేశాం’ అని పేర్కొన్నారు.

ఎందుకు లాభసాటి అంటే..

‘ఏపీజీఈసీఎల్‌ ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానించటానికి ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, అదనపు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు మొదటి విడత రూ.2,260.78 కోట్లతో పనులు చేపట్టాలి. సెకి.. రాష్ట్రం వెలుపల ప్లాంట్లు పెట్టి, విద్యుత్‌ సరఫరా చేస్తుంది. దీన్ని గ్రిడ్‌కు అనుసంధానించటానికి అదనంగా మౌలిక సదుపాయాలు అక్కర్లేదు.

ఏపీజీఈసీఎల్‌ ద్వారా 6,100 మెగావాట్ల ప్లాంట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయటం వల్ల 2,432 మెగావాట్లకు కేంద్ర గ్రిడ్‌పై ఆధారపడాల్సి వస్తుందని కేంద్ర విద్యుత్‌ అథారిటీ తేల్చింది. దీనికోసం పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అôతర్‌రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ విధానం కింద ఏటా రూ.1,021 కోట్లు చెల్లించాలి. సెకి ప్రాజెక్టుల నుంచి తీసుకుంటే 25 ఏళ్లపాటు ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల మినహాయింపు వస్తుంది.

రాజస్థాన్‌లో సూర్యాస్తమయం గంటన్నర ఆలస్యంగా అవుతుంది. కాబట్టి అక్కడి ప్రాజెక్టుల నుంచి అదనంగా సౌర విద్యుత్‌ వస్తుంది. ఇది సాయంత్రం పీక్‌ లోడ్‌ సర్దుబాటుకు ఉపయోగపడుతుందని నిపుణులు సూచించారు.

కేంద్ర గ్రిడ్‌ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకునే విద్యుత్‌కు 3 శాతం సరఫరా నష్టాలుంటాయి. అవి యూనిట్‌కు 7-9 పైసలు అవుతాయి. ఈ రూపేణా సంవత్సరానికి రూ.900 కోట్లు పాతికేళ్లపాటు చెల్లించాలి.

రాష్ట్రానికి ఒకసారి వచ్చే జీఎస్టీని మినహాయించిన తర్వాత కూడా సెకి నుంచి యూనిట్‌ రూ.2.49కి తీసుకోవటం లాభదాయకమే’ అని శ్రీకాంత్‌ వివరించారు.  

విలేకరి: ఎన్టీపీపీ యూనిట్‌ రూ.1.99 వంతున సరఫరా చేసేలా గుజరాత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కదా? దీన్ని ప్రస్తావిస్తూ సెకితో ధర విషయమై సంప్రదింపులు జరపొచ్చు కదా?
శ్రీకాంత్‌: అక్కడ పరిస్థితేంటో మనకు తెలియదు. మన రాష్ట్రానికి సెకి ఆఫర్‌ చేసిన ధర యూనిట్‌ రూ.2.49. మనం పిలిచిన టెండర్లలోనూ అదే వచ్చింది.

ప్ర: ఎన్టీపీసీ ఏడాది కిందటే యూనిట్‌ రూ.1.99కి ఇస్తే.. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ధరకు ఎందుకు కొంటున్నారు?
జ: ఒక్కోసారి ఒక్కో ధరకు టెండర్లు వేస్తారు. గతేడాది ప్రభుత్వ పన్నుల విధానంలో మార్పులు ఉండవచ్చు. వాటి ఆధారంగానే యూనిట్‌ ధర ఉంటుంది. కేంద్ర విద్యుత్‌ చట్టం ప్రకారమే ధరలను నిర్ణయిస్తారు. మనకు రాని ఆఫర్‌ గురించి అంచనా వేయలేం.

ప్ర: ప్రస్తుతం ఉన్న పీపీఏలపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. టెండరు విధానంలో వచ్చిన ప్రాజెక్టులతోనే పీపీఏలు కుదుర్చుకున్నపుడు వారితో సమస్య రావటానికి కారణమేంటి?
జ:  పీపీఏలను ఉపసంహరించలేదు. రద్దు చేయలేదు. ధరలను నిర్దేశించిన ఫార్ములాలో కొన్ని లోపాలున్నాయనే దానిపై కోర్టులో కేసు వేశాం. టెండరు ప్రకారం కాకుండా ధరలను ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది.

ఇదీ చదవండి

Last Updated :Nov 8, 2021, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.