ETV Bharat / city

Electricity: పీపీఏ వ్యవధిలో రూ.25 వేల కోట్ల భారం

author img

By

Published : Oct 18, 2021, 7:19 AM IST

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవటం వల్ల ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Electricity from Seki
Electricity from Seki

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టులతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవటం వల్ల ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీపీఏ అమలయ్యే 25 ఏళ్లలో రూ.25,245 కోట్లను ప్రభుత్వం అదనంగా వెచ్చించాల్సి వస్తుందంటున్నారు. ‘అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా ఛార్జీలకు (ఐఎస్‌టీఎస్‌) మినహాయింపు ఉందని సెకీ లేఖలో ప్రస్తావించింది. అంటే, ప్రాజెక్టులను వేరేరాష్ట్రాల్లో ఏర్పాటుచేసి మనకు విద్యుత్‌ అందిస్తుంది. కానీ, ఇతర మార్గాల్లో రూ.వేల కోట్లను ప్రభుత్వం నష్టపోతుంది’ అని నిపుణులు చెబుతున్నారు. అదెలాగంటే..

ఇతర రాష్ట్రాల్లో ప్లాంటు ఏర్పాటుతో..

* సెకీ సౌరప్లాంట్లను రాజస్థాన్‌లో ఏర్పాటుచేస్తుంది. దీనివల్ల ప్రాజెక్టు ఏర్పాటుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి మెగావాట్‌కు రూ.42 లక్షల వంతున రాష్ట్ర సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు చెల్లించే మొత్తాన్ని కోల్పోవాలి. అంటే యూనిట్‌కు 30 పైసలు నష్టం.

* ప్రాజెక్టు ఏర్పాటు కోసం వెచ్చించే మొత్తంపై రాష్ట్రవాటా కింద 7% జీఎస్టీ వస్తుంది. ఇలా మెగావాట్‌కు రూ.24 లక్షలు నష్టపోతాం. ఈ మొత్తం యూనిట్‌కు సుమారు 17 పైసలు.

* రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల 3% అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా నష్టాల భారం తగ్గుతుంది. ఈ మొత్తం యూనిట్‌కు 27 పైసల వరకు ఉంటుంది. ఇలా మొత్తం యూనిట్‌కు 74 పైసలు నష్టమని నిపుణులు చెబుతున్నారు.

25 ఏళ్లలో భారీగా నష్టం

* సెకీ ప్రతిపాదన మేరకు యూనిట్‌ రూ.2.49కు అందుతుంది. కడపలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు యూనిట్‌కు రూ.2.72 వంతున చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ రెండింటి మధ్య తేడా 23 పైసలు.

* యూనిట్‌కు 74 పైసల నష్టం లోంచి ఈ 23 పైసలను మినహాయించినా, సెకీ విద్యుత్‌ వల్ల యూనిట్‌కు 51 పైసలు ప్రభుత్వం కోల్పోతుంది.

* రాష్ట్రంలో మెగావాట్‌కు 22 లక్షలయూనిట్ల సౌర విద్యుత్‌ వస్తుందని అంచనా. దీని ప్రకారం మెగావాట్‌కు రూ.11.22 లక్షలను ప్రభుత్వం ఏటా కోల్పోతుంది. ఈ లెక్కన 9వేల మెగావాట్లకు ఏడాదికి రూ.1,009.80 కోట్ల వంతున.. 25 ఏళ్ల పీపీఏ వ్యవధిలో రూ.25,245 కోట్లను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: murders: మహిళపై అత్యాచారయత్నం.. ఆపై హత్య.. ఆ తర్వాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.