ETV Bharat / business

తొలి జీతం అందుకున్నారా? మరి వీటిని పాటిస్తున్నారా.. లేదా?

author img

By

Published : Jun 4, 2022, 12:26 PM IST

చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరగానే ఒక్కసారిగా ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. తొలి జీతం పొందినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడటం నుంచి, స్వేచ్ఛగా మారడం విశ్వాసాన్నిస్తుంది. భవిష్యత్‌ బాధ్యతలను భుజాలపై మోయగలమన్న భావన.. వృద్ధి పథంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో కొన్నిసార్లు కాస్త నిర్లక్ష్యంగానూ వ్యవహరించే ఆస్కారం ఉంది. ఈ అలవాటును మొగ్గలోనే తుంచేయాలి. ఇలా చేసినపుడే మీకు మెరుగైన ఆర్థిక జీవితం అందుతుంది.

precautions to take after we got our first salary
precautions to take after we got our first salary

Things To Do After Got Salary: సంపాదన ప్రారంభం కాగానే.. పొదుపు, పెట్టుబడి మీ మొదటి ప్రాధాన్యంగా మారాలి. చేతికి వచ్చిన మొత్తంలో 20 శాతం మదుపు వైపు మళ్లించాలి. మీరు ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే.. దీర్ఘకాలంలో అంత లాభం అని మర్చిపోవద్దు.

ఈక్విటీలతో ప్రారంభం..
మీ సంపాదన ప్రారంభమైన వెంటనే పెట్టుబడులూ ఆరంభించాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ఇందుకోసం మంచి మార్గం. ఒక్కసారి 'సిప్‌' ప్రారంభించాక.. నెలనెలా నిర్ణీత మొత్తం ఫండ్లలోకి వెళ్తుంది. దీర్ఘకాలంలో మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా సంపదను సృష్టించే ఈ మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. రాబడులకు హామీ లేకపోయినా.. ఈక్విటీ మార్కెట్లు గడిచిన 20 ఏళ్లలో సగటున 12 శాతం వార్షిక రాబడిని అందించడం చూశాం.

సురక్షితంగానూ..
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌) మీ పెట్టుబడుల జాబితాలో స్థానం సంపాదించాలి. బ్యాంకులు లేదా పోస్టాఫీసులో పీపీఎఫ్‌ ఖాతాను ప్రారంభించొచ్చు. ప్రభుత్వ హామీతో ఉండే సురక్షిత పథకమిది. ప్రస్తుతం 7.1శాతం వడ్డీ వస్తోంది. మధ్యలో వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. 15 ఏళ్ల పూర్తి వ్యవధి కొనసాగించేందుకే మొగ్గు చూపాలి. కచ్చితమైన రాబడితో దీర్ఘకాలిక అవసరాలకు ఇది సహాయపడుతుంది. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు కోసమూ ఉపయోగపడుతుంది. ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మదుపు చేసుకోవచ్చు.

ధీమాగా ఉండాలి..
ఊహించని అనారోగ్యాలు.. మన చేతిలో ఉన్న డబ్బును హరిస్తాయి. ఇలాంటి సంక్షోభాల నుంచి రక్షించుకోవాలంటే.. ఆరోగ్య బీమా తీసుకోవాల్సిందే. వైద్యపరమైన విపత్కర పరిస్థితుల్లో ఇది మీకు ఆర్థికంగా అండగా ఉంటుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియం ఆర్థిక ప్రణాళికలో ఒక ముఖ్యమైన పెట్టుబడి. దీంతోపాటు.. చిన్న వయసులోనే జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. టర్మ్‌ పాలసీని ఎంచుకోవడం వల్ల తక్కువ ప్రీమియంతో.. అధిక రక్షణ సొంతం చేసుకోవచ్చు.

డిపాజిట్లలోకి..
వేతనం రాగానే 20 శాతం పెట్టుబడికి కేటాయించాలని ముందే అనుకున్నాం.. తరువాత మిగిలిన మొత్తంలో నుంచి అన్ని ఖర్చులూ పోను ఉన్న మొత్తాన్ని నెలాఖరులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు లేదా లిక్విడ్‌ ఫండ్లకు మళ్లించాలి. అత్యవసర నిధి కోసం కేటాయించిన మొత్తాన్నీ పొదుపు ఖాతాలో ఉంచకూడదు. లిక్విడ్‌ ఫండ్లలో పొదుపు ఖాతా కంటే మెరుగైన రాబడి అందుతుంది. మీ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు.. పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకులు అందించే ఫ్లెక్సీ ఖాతాలనూ ఎంచుకోవచ్చు.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లో..
మీ పెట్టుబడి బడ్జెట్‌లో 5-10 శాతం బంగారానికీ కేటాయించండి. ఇందుకోసం గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. పెట్టుబడి కోసం అనుకున్నప్పుడు బంగారాన్ని నేరుగా కొనడంకంటే.. ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి పసిడికి ఉంది. పెట్టుబడుల వైవిధ్యానికీ ఇది ఉపయోగపడుతుంది.

వివిధ పెట్టుబడి మార్గాలను పరిశీలించి, అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న వాటిని ఎంచుకోవాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కనీసం 30 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టే వీలుంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈక్విటీల్లో ఎంత మదుపు చేయాలనే నిబంధన లేకపోయినా.. పెట్టుబడి మొత్తంలో 60-70 శాతం వీటికి కేటాయించవచ్చు. మిగతా మొత్తాన్ని డెట్‌ ఫండ్లు, బంగారానికి కేటాయించేలా చూసుకోవాలి. అంతిమంగా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలన్న మీ లక్ష్యానికి కట్టుబడి ఉండాలి.

ఇవీ చదవండి: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.