ETV Bharat / bharat

మహారాష్ట్ర టు ఆంధ్రప్రదేశ్​.. అక్కడ కిడ్నాప్​.. ఇక్కడ వెలుగులోకి

author img

By

Published : Mar 9, 2023, 7:20 AM IST

POLICE BUSTED THE KIDNAP GANG: ఆ పిల్లలు మహారాష్ట్రలో కిడ్నాప్‌ అయి.. ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్​ జిల్లా జగ్గయ్యపేటలో ప్రత్యక్షమయ్యారు. ఈ తతంగం వెనక ఉన్న వారిని వెతికే ప్రయత్నంలో.. నాలుగు రాష్ట్రాల్లో చిన్నారులను కిడ్నాప్‌ చేస్తోన్న ముఠా గుట్టును.. పోలీసులు రట్టు చేశారు. పెంచిన వారి నుంచి నలుగురు చిన్నారులను తీసుకొచ్చిన మహారాష్ట్ర పోలీసులు.. వారిని వాళ్ల కన్న తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

POLICE CHASED THE KIDNAP GANG
POLICE CHASED THE KIDNAP GANG

POLICE BUSTED THE KIDNAP GANG : చిన్నారుల కిడ్నాప్ సంచలనం రేపుతోంది. మహారాష్ట్రలో కిడ్నాప్ ముఠాలు.. హైదరాబాద్​, విజయవాడలో మధ్యవర్తులు.. ఎన్టీఆర్ జిల్లాలో చిన్నారుల విక్రయాలు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. మొత్తం నలుగురు చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించినట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. పాఠశాలల వద్ద కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని వారిని గుర్తించి వారికి విక్రయిస్తున్నారని విచారణలో తేలింది.

మూడు నెలల వ్యవధిలో ముగ్గురు పిల్లలు అదృశ్యం: 2022 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా.. కొత్వాలీ పోలీసుస్టేషన్‌లో ఓ అదృశ్యం కేసు నమోదైంది. అహ్మద్‌ యూనస్‌ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు హైదర్‌ తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి(మూడు నెలలు) మధ్య ముగ్గురు పిల్లలు అదృశ్యమైనట్లు అక్కడ కేసులు నమోదయ్యాయి. తర్వాత పోలీసుల ప్రయత్నాలు ఫలించక.. పక్కన పెట్టేశారు.

ఆరా తీస్తే బయటపడిన అసలు విషయం: తల్లిదండ్రుల నుంచి ఇటీవల ఒత్తిళ్లు పెరగడంతో ఎస్పీ ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలు స్థానిక ఉర్దూ పాఠశాల వద్ద తప్పిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. ఉపాధ్యాయులను విచారించారు. పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి సోదరి కాల్స్‌ అనుమానాస్పదంగా ఉండడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా సదరు ఉపాధ్యాయురాలి సోదరి నేరం అంగీకరించింది. ఆమె పలుసార్లు హైదరాబాద్‌ వెళ్లినట్లు రూఢీ అయింది. హైదరాబాద్​లో తనకు సంగీత అనే మరో మహిళతో పరిచయం ఉన్నట్లు స్పష్టం చేసింది. గుజరాత్‌కు చెందిన సంగీత తరచూ పర్భణీ-హైదరాబాద్‌ మధ్య తిరిగేది. ఆర్థిక స్తోమత లేకపోయినా ఈమె ఎందుకు హైదరాబాద్​ వెళ్తోందని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.

డీల్​ కుదిర్చి కమిషన్​: హైదరాబాద్‌లోని సంతాన సాఫల్య కేంద్రాల్లో పని చేస్తున్న విజయవాడకు చెందిన శ్రావణితో సంగీతకు పరిచయమైంది. శ్రావణి అండం దానం చేసే మహిళలను గుర్తించి, అవసరం ఉన్నవారితో మాట్లాడి డీల్‌ కుదిర్చి కమీషన్‌ తీసుకుంటుంది. నలుగురు చిన్నారులు ఉన్నారని, పెంచుకునేవారు ఉంటే మాట్లాడాలని శ్రావణికి.. సంగీత చెప్పింది. దీనికి అంగీకరించిన ఆమె.. పిల్లలను విక్రయించేందుకు అంగీకరించింది. తనకు పరిచయం ఉన్న ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన శిల్ప అనే మహిళ ద్వారా.... జగ్గయ్యపేటలో బాలుడిని విక్రయించినట్లు.... విచారణలో పోలీసులకు శ్రావణి వెల్లడించారు.

శ్రావణి, సంగీతలను విచారించిన మహారాష్ట్ర పోలీసులు.. వారిని తీసుకుని ఈ నెల 5న జగ్గయ్యపేటకు వచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న పోలీసుల సాయంతో హైదర్‌ అనే బాలుడి ఆచూకీని గుర్తించారు. శ్రావణి ఆ బాలుడిని శిల్పకు 2 లక్షలకు విక్రయించగా... తిరిగి శిల్ప 3 లక్షలకు వత్సవాయి మండలం నాగుల్‌మీరా, షహీనా బేగం దంపతులకు అమ్మింది. వీరు బాలుడిని జగ్గయ్యపేటలోని పాఠశాలలో చదివిస్తున్నారు. ఆదివారం నాడు మహారాష్ట్ర పోలీసులు ఆ పాఠశాలకు వెళ్లి బాలుడిని గుర్తించి తమతో తీసుకెళ్లారు.

విచారణలో వెల్లడైన పలు విషయాలు: మహారాష్ట్ర పోలీసులు గట్టిగా విచారించగా.. శ్రావణి, శిల్ప పలు విషయాలు చెప్పారు. దాంతో అక్కడి పోలీసులు బుధవారం మళ్లీ జగ్గయ్యపేట వచ్చారు. మరో ముగ్గురినీ జగ్గయ్యపేట ప్రాంతంలో విక్రయించినట్లు నిందితులు వెల్లడించారు. ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పోలీసుల సాయంతో మిగిలినవారిని గుర్తించారు. వత్సవాయి మండలం దేచుపాలెంలో సయ్యద్‌ మైబు, నాగుల్‌మీరా దంపతుల వద్ద ఉన్న ఆరేళ్ల సుభాని, జగ్గయ్యపేటకు చెందిన జయలక్ష్మి, సత్యనారాయణ దంపతుల వద్ద ఉన్న నాలుగేళ్ల చరణ్‌, విసన్నపేటలో సయ్యద్‌ సలేహ వద్ద ఉన్న ఏడేళ్ల ఆరీష్‌లను గుర్తించి బుధవారం రాత్రికి తీసుకొచ్చారు.

నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన కిడ్నాప్​ ముఠా: పోలీసుల విచారణలో ఈ రాకెట్‌ మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తరించినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాకు చెందిన సంగీత.. అదే రాష్ట్రానికి చెందిన నూర్జహాన్‌, సుల్తాన్‌, సమీర్‌లతో చేతులు కలిపి అక్కడి పిల్లల్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడాన్ని వృత్తిగా మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు విజయవాడకు చెందిన శ్రావణి పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేటలో నివాసం ఉంటూ, విజయవాడలో నర్సుగా పని చేసే శిల్పతో చేతులు కలిపి పిల్లలను విక్రయించారు. పిల్లల్ని 1.5 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మహారాష్ట్ర టు ఆంధ్రప్రదేశ్​.. అక్కడ కిడ్నాప్​.. ఇక్కడ వెలుగులోకి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.