ETV Bharat / bharat

అందని ప్రభుత్వ సాయం.. గుర్రపు డెక్కే ఆహారం!

author img

By

Published : May 2, 2020, 6:10 AM IST

Updated : May 2, 2020, 1:28 PM IST

లాక్​డౌన్​తో పేదల సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఉపాధి కరవై ఆకలితో అలమటిస్తున్నారు. అసోంలోని ఓ వృద్ధజంటకూ ఈ కష్టాలు తప్పడంలేదు. కొద్దిరోజులుగా తిండి లేక గుర్రపుడెక్క ఆకులను తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తోన్న సాయాలకు నోచుకోలేని ఈ పండుటాకుల జీవనం చూస్తే.. కంటతడి పెట్టాల్సిందే.!

Lock Down blues
అందని ప్రభుత్వ సాయం.. గుర్రపు డెక్కే ఆహారం!

అందని ప్రభుత్వ సాయం.. గుర్రపు డెక్కే ఆహారం!

లాక్​డౌన్​ కారణంగా పేద ప్రజలు దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఉపాధిలేక ఆకలితో అలమటిస్తున్నారు. అసోంలోని ఓ వృద్ధజంట పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాగావ్​ జిల్లా ఉద్మారీ ప్రాంత వాసులైన భైరబ్​(85), రూపతి (73) దంపతులు.. ఇన్నాళ్లూ ఎలాగోలా కాలం వెళ్లదీసినా కొద్దిరోజులుగా ఆహారం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తోన్న సాయాలేవి అందకపోగా... గుర్రపు డెక్క ఆకుల్నే ఆహారంగా తీసుకుంటూ బతుకు బండి లాగిస్తున్నారు.

''లాక్​డౌన్​ కారణంగా అన్నీ మూతపడ్డాయి. ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. ఉపాధిలేక చేతుల్లో డబ్బులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన కొద్దిపాటి బియ్యం అయిపోయాయి. ఇంట్లో కనీసం ఉప్పు, నూనె వంటివి కూడా లేవు. ఆకలికి తట్టుకోలేక 'మెటక(అస్సామీలో గుర్రపుడెక్క ఆకులు)'తో జీవనం సాగిస్తున్నాం. అవి ఆరోగ్యానికి అంతమంచివి కావు. కానీ, తప్పడం లేదు.''

-రూపతి

మరికొందరి పరిస్థితీ అంతే..

వీరికి నాగేశ్వర్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. డ్రైవర్​గా పనిచేస్తోన్న అతను​.. నాగాలాండ్​లో ఒంటరిగానే ఉండిపోయాడు. ఇన్నాళ్లూ ఇరుగుపొరుగు వారు ఈ వృద్ధులకు సాయమందించినప్పటికీ... లాక్​డౌన్​ పొడిగించినందున ఎవరి కష్టాలు వారివే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వీరు మాత్రమే కాదు.. ఇలా ఆకలితో అలమటించే కుటుంబాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చిన మరో స్థానికుడు.. ప్రభుత్వం అందించే బియ్యం సరిపోక ఇలా ఆకులతో జీవనం సాగిస్తున్నట్లు వాపోతున్నాడు.

రాష్ట్రంలో దారిద్ర్య రేఖ(బీపీఎల్)కు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం అందిస్తోంది. మార్కెట్లో ఏవీ అందుబాటులో లేనందున ఇవి తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'లాక్​డౌన్​ పొడిగిస్తే ఆకలి చావులు కరోనాను మించుతాయి'

Last Updated :May 2, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.