ETV Bharat / state

భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు​ సర్కారు కసరత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 5:07 PM IST

Bhumatha Portal For Solving Land Problems
Bhumatha Portal

Bhumatha Portal For Solving Land Problems : దీర్ఘకాలంగా వేధిస్తున్న భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేకదృష్టి సారించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. భూసమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా సర్కారు అడుగులేస్తున్నామని ప్రకటించింది. లోపభూయిష్టమైన ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రేవంత్‌ సర్కారు కసరత్తులు చేస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టి భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అందుకు ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక సమీక్షలూ నిర్వహిస్తోంది. అవసరమైతే ఆర్​ఓఆర్​-2020 చట్ట సవరణలు లేదా కొత్తచట్టం రూపొందించడంపై సర్కారు మొగ్గు చూపుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను సీఎం ఆదేశించారు. ధరణి పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు కలెక్టర్ల చేతుల్లో ఉన్న అధికారాలను తహసీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూమాత కోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది? భూయజమానులకు కలిగే ప్రయోజనాలేంటీ? భూమాతపై వ్యవసాయ నిపుణులు, మేధావులు, ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

దీర్ఘ కాలంగా వేధిస్తున్న భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్​ ప్రత్యేక దృష్టి - భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు​ సర్కారు కసరత్తు

Bhumatha Portal For Solving Land Problems : ధరణి! వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు హక్కులు కల్పించేలా గత ప్రభుత్వం ఈ పోర్టల్‌ తీసుకొచ్చింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలు సహా పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించాలనేది ఈ పోర్టల్‌ ఉద్దేశం. కానీ, నిర్వహణలో అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. మాడ్యుళ్లపై అవగాహన లేమి, ఆపరేటర్ల తప్పిదాలు, పర్యవేక్షణ కొరవడడం తదితర కారణాలతో ఎంతోమంది భూయజమానులు అవస్థలు పడ్డారు. కనీసం ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌పార్టీ ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకొచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులేస్తున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కారు ముందుగా భూసమస్యల అధ్యయనానికి ధరణి పేరిట కమిటీ వేసింది. ఈ కమిటీ వివిధశాఖల అధికారులతో అనేక సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ధరణి కమిటీ గుర్తించింది.

భూ సమస్యల సత్వర పరిష్కారంపై సర్కార్‌ నజర్‌ - ఆ బాధ్యత తహసీల్దార్‌కేనా!

Congress Bhumatha Portal : ధరణి కమిటీ అధ్యయనంలో 2020లో అమల్లోకి వచ్చిన ఆర్​ఓఆర్​ చట్టంలోనే లోపాలున్నాయని వెల్లడైంది. 3 నెలల్లో హడావుడిగా చేపట్టిన భూసమగ్ర సర్వేతోనే అనేక చిక్కులొచ్చాయని ధరణి కమిటీ నివేదించింది. ఆ రికార్డుల్ని గత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడం వల్లే భూ సమస్యలు, వివాదాలు ఎక్కువయ్యాయని కమిటీ తెలిపింది. ఇలా ధరణి పోర్టల్లో 2.40 లక్షల కేసులు నమోదయ్యాయి. కమిటీ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మొదటి విడతగా కేసులు పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

అవసరమైతే ఆర్​ఓఆర్(R.O.R)​ చట్ట సవరణ లేదా కొత్తచట్టం తీసుకొచ్చే అంశం పరిశీలిస్తామన్నారు. దాంతోపాటు ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు ఆధీనంలో నడుస్తున్న పోర్టల్​తో లక్షలాది రైతుల భూముల రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయన్నారు. గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా, ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ వద్ద ఉంచడాన్ని తప్పుబట్టారు. ఇలా చేయడం వల్ల భూముల రికార్డుల డేటాకు భద్రత ఉంటుందా.? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందంటూ ఆరా తీశారు. భూముల రికార్డుల డేటా ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా అని అధికారులను ప్రశ్నించారు.

Dharani Portal : భూమాత ప్రారంభానికి ముందు దేవాదాయ, వక్స్‌ భూములపై స్పష్టత రావాల్సి ఉందని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. ఆ శాఖల్లో ట్రిబ్యునళ్లు లేకుండా జారీ చేసిన ఎన్​ఓసీలపై కూడా విచారణ జరిపించాలని అనుకుంటుంది. అలాగే ఆస్తుల పరిరక్షణకు జియో ట్యాగింగ్‌ చేయాలని కమిటీ భావిస్తుంది. ప్రధానంగా గెజిట్ నోటిఫికేషన్‌తో సూచించిన అటవీ భూములను ధరణి పోర్టల్‌ లో అప్‌లోడ్‌ చేశారు. కానీ, డీమ్డ్ ఫారెస్టు పేరిట అటవీశాఖ గుర్తించిన భూములపై పేచీ ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయకుండానే డీమ్డ్ ఫారెస్టు పేరిట లెక్కలు నమోదు చేశారు.

చాలాచోట్ల ప్రభుత్వ, పట్టాభూములు, అటవీ భూముల సరిహద్దు వివాదాలు, విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. వీటికి ఉమ్మడి సర్వే చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనేక సూచనలు ధరణి కమిటీ సిఫారసు చేయనున్నట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎక్కడెక్కడ భూములు, ఎవరి స్వాధీనంలో ఉన్నాయి.? హక్కులు వంటి అంశాలపై స్పష్టత ఇచ్చినట్లేతే భూ యజమానులకు భరోసా ఇచ్చినట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నేడు కీలక సమావేశం - ఆ కమిటీతో సీఎం రేవంత్‌ భేటీ

భూమాత పోర్టల్‌ : భూమాత పోర్టల్‌ అమలు చేస్తే అధికార వికేంద్రీకరణ చేయాలనే అంశాన్ని ధరణి కమిటీ పరిశీలిస్తోంది. ఆర్​ఓఆర్​ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదలాయించనుంది. దీనికోసం జీవో జారీ చేయాలా లేదా సర్క్యులర్‌ ద్వారా చర్యలు చేపట్టాలా అన్న అంశంపై నిపుణులు సమాలోచన చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్‌ సమస్యలతో ప్రారంభించి ఫలితాలు బట్టి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. తహసీల్దారు, ఆర్డీవోలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగమూ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

భూమాత పోర్టల్‌తో భూ సమస్యలు పరిష్కారం : ధరణి స్థానంతో తీసుకొచ్చే భూమాత పోర్టల్‌ ఇప్పుడున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కమిటీ సభ్యులకు సూచించారు. విస్తృత సంప్రదింపులు, సమగ్ర అధ్యయనం నేపథ్యంలో ధరణి కమిటీ సభ్యుల బృందం తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ది తెలంగాణ రైట్స్ ఇన్‌ ల్యాండ్ అండ్ పట్టదారుల పాస్‌ బుక్స్ యాక్ట్-2020లో ధరణి పోర్టల్ ప్రస్తావన ఉండటం వల్ల ఉన్నపళంగా భూ మాతగా తీసుకొచ్చే ఆస్కారం లేదని నిపుణులు అంటున్నారు.

దీనికిగాను ధరణి కమిటీ అనేక కసరత్తులు, వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు చేస్తుంది. ఏదేమైనా రైతుల భూసమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే చర్యలను వ్యవసాయ నిపుణులు, మెధావులు, రైతులు స్వాగతిస్తున్నారు.

ధరణి పోర్టల్ ఐచ్ఛికాల్లో కీలక మార్పులు - భూ సమస్యలన్నింటికీ ఒకే అర్జీ ఉండాలన్న కమిటీ

'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.