ETV Bharat / politics

రేపే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - ఆశావహుల్లో ఉత్కంఠ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 7:20 AM IST

Telangana Congress MP Candidates 2024 : రాష్ట్రంలో పోటీ చేయనున్న కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల్లో కొందరిని ఆ పార్టీ అధిష్ఠానం రేపు ప్రకటించే అవకాశం ఉంది. దిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.

Congress Screening Committee Meeting
Telangana Congress MP Candidates 2024

రేపే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - ఆశావహుల్లో ఉత్కంఠ

Telangana Congress MP Candidates 2024 : తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై రేపు దిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన అభ్యర్థులు జాబితాతో దీపాదాస్ మున్షీ ఇప్పటికే దిల్లీలో మకాం వేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో పార్లమెంటు అభ్యర్థులుగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకు ఆయా నియోజకవర్గాలను వారికే ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది.

Congress MP Candidates List in Telangana : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల్లోనూ వీలైనన్నీ ఎక్కువ సీట్లు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇందిర పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం.

12 లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్​ చేసిన కాంగ్రెస్! - ఇక తేలాల్సింది ఆ 5 సీట్లే

మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఖమ్మం సీటును మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ ఆశిస్తున్నారు. జిల్లాలో కమ్మ సామాజికవర్గానికి ఓట్లు ఎక్కువ ఉన్నందున రాజేంద్ర ప్రసాద్ అనే నేత పేరునూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddyకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ లేదంటే ఓ మాజీ ఎంపీని బరిలోకి దించవచ్చని సమాచారం. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Congress Screening Committee Meeting : మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ ఇవ్వాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ టికెట్‌ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్‌కే దక్కే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఉజ్వల రెడ్డి సిద్ధా రెడ్డీ టికెట్ ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదంటే ఆయన భార్య శ్రీదేవికి గానీ టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తుండగా గౌడ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్‌రెడ్డికే టికెట్ వచ్చే అవకాశం ఉంది.

మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి (Mahabubnagar Vamshichand Reddy), నల్గొండ నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పటేల్ రమేశ్‌రెడ్డిని కానీ జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది. భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి పేరుతో పాటు కోమటిరెడ్డి సోదరుడు మోహన్‌రెడ్డి కుమారుడు సూర్యపవన్‌ రెడ్డి పేరునూ పరిశీలిస్తున్నారు. అదే విధంగా మల్కాజిగిరి నుంచి బీసీ నాయకుడిని బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండడంతో వేచిచూసే ధోరణితో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మస్కతి డెయిరీ యజమానికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని దాదాపు అన్ని స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, సిద్ధం చేసిన జాబితాపై కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి, వివాదం లేని సీట్లకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రేపటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత కనీసం 14 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు చేస్తున్న రాష్ట్ర నాయకత్వం వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రతిపాదించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టో రెడీ!- వారికే అత్యంత ప్రాధాన్యం

గెలుపు దిశగా కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు - 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.