ETV Bharat / opinion

విరుధ్​నగర్​లో సినీ 'సైరన్​'- సిట్టింగ్​ MPపై రాధిక, విజయ్​కాంత్​ తనయుడి పోటీ- తమిళనాట ఉత్కంఠ పోరు! - VIRUDHNAGAR LS ELECTIONS 2024 TN

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 2:06 PM IST

Virudhnagar LS Elections 2024 Tamil Nadu : సీనియర్‌ నటి రాధిక. తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియనివారు ఉండరు. తెలుగు సహా పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణించాలనే లక్ష్యంతో బీజేపీ తరఫున తమిళనాడులోని విరుధ్‌నగర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్‌ కూడా తెలుగు ప్రజలకు సుపరిచితమే. డీఎండీకే పార్టీ పెట్టి, తమిళ రాజకీయాల్లో మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన మరణానంతరం కుమారుడు విజయ ప్రభాకరన్‌ తండ్రి రాజకీయ వారసత్వాన్ని భుజానికెత్తుకొని విరుధ్​నగర్​ బరిలో నిలిచారు. కాంగ్రెస్​ సీనియర్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ కూడా ఇదేస్థానం నుంచి పోటీకి దిగిన వేళ విరుధ్‌నగర్‌లో ముక్కోణపు పోరు రసవత్తరంగా మారింది.

TN Virudhnagar LS Elections 2024 Political Analysis
TN Virudhnagar LS Elections 2024 Political Analysis

Virudhnagar LS Elections 2024 Tamil Nadu : తమిళనాడులోని విరుధ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు ఆసక్తి రేతెత్తిస్తున్నాయి. దేశంలో టపాసుల తయారీకి కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయంగానూ మోత మోగించేందుకు వేదికైంది. ప్రముఖ సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ ఈ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా, ఏఐఏడీఎంకే, డీఎండీకే ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్‌ నటుడు, డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్ రంగంలోకి దిగారు. అధికార డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి తరఫున సిట్టింగ్​ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ మరోసారి పోటీ పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన ఠాగూర్‌ 2014లో ఓడినప్పటికీ, 2019లో తిరిగి గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూసినా మొత్తం ఆరు స్థానాలకు నాలుగుచోట్ల డీఎంకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.

రాధిక ప్రస్థానం
చాలాకాలంగా రాజకీయ పోరాటానికి మాత్రమే వేదికగా నిలుస్తున్న విరుధ్‌నగర్‌ రాధిక రాకతో సినీ గ్లామర్‌ అద్దుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన రాధిక దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ను వివాహం చేసుకున్న ఆమె రడాన్ మిడియా వర్క్స్ ను ప్రారంభించి నిర్మాత అవతారం ఎత్తారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతోపాటు బుల్లితెరపై పలు సిరియళ్లు కూడా నిర్మించారు.

రాజకీయంగానూ తమిళనాట డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల్లో పనిచేశారు. ఆమె భర్త శరత్‌కుమార్‌ కూడా దక్షిణాదిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో రాజకీయ రంగప్రవేశం చేసి ఆల్‌ ఇండియా సమత్వ మక్కల్‌ కచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. తాజాగా తన భార్య రాధికను విరుధ్‌నగర్‌ బరిలో బీజేపీ తరఫున పోటీకి నిలిపారు. ఇరువురూ కలిసి నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

'ఆయన నాకు కొడుకుతో సమానం'
విరుధ్‌నగర్‌లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల రాధిక ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విరుధ్‌నగర్‌ నుంచి తన భార్యను ఎంపీని చేయడమే తన లక్ష్యమని చెప్పిన శరత్‌కుమార్‌ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని ప్రచారంలో చెబుతున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా తన భర్త శరత్‌కుమార్‌ సాయంతో పరిష్కరిస్తానని రాధిక ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

గతంలో విజయకాంత్‌ సరసన అనేక సినిమాల్లో నటించిన రాధిక తాజాగా ఆయన కుమారుడు ప్రభాకరన్‌ తనపై పోటీ చేస్తుండడంపై స్పందించారు. ప్రభాకరన్ తనకు కుమారుడితో సమానమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ విజన్, గత పదేళ్లుగా దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని రాధిక జాతీయ మీడియా ముఖాముఖీలో చెప్పారు. 'గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కసారి గమనిస్తే ఎన్నో మంచి పనులు చేశారు. ఉత్తమ పాలనను అందించారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వరుసగా మూడోసారి విజయం అనేది దేశానికి ఎంతో మంచిది. ప్రజల విషయానికి వస్తే అంతిమంగా వారి తీర్పు కోసం ఎదురుచూడాలి' అని రాధిక అన్నారు.

రాధిక 'అమ్మ'కు కృతజ్ఞతలు : ప్రభాకరన్​
మరోవైపు విజయకాంత్‌ మరణం తర్వాత ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ బాధ్యతలు తీసుకున్న ప్రభాకరన్​ తాజాగా ఏఐఏడీఎంకేతో పొత్తుపొట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆయన కూడా సినిమా డైలాగులతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. రాధిక తనను కుమారుడిగా సంభోదించడంపై స్పందించిన ఆయన రాధిక అమ్మతోపాటు నియోజకవర్గంలో ఉన్న మహిళలంతా తనను వారి బిడ్డ మాదిరిగానే చూస్తారని పేర్కొన్నారు. రాధిక తనను కుమారుడిగా భావిస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పిన ప్రభాకరన్​ తమ రెండు కుటుంబాలకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఇదే సమయంలో తన తండ్రి విజయకాంత్‌ తనకు అప్పగించిన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

'ఈ ఎన్నికల్లో పోటీని నా జీవితంలో ఒక సవాలుగా తీసుకున్నాను. ఈ బాధ్యతను నా తండ్రి నాకు వదిలి వెళ్లారు. ఈ ఎన్నికలు మాకు సవాలుతో కూడుకున్నవి. మా పార్టీ భవిష్యత్తు, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ ఎన్నికలను సవాలుగా స్వీకరించాను. ఏఐఏడీఎంకే రూపంలో మాకు బలమైన మిత్రపక్షం కూడా ఉంది. రెండు పార్టీలూ కలవడం వల్ల విజయావకాశాలు మాకే ఎక్కువగా ఉన్నాయని నమ్ముతున్నాను' అని విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకరన్ అన్నారు.

ఆ ఒక్క విషయం రాధిక, ప్రభాకరన్​కు ప్రతికూలంగా మారుతుందా?
అయితే రాధిక, ప్రభాకరన్ స్థానికులు కాకపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఇద్దరూ చెన్నై నుంచి వచ్చారని కాంగ్రెస్, డీఎంకే స్థానిక నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని ఇద్దరూ ప్రచారంలో స్పష్టం చేస్తున్నారు. అటు విరుధ్‌నగర్‌లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన మాణిక్కం ఠాగూర్‌ స్థానికుడు కావడం సహా పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకు ఎక్కువగా ఉండడం కలిసి వస్తోంది. మిత్రపక్షం డీఎంకే సంస్థాగతంగా బలీయంగా ఉండడం కూడా ఆయనకు అనుకూల వాతావరణం కల్పించింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం కామరాజ్‌ కూడా విరుధ్‌నగర్‌కు చెందిన నాయకుడు కావడం కూడా కలిసొచ్చింది.

అలాగే కుల సమీకరణ పరంగానూ మాణిక్కం ఠాగూర్​ వర్గం ముక్కులాథోర్లు ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. తన ప్రత్యర్థులు స్థానికేతరులు అనే వాదనను తోసిపుచ్చిన ఠాగూర్​ రాజకీయాల్లో ఇద్దరూ ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నారని, నియోజకవర్గ స్వరూపం తెలుసుకునేలోపే వారికి పుణ్యకాలం పూర్తవుతుందని ఎద్దేవా చేశారు. మరి విరుధ్‌నగర్‌ ప్రజలు స్థానికుడికే మరోసారి పట్టం కడతారా లేక అభిమాన నటుల్లో ఎవరివైపు మొగ్గుతారో తెలియాలంటే జూన్‌ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పీలీభీత్‌పైనే అందరి ఫోకస్- గాంధీల్లేకుండా 30ఏళ్లలో తొలిసారి పోరు- జితిన్ ప్రసాద గెలుస్తారా? - Pilibhit Lok Sabha Gandhi Family

హ్యాట్రిక్​ క్లీన్​స్వీప్​పై బీజేపీ ధీమా- అడ్డుకునేందుకు కాంగ్రెస్​ పైఎత్తులు- 'దేవభూమి'లో పైచేయి ఎవరిది? - Lok Sabha Elections Uttarakhand

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.