ETV Bharat / opinion

రసవత్తరంగా మహా 'కుటుంబ' పోరు- బారామతిపైనే అందరి ఫోకస్​- రెండు వర్గాలకూ కీలకమే! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 7:02 AM IST

Maharashtra Loksabha Polls 2024
Maharashtra Loksabha Polls 2024

Maharashtra Loksabha Polls 2024 : మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. అత్యధిక స్థానాలను గెలుచుకుని మరాఠీలు తమ వైపే ఉన్నారని చాటిచెప్పేందుకు అధికార- ప్రతిపక్షాలు అస్తశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. శివసేన పార్టీలో చీలిన రెండు వర్గాలకు మూడో దశ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఎన్నికల బరిలో వదినా-మరదళ్లు దిగడం వల్ల ఎన్​సీపీకి కూడా మూడో దశ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కుటుంబ పోరుతో మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది.

Maharashtra Loksabha Polls 2024 : మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా తొలి రెండు దశల్లో 13 స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. మూడో దశలో 11 స్థానాలకు మే ఏడున పోలింగ్ జరగనుంది. ఈ పదకొండు స్థానాల్లో గెలుపును అధికార-ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల మూడో దశ ఎన్నికలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఈ విడతలో వదినా మరదళ్లు బరిలో నిలిచిన బారామతి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు పోటీ చేస్తున్న సతారా, కొల్హాపుర్‌లతోపాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్‌ జరగనుంది.

ఎన్​డీఏ వర్సెస్ ఇండి కూటమి
హాట్కణంగ్లే, సతారా, కొల్హాపుర్‌, బారామతి సాంగ్లీ, సోలాపుర్‌, మాధా స్థానాలు పశ్చిమ మహారాష్ట్రలో ఉండగా లాతూర్‌, ఉస్మానాబాద్‌ మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్నాయి. రాయ్‌గడ్‌, రత్నగిరి-సింధుదుర్గ్‌ నియోజకవర్గాలు కొంకణ్‌ ప్రాంతంలో ఉన్నాయి. మెజార్టీ సీట్లలో పోరు ప్రధానంగా అధికార ఎన్​డీఏ ప్రతిపక్ష ఇండి కూటమి మధ్యే హోరాహోరీగా ఉంది. ఈ 11 స్థానాల్లో మొత్తం 258 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

బారామతిపైనే అందరి ఫోకస్​
మూడో విడతలో పోలింగ్‌ జరగనున్న బారామతి, కొల్హాపుర్‌, రత్నగిరి, సింధుదుర్గ్‌ స్థానాల్లో ఎన్​డీఏ-ఇండి కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ విడతలో అందరి దృష్టీ ప్రధానంగా బారామతిపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే ఎన్సీపీ శరద్‌ పవార్‌ పార్టీ తరఫున బరిలో నిలిచారు. పవార్‌ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ ఎన్సీపీ తరఫున ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు.

కుమార్తె కోసం శరద్​ పోరాటం!
పవార్‌ కుటుంబానికి కంచుకోట అయిన బారామతిలో సూలే 2009 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు వరుసగా ఆరుసార్లు శరద్‌ పవార్‌ విజయం సాధించారు. ఇప్పుడు బారామతిలో సూలే ఓడితే శరద్‌ పవార్‌ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్‌ పవార్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఉస్మానాబాద్‌లోనూ కుటుంబ పోరే!
మహారాష్ట్రలో కీలకమైన ఉస్మానాబాద్‌లోనూ కుటుంబ పోరే కనిపిస్తోంది. బీజేపీ తరఫున ఎమ్మెల్యే రాణా జగ్జీత్‌సిన్హ్‌ పాటిల్‌ సతీమణి అర్చనా పాటిల్‌ పోటీ చేస్తుండగా జగ్జీత్‌సిన్హ్‌ సమీప బంధువైన సిట్టింగ్‌ ఎంపీ ఓంప్రకాశ్‌ రాజె నింబాల్కర్‌కు శివసేన యూబీటీ టికెట్‌ ఇచ్చింది. కొల్హాపూర్‌ నుంచి ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్‌ శాహూ ఛత్రపతి మహరాజ్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన సంజయ్‌ మండ్లిక్‌కు టికెట్‌ ఇచ్చింది. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఈ స్థానంలో శ్రీమంత్‌ శాహూకు మద్దతు ప్రకటించాయి.

సాంగ్లీలో త్రిముఖ పోరు
సాంగ్లీ స్థానంలో త్రిముఖ పోటీ ఆసక్తి రేపుతోంది. ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనయూబీటీ తరఫున రెజ్లర్‌ చంద్రహార్‌ పాటిల్‌, బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ సంజయ్‌కాకా పాటిల్‌... పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విశాల్‌ పాటిల్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. 1976-85 మధ్య మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్‌దాదా పాటిల్‌ మనవడు విశాల్‌ ఇక్కడినుంచి పోటీ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది.

శిందే కుమార్తె గెలుస్తుందా?
మరో కీలకమైన స్థానమైన సోలాపుర్‌ నుంచి ఎమ్మెల్యేలు బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్థానం నుుంచి బీజేపీ అభ్యర్థిగా రామ్‌ సాత్పుతేకు బరిలో దిగగా కాంగ్రెస్‌ నుంచి ప్రణీతి శిందే పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే కావడం విశేషం. మాజీ సీఎం, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్‌ శిందే కుమార్తె ప్రణీతి ఈ ఎన్నికల్లో విజయం సాధించి లోక్‌సభలో కాలు మోపాలని పట్టుదలతో ఉన్నారు.

సతారాలో ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్‌ ఛత్రపతి ఉదయన్‌రాజె భోసలే బీజేపీ తరఫున బరిలో నిలిచారు. భోసలే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ స్థానం నుంచి ఎన్సీపీ శరద్‌ పవార్‌ పార్టీ తరఫున మాజీమంత్రి శశికాంత్‌ శిందే పోటీ చేస్తున్నారు. రత్నగిరి-సింధుదుర్గ్‌లోనూ పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బీజేపీ తరఫున కేంద్రమంత్రి, మాజీ సీఎం నారాయణ్‌ రాణె బరిలో ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన వినాయక్‌ రౌత్‌ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడం వల్ల మూడో విడత పోలింగ్‌ మహారాష్ట్రలో ఆసక్తి రేపుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'జై జవాన్ జై కిసాన్‌' టు 'అబ్‌కీ బార్‌ చార్‌సౌ పార్‌'- సార్వత్రిక ఎన్నికల్లో టాప్​-10 స్లోగన్స్ ఇవే! - Lok Sabha Elections 2024.

బలంగా 'తొలి' అడుగు- రాష్ట్రమంతా బ్రాండ్‌ మోదీ- గుజరాత్​ క్లీన్ స్వీప్​పై బీజేపీ కన్ను! - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.