ETV Bharat / opinion

'జై జవాన్ జై కిసాన్‌' టు 'అబ్‌కీ బార్‌ చార్‌సౌ పార్‌'- సార్వత్రిక ఎన్నికల్లో టాప్​-10 స్లోగన్స్ ఇవే! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 7:46 AM IST

Slogans In Elections
Slogans In Elections

Slogans In Elections : లోక్‌సభ , అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నినాదాలు ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్నాయి. 1965లో "జై జవాన్ జై కిసాన్‌" నినాదం మొదలుకొని 2024లో "అబ్‌కీ బార్‌ చార్‌సౌ పార్‌" వరకు అన్ని రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన పదబంధాలు, వన్‌లైన్‌లను వినియోగించాయి. కొన్ని స్లోగన్స్‌ ప్రజల్లోకి చొచ్చుకెళ్లి పలు పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టాయి. మరికొన్ని నినాదాలు కేవలం పదబంధాలుగానే మిగిలిపోయాయి. గత ఆరు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో అగ్ర రాజకీయ నేతలు వాడిన 10 కీలక నినాదాలను ఇప్పుడు చూద్దాం.

Slogans In Elections : ఎన్నికలేవైనా సరే ఓటర్లకు చేరువ కావాలంటే జనంలోకి వేగంగా వెళ్లాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి. అయితే, సుదీర్ఘ ప్రసంగాల కంటే సింగిల్‌ లైన్‌లో చెప్పే స్లోగన్స్‌ ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భావిస్తోంది. స్వతహాగా బీజేపీనే 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కూటమిగా 400 సీట్లు సాధిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ లక్ష్యాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లేలా "అబ్‌కీ బార్ చార్‌సౌ పార్‌" నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

2019లో అలా!
2019 ఎన్నికల్లోనూ బీజేపీ "ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌" స్లోగన్‌తో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించింది. పదేళ్ల కాంగ్రెస్‌ను గద్దె దించి 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో అప్పటి యూపీఏ పాలనలో లోపాలు, కుంభకోణాలను ఎత్తిచూపుతూ "అచ్చే దిన్‌ ఆనే వాలా హై" మంచి రోజులు వస్తున్నాయి అనే అర్థంతో బీజేపీ నినదించింది. ఈ స్లోగన్ ప్రజల్లోకి బాగా వెళ్లి బీజేపీకు పట్టం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించింది.

బాగానే నాటుకుపోయినప్పటికీ!
"కాంగ్రెస్‌ కా హాత్‌-ఆమ్‌ ఆద్మీ కే సాత్‌ " 2004లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కల్పించిన నినాదం ఇది. వారి పార్టీ గుర్తయిన హస్తాన్ని ప్రత్యేకంగా తీసుకుని.. "కాంగ్రెస్‌ చేయి సామాన్యుడితోనే " అనే అర్థంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది విపరీతంగా ప్రజాదరణ పొందడం వల్ల ఆ ఎన్నికల్లో మన్మోహన్‌ సింగ్ నేతృత్వంలో యూపీఏ కూటమి విజయం సాధించగలిగింది. దివంగత ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2004 ఎన్నికల్లో "ఇండియా షైనింగ్ "- భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక ఆశావాదానికి సంకేతంగా దీన్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ నినాదం జనం నోళ్లల్లో బాగానే నాటుకుపోయినప్పటికీ ఎన్డీయేకు మాత్రం విజయం అందించలేకపోయింది.

ఇప్పుడు అటల్‌ బిహారీ వంతు!
1996 సార్వత్రిక ఎన్నికల్లో "బారీ బారీ సబ్‌కీ బారీ- అబ్‌కీ బారీ అటల్‌ బిహారీ" నినాదంతో భారతీయ జనతా పార్టీ పోలింగ్‌కు వెళ్లింది. "అందరి వంతు అయిపోయింది- ఇప్పుడు అటల్‌ బిహారీ వంతు" అనేది ఈ స్లోగన్ అర్థం. లఖ్‌నవూలోని ఓ ఎన్నికల ప్రచారంలో వాజ్‌పేయీ ఈ నినాదమిచ్చారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రచారమైంది. అవినీతి మచ్చలేని ఆయన ప్రధాని అభ్యర్థిగా నిలబడిన ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది.

77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో!
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో "జబ్‌ తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేగా- ఇందిరా తేరా నామ్‌ రహేగా " అనే నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లింది. "సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఇందిరాగాంధీ పేరు గుర్తుండిపోతుంది" అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ స్లోగన్‌తో ఆమె కుమారుడు,మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రజల్లోకి వెళ్లారు. ఇది బాగా పనిచేసి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 404 స్థానాలను దక్కించుకుంది. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఆ స్థాయిలో మెజార్టీ దక్కించుకోవడం అప్పుడే జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ రికార్డును ఏ పార్టీ సాధించలేకపోయింది.

ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ కింద ఏకమై!
1975-77 మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ సమయంలో సోషలిస్ట్‌ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ "ఇందిరా హఠావో దేశ్‌ బచావో"(ఇందిరాను ఓడించాలి.. దేశాన్ని కాపాడాలి) అని పిలుపునిచ్చారు. ఈ నినాదంతోనే ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ కింద ఏకమై 1977 ఎన్నికల్లో విజయం సాధించాయి.

ఇప్పటికీ ఆ నినాదంతో!
1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ "గరీబీ హఠావో"- పేదరికాన్ని పారద్రోలుదాం అనే నినాదం ఇచ్చింది. ఈ స్లోగన్‌తో ప్రజల్లోకి వెళ్లిన హస్తం పార్టీకి ఆ ఎన్నికల్లో ఘన విజయం దక్కింది. అయితే, ఈ నినాదం ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత శక్తిమంతమైన నేత ఇచ్చిన "గరీబీ హఠావో" హామీ దేశ చరిత్రలోనే అతి పెద్ద బూటకమని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల కష్టాన్ని!
"జై జవాన్‌.. జై కిసాన్ " దేశ రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి 1965లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ సభలో ఈ నినాదమిచ్చారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్న జవాన్ల త్యాగాలు, దిగుమతులపై ఆధారపడకుండా ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల కష్టాన్ని కొనియాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు. 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ఈ నినాదాన్ని కాస్త మార్చి 'జై జవాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌' అని చేర్చారు. పోఖ్రాన్‌ అణు పరీక్షలతో మన దేశం చాటిన వైజ్ఞానిక సత్తాను అభినందిస్తూ వాజ్‌పేయీ ఈ నినాదమిచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బలంగా 'తొలి' అడుగు- రాష్ట్రమంతా బ్రాండ్‌ మోదీ- గుజరాత్​ క్లీన్ స్వీప్​పై బీజేపీ కన్ను! - Lok Sabha Elections 2024

మహారాష్ట్రలో ఉత్కంఠ పోరు- వదినా-మరదళ్ల మధ్య టఫ్ పైట్- శిందే కూతురు గెలుస్తుందా? - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.