ETV Bharat / bharat

'రైతు మృతి బాధాకరం- చర్చలు కొనసాగించాలి'- కేంద్రానికి వెంకయ్య విజ్ఞప్తి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 3:56 PM IST

Updated : Feb 22, 2024, 5:06 PM IST

Venkaiah Naidu On Farmer Death
Venkaiah Naidu On Farmer Death

Venkaiah Naidu On Farmer Death : దిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో రైతు మరణించడం దురదృష్టకరం అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని వర్గాలకూ అనుకూలమైన ఫలితం వచ్చేలా చర్చలు జరగాలని కోరారు.

Venkaiah Naidu On Farmer Death : దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనల్లో ఓ అన్నదాత మృతి చెందడం దురదృష్టకరం అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని వర్గాలకూ అనుకూలమైన ఫలితం వచ్చేలా చర్చలు జరగాలని కోరారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు వెంకయ్య నాయుడు.

"దిల్లీలో కొనసాగుతున్న నిరసనల్లో రైతు మృతి చెందడం చాలా బాధాకరం. అందరికీ సంతృప్తికరమైన ఫలితం వచ్చేలా సహృదయ, అర్థవంతమైన వాతావరణంలో చర్చలు జరగాలని ప్రభుత్వానికి, రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని విధాలుగా శాంతిని కాపాడేందుకు భాగస్వాములందరూ కృషి చేయాలి"
-- వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి

రైతు మృతికి కారణమైన వారిపై హత్య కేసు!
నిరసనల్లో అన్నదాత శుభకరణ్ సింగ్​ మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయాలని రైతు నేత సర్వాన్ సింగ్ పంధేర్ గురువారం డిమాండ్ చేశారు. రాష్ట్ర భూభాగంలోకి ప్రవేశించి 25-30 ట్రాక్టర్ ట్రాలీలను ధ్వంసం చేసిన హరియాణా పారామిలిటరీ సిబ్బందిపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంధేర్​ కోరారు. ఇక శుభకరణ్​కు పంజాబ్ ప్రభుత్వం 'అమరవీరుడు' హోదా ఇవ్వాలని మరో రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతు మృతికి నిరసనగా ఇళ్లు, వాహనాలపై నల్ల జెండాలు ప్రదర్శించి నిరసన తెలియజేయాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ పంజాబ్‌-హరియాణా సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం (ఫిబ్రవరి 21) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అన్నదాతలు తలపెట్టిన 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో శుభకరణ్ సింగ్‌ అనే ఓ యువ రైతు (21) ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ను పంజాబ్‌లోని భటిండా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో హరియాణాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను సస్పెండ్‌ చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని కేంద్ర హోంశాఖ పంజాబ్‌ ప్రభుత్వానికి సూచించింది. రైతుల దిల్లీ చలో పిలుపు నేపథ్యంలో ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై ఘాటుగా స్పందించిన పంజాబ్‌ సర్కారు హరియాణా పోలీసుల చర్యల వల్ల 160 మందికిపైగా రైతులు గాయపడినట్లు తెలిపింది. మరోవైపు రైతు సంఘాలు ఇచ్చిన దిల్లీ చలో కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఐదోసారి చర్చలకు రావాలని రైతు సంఘాలను ఆహ్వానించింది.

'దిల్లీ చలో'కు రెండు రోజులు బ్రేక్- బుల్లెట్​ తగిలి ఓ యువరైతు మృతి- యుద్ధ భూమిలా సరిహద్దు!

'రైతుల కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం'- అన్నదాతల నిరసన వేళ మోదీ కీలక వ్యాఖ్యలు

Last Updated :Feb 22, 2024, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.