ETV Bharat / bharat

'అభివృద్ధి కోసం దేవుడు పంపిన వ్యక్తి మోదీ'- 'ఈటీవీ భారత్'​తో శివరాజ్ సింగ్ ముఖాముఖి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 8:10 PM IST

Updated : Feb 22, 2024, 10:09 PM IST

Shivraj Singh Chouhan ETV Bharat Interview : దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి అనుహ్య ఫలితాలు వస్తాయని 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. మోదీపై ప్రశంసల వర్షం కురింపించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్​పీ వంటి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో విజయావకాశాలు, రైతుల ఉద్యమం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు మీకోసం.

Shivraj Singh Chouhan ETV Bharat Interview
Shivraj Singh Chouhan ETV Bharat Interview

Shivraj Singh Chouhan ETV Bharat Interview : త్వరలో జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి దక్షిణ భారతమే అతిపెద్ద సవాల్. అందుకే నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవమున్న శివరాజ్ సింగ్ చౌహాన్​కు దక్షిణాది బాధ్యతలను బీజేపీ అప్పగించింది. అందులో భాగంగా సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం హైదరాబాద్​కు వచ్చారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్‌'తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో విజయావకాశాలు, రైతుల ఉద్యమం, ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

'దక్షిణాదిలో ఊహించని ఫలితాలు వస్తాయి'
దక్షిణ భారతంలో బీజేపీ బలహీనంగా ఉందని అనుకుంటున్నారని, కానీ ఈసారి ఊహించని ఫలితాలు వస్తాయని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్టాటకలో మొత్తం 28 సీట్లలో తమ అభ్యర్థులు గెలుస్తారని జోస్యం చెప్పారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలను వివరించారు.

'ఈటీవీ భారత్'​తో శివరాజ్ సింగ్ ముఖాముఖి

'మోదీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి దారిద్ర్య రేఖ ఎగువకు వచ్చారు. పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించాం. 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము. 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాము. 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. వీధి వ్యాపారుల పథకం వల్ల చిన్న దుకాణదారులు లబ్ధి పొందారు.' అని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు.

'ప్రజలు మోదీతోనే ఉన్నారు'
దక్షిణ భారత ప్రజల హృదయాల్లో కూడా మోదీ ఉన్నారని చౌహాన్ అన్నారు. 'నేను కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో పర్యటించాను. కర్ణాటకలోని గ్రామాలను సందర్శించి, క్రైస్తవులు, ముస్లింలతో సహా అందరు లబ్ధిదారులతో మాట్లాడాను. వారు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి ప్రజలు ఆయనతో (ప్రధాని మోదీ) ఉన్నారని నేను భావిస్తున్నాను. అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, CAA అమలు, ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, దేవాలయాల పునరుద్ధరణ వంటి చారిత్రక నిర్ణయాల వల్ల మూడో పర్యాయంలోనూ మోదీ భారత్​ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తారని భారతీయులు ఆశిస్తున్నారు. అభివృద్ధి చెందిన భారత్ మోదీ లక్ష్యం, గ్యారంటీ. అందుకోసం ఇప్పటికే పునాది వేశారు.' అని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

'అభివృద్ధి కోసం దేవుడు పంపిన వ్యక్తి మోదీ'
భారతదేశ అభివృద్ధి కోసం దేవుడు పంపిన అత్యున్నత వ్యక్తి మోదీ అని శివరాజ్ కొనియాడారు. అత్యంత ముఖ్యమైన పనుల కోసమే దేవుడు ఇలాంటి వ్యక్తులను పంపుతాడని ప్రశంసించారు. 'భారత్ అభివృద్ధి ప్రస్థానంలో మోదీ చరిత్ర సృష్టించారు. ఇది అరుదైన, ఊహకు అందనిది. ఆయన అభివృద్ధి ద్వారా ప్రజల విశ్వాశాన్ని గెలుచుకున్నారు. విపక్ష పార్టీలు కులగణన గురించి మాట్లాడాయి. కానీ మోదీ దృష్టిలో పేదలు, రైతులు, యువత, మహిళలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయి. ఈ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆయన శ్రమించారు' అని ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.

''మమత' లేని మమత'
బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై శివరాజ్ విమర్శలు గుప్పించారు. ఆమెకు 'మమత(affection)' లేదని ఎద్దేవా చేశారు. 'నేను అక్కడికి (బంగాల్‌కు) వెళ్లి సందేశ్‌ఖాలీ గురించి మాట్లాడాను. ప్రజలు తమ బాధను వ్యక్తం చేశారు. మమత ఒక మహిళ అయి ఉండి మహిళల బాధలు అర్థం చేసుకోలేక పోయారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కొట్టారు. ఈ పరిణామాలపై టీఎంసీకి బంగాల్ ప్రజలు గుణపాఠం చెబుతారనే నమ్మకం నాకుంది. ఆమె అన్యాయానికి వ్యతిరేకంగా మమతకు మేము సమాధానం చెబుతాం. అందుకోసం బీజేపీ శక్తిని కూడగట్టుకుని పోరాడుతోంది' అని శివరాజ్ సింగ్ మండిపడ్డారు.

'బీజేపీ రైతు పక్షపాతి'
పంజాబ్​లో రైతు నిరసనల గురించి శివరాజ్ మాట్లాడారు. బీజేపీ ఎప్పుడూ రైతులకు మద్దతిస్తుందని చెప్పారు. ఇక ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ పొత్తు గురించి కూడా చౌహాన్ మాట్లాడారు. 'సమాజ్‌వాదీ పార్టీ మునిగిపోతోందని అఖిలేశ్​కు తెలుసు. (ఉత్తర్​ప్రదేశ్​లో) మొత్తం 80 స్థానాల్లో బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాంగ్రెస్‌కు ఏమీ మిగలలేదు. సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ప్రజలకు ఒక లేఖ రాశారు. లోక్‌సభలో గెలవడం సాధ్యం కానందున ఆమె పోటీ చేయబోనని రాశారు. అందుకే రాజ్యసభను ఎంపిక చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలు ఏం చేయలేవు. (మధ్యప్రదేశ్​లో) మొత్తం 29 లోక్‌సభ స్థానాల్లో మేమే విజయం సాధిస్తాం" అని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'దిక్కులేని కాంగ్రెస్'
'దిక్కులేని' కాంగ్రెస్ ముగింపు అంచున ఉందని శివరాజ్ అన్నారు. బీజీపీ తనకు చాలా ఇచ్చిందని, పార్టీకి తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

'రైతుల కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం'- అన్నదాతల నిరసన వేళ మోదీ కీలక వ్యాఖ్యలు

'రైతు మృతి బాధాకరం- చర్చలు కొనసాగించాలి'- కేంద్రానికి వెంకయ్య విజ్ఞప్తి

Last Updated : Feb 22, 2024, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.