ETV Bharat / bharat

పరివార్‌వాదం, అవినీతి, బుజ్జగింపులకు మించి కాంగ్రెస్ ఆలోచించదు: మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 3:01 PM IST

PM Modi On Congress : కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ లేదని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. పరివార్‌వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆ పార్టీ ఆలోచించదని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.

PM Modi On Congress
PM Modi On Congress

PM Modi On Congress : కాంగ్రెస్ పార్టీ పరివార్‌వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిపోయిందని తెలిపారు. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్‌గఢ్ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయ్​పుర్​లో రూ.34,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మోదీ. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినప్పుడు, అభివృద్ధిలో ఛత్తీస్‌గఢ్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దశ, దిశ కూడా అప్పటి లానే ఉన్నాయని మోదీ దుయ్యబట్టారు. పరివార్‌వాదం, అవినీతి, బుజ్జగింపులకు అతీతంగా కాంగ్రెస్ ఆలోచించదని అన్నారు. తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును రూపొందించడంలో మాత్రమే ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారని ఆరోపించారు.

'మోదీకి ప్రజలే కుటుంబం'
ప్రజల గురించి ఎన్నటికీ కాంగ్రెస్​ ఆలోచించలేదని ఆరోపిందారు మోదీ. కానీ మోదీకి ప్రజలే కుటుంబమని, వారి కలలే ముఖ్యమని చెప్పారు. పేదలు, యువత, మహిళల సాధికారతతోనే అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్‌ను నిర్మించవచ్చని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని, బీజేపీ ప్రభుత్వం దానిని వేగవంతం చేసిందని తెలిపారు.

'దేశానికి సహకారం రంగం సహాయం చేయాలి'
మరోవైపు, సహకార రంగం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులైన వంటనూనెలు, ఎరువుల దిగుబడుల తగ్గింపు విషయమై సహకార రంగం దేశానికి సహాయం చేయాలని మోదీ కోరారు. దిల్లీలోని దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు- PACSల పరిధిలో 11 గోదాములను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు.

"మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల పథకం/బండారన్‌ పథకం ప్రారంభించాం. దీని ద్వారా దేశం నలుమూలల వేలాది గిడ్డంగులు, వేలాది గోదాముల నిర్మాణం జరగనుంది. అలాగే 18వేల పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ కూడా పూర్తయింది. ఈ పనులన్నీ దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల విస్తరణకు, వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయనున్నాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

18 వేల PACSల్లో కంప్యూటరీకరణ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 11రాష్ట్రాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు- PACSల పరిధిలో 11 గోదాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకుండా దేశవ్యాప్తంగా 500 PACS పరిధిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ రంగంలో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన కూడా చేశారు. దేశవ్యాప్తంగా 18 వేల PACSల్లో కంప్యూటరీకరణ ప్రాజెక్ట్‌కు కూడా ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు.

రూ.52,250 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం!
మరోవైపు, ఫిబ్రవరి శని, ఆదివారాల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా రూ.52,250 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో భాగంగా (గుజరాత్), బఠిండా (పంజాబ్), రాయ్‌బరేలీ (ఉత్తర్​ప్రదేశ్), కల్యాణి (బంగాల్), మంగళగిరి (ఆంధ్రప్రదేశ్)లో ఎయిమ్స్ ఆస్పత్రులను ప్రారంభించనున్నారు. పుదుచ్చేరిలోని కారైకల్‌లో జిప్‌మర్ మెడికల్ కాలేజీతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు.

ద్వారకలో దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును మోదీ ప్రారంభం చేయనున్నారు. 2.32 కి.మీ పొడవు ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జి దేశంలోనే అతి పొడవైనదని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్​తో సుదర్శన్ సేతును నిర్మించారు అధికారులు. ఇరువైపు శ్రీకృష్ణుడి చిత్రాలను అమర్చారు. ఫుట్‌పాత్​పై భాగంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు.

'రైతుల కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం'- అన్నదాతల నిరసన వేళ మోదీ కీలక వ్యాఖ్యలు

'జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకి- దానిపై సినిమా రావడం మంచి విషయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.