ETV Bharat / bharat

244మందిపై క్రిమినల్ కేసులు- బరిలో 123మంది మహిళలు- ఎన్నికల థర్డ్ ఫేస్ లెక్క ఇదీ - lok sabha elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 7:50 PM IST

ADR Report Third Phase Elections
ADR Report Third Phase Elections

ADR Report Third Phase Elections : మూడో విడత పోలింగ్‌కు వారం రోజులే సమయమున్న తరుణంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను విడుదల చేసింది. మే 7న జరిగే ఎన్నికల ప్రక్రియలో ప్రజాతీర్పును కోరనున్న అభ్యర్థుల్లో ఎంతమంది నేరచరితులు ఉన్నారు? ఎంతమంది ధనికులు ఉన్నారు? ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు? అనే చిట్టాను ఏడీఆర్ బయటపెట్టింది.

ADR Report Third Phase Elections : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తయింది. మూడో విడత పోలింగ్ మే 7వ తేదీన జరగబోతోంది. ఇందులో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 95 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఆయా స్థానాల్లో మొత్తం 1,352మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 244 మంది (18 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిలో 172 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు, ఐదుగురిపై హత్య కేసులు, 38 మందిపై మహిళలపై అత్యాచారం సహా నేరాలకు సంబంధించిన కేసులు, 17 మంది అభ్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నాయి.

పార్టీలవారీగా లెక్క ఇదీ
మూడో విడత ఎన్నికల బరిలో బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల్లో 22 మందిపై, కాంగ్రెస్‌కు చెందిన 68 మంది అభ్యర్థుల్లో 26 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. బిహార్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో, అందరిపైనా కేసులు ఉన్నాయని పేర్కొంది. శివసేనకు(ఉద్ధవ్ వర్గం) చెందిన 80 శాతం మంది అభ్యర్థులపై, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్​ పవార్)కు చెందిన 67 శాతం మంది అభ్యర్థులపై, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 50 శాతం మంది అభ్యర్థులపై, జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన 33 శాతం మంది అభ్యర్థులపై, తృణమూల్ కాంగ్రెస్‌‌కు చెందిన 17 శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. ఏదైనా లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కనీసం ముగ్గురిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్‌ స్థానాలుగా ఏడీఆర్​ ప్రకటిస్తుంది. మూడో విడతలో 95 లోక్‌సభ స్థానాలకుగానూ 43 చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించడం గమనార్హం.

ఎంత మంది కోటీశ్వరులంటే?
మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతుల విషయానికొస్తే, 1,352 మంది అభ్యర్థులలో 392 మంది (29%) కోటీశ్వరులే. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 82 మంది అభ్యర్థుల్లో 77మంది (94 శాతం) కోటీశ్వరులే. కాంగ్రెస్‌కు చెందిన 68 మంది అభ్యర్థులలో 60 మంది (88%) కోటీశ్వరులు ఉన్నారు. జేడీయూ, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన (శిందే), ఎన్సీపీ (శరద్​ పవార్‌) పార్టీ అభ్యర్థులంతా కోటీశ్వరులే కావడం గమనార్హం. మూడో విడత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.66 కోట్లుగా ఉంది. అత్యధికంగా బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.44.07 కోట్లుగా ఉంది. 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తుల సగటు రూ.20.59 కోట్లుగా ఉంది.

నిరక్షరాస్య అభ్యర్థులు
మూడో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 591 మంది అభ్యర్థులు (44%) తాము గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువే చదివామని ప్రకటించారు. 44 మంది అభ్యర్థులు డిప్లొమా హోల్డర్లు, 639 మంది అభ్యర్థులు (47%) ఆరో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు చదువుకున్నవారు ఉన్నారు. 56 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు. 19 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులమని ప్రకటించారు.

మహిళా అభ్యర్థులు చాలా తక్కువ
మూడోవిడత ఎన్నికల్లో చేస్తున్న 1352 మంది అభ్యర్థుల్లో 123 మందే మహిళలు ఉన్నారు. గరిష్ఠంగా 712 మంది అభ్యర్థులు 41-60 ఏళ్లలోపు వారు. 228 మంది అభ్యర్థులు 61-80 ఏళ్లలోపు వారు. ఒక అభ్యర్థి వయస్సు 84 సంవత్సరాలు.

హాసన్​ సెక్స్ రాకెట్​లో షాకింగ్ నిజాలు- ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్నపై వేటు! - Prajwal Revanna Suspension From JDS

'సీఎం విధులకు ఎవరైనా అంతకాలం దూరంగా ఉండొచ్చా?'- కేజ్రీవాల్ అరెస్టుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - Arvind Kejriwal Delhi High Court

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.