తెలంగాణ

telangana

నాడు గాంధీ అడుగుజాడల్లో పోరాటం.. నేడు..

By

Published : Aug 29, 2021, 10:25 PM IST

nereducherla gandhi

97 ఏళ్ల వయసులోనూ కర్రసాము చేస్తున్న ఈయన పేరు తాటికొండ రామ నరసింహారెడ్డి.. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన వ్యక్తిగా.. నేరేడుచర్ల గాంధీగా అందరికీ సుపరిచితుడు. నేరేడుచర్ల సర్పంచ్​గా, ఆ మండలానికి తొలి ఎంపీపీగా రామనరసింహారెడ్డి సేవలందించారు. అనంతరం కోదాడ- నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​గాానూ పనిచేశారు. వయసు రీత్యా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయలేకపోతున్నానని చెప్పారు.

నాడు గాంధీ అడుగుజాడల్లో పోరాటం.. నేడు..

నాడు మహాత్మా గాంధీ నాయకత్వ పటిమకు ఆకర్షితుడై స్వాతంత్య్ర ఉద్యమ బాట పట్టిన ఈయన పేరు తాటికొండ రామ నరసింహారెడ్డి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఈయన.. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని ఇల్లెందు జైలులో ఏడాడి పాటు జైలు జీవితం గడిపారు. నాటి ఉద్యమ కాలంలో అనుచరులు, పేదలకు అండగా ఉండేందుకు.. తనకున్న 30 ఎకరాల్లో 20 ఎకరాల భూమిని అమ్మారు. స్వాతంత్య్రం అనంతరం సమరయోధులకు వచ్చే పింఛను సైతం నిరాకరించారు. నేరేడుచర్ల గాంధీగా పేరొందారు. 97 ఏళ్ల వయసులోనూ తనకు ఇష్టమైన కర్రసామును విడిచిపెట్టలేదు.

రెండో పెళ్లికి నిరాకరించి..

పత్తేపురం గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మను రామనరసింహారెడ్డి వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి రెండో కుమారుడు నర్సిరెడ్డి జిల్లా జడ్జిగా పనిచేస్తున్నారు. భార్య మరణాంతరం.. రెండో పెళ్లికి నిరాకరించి.. గ్రామానికి చెందిన ఒకరిని సహాయకురాలిగా పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.

నేరేడుచర్ల సర్పంచ్​గా, ఆ మండలానికి తొలి ఎంపీపీగా రామనరసింహారెడ్డి సేవలందించారు. కోదాడ- నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​గానూ పనిచేశారు. ప్రజాప్రతినిధిగా సేవలందించిన సమయంలో ఎందరో పేదలకు కాలనీలు ఇప్పించారు. గ్రామస్థుల సాయంతో పాత నేరేడుచర్లలో గాంధీ, కస్తూరిబా విగ్రహాలతో మందిరం నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజాజీవితం తర్వాత తనకు వారసత్వంగా వచ్చిన పాత పెంకుటింట్లోనే ఇప్పటికీ నివాసముంటున్నారు.

'నాడు యుక్తవయసులో ఉన్నప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చిన సాయం చేశా. ఇప్పటికీ సాయం చేయాలనే తపన ఉన్నా.. వయస్సు 97 కావడం వల్ల ఏం చేయలేకపోతున్నా.. అదే నాకు బాధగా అనిపిస్తోంది. ఎవరు ముందుకొచ్చి ప్రజలకోసం పనిచేస్తారా అని వేచి చూస్తున్నా..'

- తాటికొండ రామ నరసింహారెడ్డి (నేరేడుచర్ల గాంధీ)

ఇదీచూడండి:BANDI SANJAY: '2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం'

ABOUT THE AUTHOR

...view details